Share News

9న తుంగభద్ర డ్యామ్‌కు నిపుణుల కమిటీ

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:50 PM

తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీల్లో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది.

9న తుంగభద్ర డ్యామ్‌కు నిపుణుల కమిటీ
తుంగభద్ర డ్యాం

రికార్డులు సిద్ధం చేస్తున్న బోర్డు అధికారులు

కర్నూలు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీల్లో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎస్‌ఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది. గత నెల 10న చైన లింక్‌ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటు మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. దీనికోసం జాతీయ జలాశయాలు భద్రతా సంస్థ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన ఏకే బజాజ్‌ నేతృత్వంలో బృందం పర్యటించనుంది. ఢిల్లీకి చెందిన రిటైర్డ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు హర్కేశ కుమార్‌, జాతీయ, అంతర్జాతీయ సాగునీటి ప్రాజెక్టుల కోసం పని చేసిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెకానికల్‌ ఇంజనీరింగ్‌ నిపుణుడు తారాపురం సుధాకర్‌ సహా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంపిక చేసే ఇంజనీరింగ్‌ ప్రతినిధులతో కూడిన ఆరుగురు సభ్యుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఎనడీఎస్‌ఏ నియమించిన సీడబ్ల్యూసీ మాజీ చైర్మన ఏకే బజాజ్‌, హర్కేశకుమార్‌, తారాపురం సుధాకర్‌ ఈ ముగ్గురు హైడ్రో-మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌ సిస్టమ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌గా వివిధ అధ్యయన కమిటీల్లో ఇప్పటికే పని చేసిన అనుభవం ఉంది. ఆగస్టు 10న తుంగభద్రకు వరద తగ్గడంతో రాత్రి ఎత్తిన క్రస్ట్‌ గేట్లు దింపుతున్నారు. ఆ సమయంలో చైన లింక్‌ తెగిపోవడంతో 19వ నంబరు గేటు కొట్టుకుపోయిందని టీబీపీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. చైనలింక్‌ తెగిపోయినా క్రస్ట్‌గేట్‌ గ్రూవ్‌ (గాడి) నుంచి విడిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులు చంద్రబాబు, సిద్ధరామయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్‌ ఎలిమెంట్‌ ఏర్పాటు చేయించారు. స్టాప్‌లాగ్‌ ఏర్పాటులో క్రస్ట్‌గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు కీలక పాత్ర పోషించి రైతు బాంధవుడుగా నిలిచిపోయారు. అయితే.. గేటు ఎలా కొట్టుకుపోయింది..? మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం ముందు, తరువాత క్రస్ట్‌గేట్లు తనిఖీ, చేపట్టిన మరమ్మతులు వివరాలు సహా డ్యాం డిజైన, హైడ్రో - మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌ డిటైల్స్‌ కావాలని నిపుణుల కమిటీ బోర్డు అధికారులను కోరినట్లు సమాచారం. కమిటీ అడిగే వివరాలు తక్షణమే అందించేందుకు అవసరమైన సమగ్ర వివరాలతో టీబీపీ బోర్డు అధికారులు నివేదికలు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఎనడీఎస్‌ఏ నియమించిన నిపుణుల కమిటీలో హైడ్రో-మెకానికల్‌, ఎలకి్ట్రకల్‌ సిస్టమ్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌లలో ఒకరైన తారాపురం సుధాకర్‌ జిల్లాకు చెందిన ఆదోని పట్టణవాసి కావడం కొసమెరుపు.

ఏకే బజాజ్‌కు 35 ఏళ్లకు పైగా అనుభవం

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల భద్రతపై అధ్యయనం కోసం నేషన ల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎంపిక చేసిన నిపుణుల కమిటీ చైర్మన ఏకే బజాజ్‌ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మనగా 2008 ఏప్రిల్‌ 14 నుంచి 2011 ఆగస్టు 31 వరకు మూడున్నరేళ్లుగా పని చేశారు. ఢిల్లీకి చెందిన ఏకే బజాజ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ పట్టా అందుకున్నారు. ఆ తరువాత ఫ్లడ్‌, వాటర్‌ రిసోర్సెస్‌ అంశాలపై ఎంటెక్‌ చేశారు. కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో పని చేశారు. సీడబ్ల్యూసీ చైర్మనగా, భారత ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శిగా పని చేశారు. పర్మనెంట్‌ కమిటీ ఫర్‌ టెక్నికల్‌ యాక్టివిటీస్‌ (పీసీటీఏ), పర్మనెంట్‌ ఫైనాన్స కమిటీ (పీఎఫ్‌సీ), ఐసీఐడీ స్టాఫ్‌ కమిటీ (ఎస్‌సీ) సభ్యుడిగా కూడా ఉన్నారు. దేశంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు డిజైన, ప్రణాళిక తయారీ, మేజర్‌, మీడియం, బహుళార్థసాధక ప్రాజెక్టుల ఏటా వరద నిర్వహణ (ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌)పై 35 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.

Updated Date - Sep 06 , 2024 | 11:50 PM