Share News

ఏడు ఊర్ల గవి

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:21 AM

దివిటి దొంగల నుంచి ప్రాణాలు కాపాడిన ఆనాటి ఏడు ఊర్ల గవి నేడు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది.

   ఏడు ఊర్ల గవి
గవిలోకి వెళ్తున్న మార్గం

సహజసిద్ధమైన జలధార

తరలివస్తున్న భక్తులు, ప్రకృతి ప్రేమికులు

గడివేముల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): దివిటి దొంగల నుంచి ప్రాణాలు కాపాడిన ఆనాటి ఏడు ఊర్ల గవి నేడు ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది. పచ్చని చెట్లు, ఎర్రమల సానువులలో ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఏడు ఊర్ల గవి ఎన్నో విశేషాల నెలవు. నంద్యాల జిల్లా గడివేముల మండలంలోని పైబోగుల గ్రామ సమీపంలో ఉన్న ఈ గవిలో విశాలమైన గుహ, శివలింగం, నిత్యం శివుడిని అభిషేకిస్తున్న నీటి ధార.. ప్రజలను ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంగా పరిఢవిల్లుతోంది. పూర్వం ఈ ప్రాంతంలో దివిటి దొంగల బెడద ఎక్కువగా ఉండేది. వారి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు ఏడు ఊర్ల ప్రజలు ఈ గవిలో కొన్నేళ్ల పాటు తలదాచుకునేవారు. గుహ ముఖద్వారం చిన్నగా ఉన్నా లోనికి వెళ్లే కొద్ది విశాలంగా ఉంది.

ఫ నిత్యం శివుడిని అభిషేకిస్తున్న నీటి ధార

ఏడు ఊర్ల గవి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడా నీటి నిల్వలు లేవు. ఈ గుహలోని శివలింగంపై మాత్రం నిత్యం నీటిధార పడుతూ భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. గుహలో ఉన్న శివలింగానికి భక్తులు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి, కార్తీకమాస పర్వదినాల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ప్రభుత్వం స్పందించి ఈ గవిని అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందుతుంది.

ఫ ఏడు ఊర్ల గవికి ఎలా చేరుకోవాలంటే..

గడివేముల మండలం నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న బొల్లవరం చేరుకొని అక్కడి నుంచి పైబోగులకు వెళ్లే మట్టిదారిలో 2.50 కి.మీ వెళ్తే ఈ గవిని చేరుకోవచ్చు.

Updated Date - Nov 19 , 2024 | 12:21 AM