‘దీపం’తో దీపావళి!
ABN , Publish Date - Oct 22 , 2024 | 04:54 AM
సూపర్ సిక్స్’లో తొలి హామీ అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి కానుకగా పేదల వంటిళ్లలో ‘దీపం’ వెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
31 నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 24 నుంచి బుకింగ్‌కు ఏర్పాట్లు
‘సూపర్ 6’ హామీల అమలుకు శ్రీకారం
అర్హులందరికీ పథకం అందేలా చర్యలు
ప్రతి నాలుగు నెలలకు ఒకటి..
డెలివరీ తీసుకున్న రెండు రోజుల్లో
ఖాతాల్లో సిలిండర్ సబ్సిడీ మొత్తం జమ
పథకం అమలుకు ఏటా 2,684 కోట్లు
అధికారులు, కంపెనీలతో సీఎం సమీక్ష
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
‘దీపం’ గొప్ప ముందడుగు: చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘సూపర్ సిక్స్’లో తొలి హామీ అమలుకు ముహూర్తం కుదిరింది. దీపావళి కానుకగా పేదల వంటిళ్లలో ‘దీపం’ వెలిగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అర్హులైన వారికి ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు. ఈ పథకం అమలు, విధివిధానాలపై సోమవారం సచివాలయంలో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ ఉన్నతాధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఉచిత గ్యాస్ సిలిండర్లను ఈనెల 24 నుంచే బుకింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈనెల 31న దీపావళి పండుగ రోజున లబ్ధిదారులకు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో సిలిండర్ ధరను చెల్లించాల్సి ఉంటుంది. అందులో కేంద్ర ప్రభుత్వం తన రాయితీ రూ.25ను లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. వెరసి... వారికి సిలిండర్ పూర్తి ఉచితంగా లభిస్తుంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని పారదర్శకంగా వర్తింపజేయాలని, విమర్శలు లేకుండా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
‘సూపర్ సిక్స్’ హామీ...
మహిళలకు ఇంటిఖర్చులు తగ్గించేందుకు ఉమ్మడిరాష్ట్రంలో ‘దీపం’ పథకం అమలులోకి తెచ్చామని, ఇప్పుడు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘దీపం పథకం దీపావళి పండుగకు ఇళ్లల్లో వెలుగులు తెస్తుంది. వంట గ్యాస్ కోసం ఖర్చు చేసే డబ్బులను గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. అందుకే ఆర్థిక సమస్యలున్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాం’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు.. ఈ పథకం అమలుకు తీసుకున్న చర్యలపై పౌరసరఫరాల శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి 4నెలలకు ఒకటి చొప్పున ఉచిత సిలిండర్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ‘‘ప్రస్తుతం సిలిండర్ ధర రూ.876. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.25పోనూ.. మిగిలిన రూ.851 పూర్తి రాయితీతో ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకోవచ్చు. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.2,684 కోట్ల భారం పడుతుంది’’ అని వివరించారు.