Share News

లంబోదరా నమోఃనమః

ABN , Publish Date - Sep 06 , 2024 | 11:56 PM

ఏడాదిలో ఎన్ని పండుగలు వచ్చినా ‘వినాయక చవితి’ తెచ్చే సంబరం.. సంతోషం ఎంతో ప్రత్యేకం.

లంబోదరా నమోఃనమః
మార్కెట్‌లో వివిధ రకాల విగ్రహాలు

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 6: ఏడాదిలో ఎన్ని పండుగలు వచ్చినా ‘వినాయక చవితి’ తెచ్చే సంబరం.. సంతోషం ఎంతో ప్రత్యేకం. పల్లె నుంచి పట్టణం దాకా ఎవరి స్థాయిలో వారు అంబరాన్నంటేలా సంబరాల పండుగ వినాయక చవితి. ఉమ్మడి కర్నూలు జిల్లా అంతటా వాడవాడలా ఇప్పటికే గణేశ మండపాలు ఏర్పాటయ్యాయి. విభిన్న రూపాల్లో రూపుదిద్దుకున్న గణపతి ప్రతిమలను యువకులు కొనుగోలు చేసి మండపాల వద్దకు ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లారు. శనివారం చవితినాడు గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు పండుగకు అవసరమైన పూలు, పండ్లు తదితర సామగ్రి దుకాణాలు కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

జిల్లాలో నవరాత్రి వేడుకల సందడి

తొమ్మిదిరోజుల పాటు విశేషంగా అలరించే నవరాత్రి ఉత్సవాల సందడి శుక్రవారం సాయంత్రం నుంచే కానవచ్చింది. వివిధ ప్రాంతాలకు చెందిన గణేశ్‌ ఉత్సవ కమిటీల నిర్వాహకులు తమ తమ మంటపాలకు ఉత్సవ మూర్తులను తరలిస్తూ కానవచ్చారు. కొన్ని ప్రాంతాల్లో డీజే సౌండ్‌ సిస్టమ్స్‌, డప్పు నృత్యాలతో, బాణసంచా కాలు స్తూ సందడిగా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి, మంటపాల్లో ప్రతిష్టించారు. మంటపాల చుట్టూ రంగు రంగుల విద్యుద్దీపాలు, ప్రత్యేక అలంకణలు చేయడంలో నిమగ్నమయ్యారు. లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి, భక్తిపాటలతో సిద్ధమయ్యారు. వేడుకల సందర్భంగా గణేశ్‌ నవరాత్రి మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు పలు సూచనలు చేశారు. జిల్లాలో ఈ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వారు కోరారు.

63 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతి

కర్నూలు (కల్చరల్‌), సెప్టెంబరు 6: పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెబుతూ కర్నూలుకు చెందిన యువత ఏకంగా 63 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ గణపతి మూర్తిని రూపొందించారు. గణేశ నవరాత్రి ఉత్సవాల్లో ఈ భారీ మట్టి వినాయకుడు భక్తులతో 11 రోజుల పాటు పూజలు అందుకోనున్నారు. నగరంలోని పెద్ద మార్కెట్‌ సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఈ ఉత్సవ గణపతిని నెలకొల్పారు. బంకమట్టి, వెదురు బద్దలు, జనపనార, కొబ్బరిపీచు, గడ్డి, నీటిలో సులువుగా కరిగి పోయే సంప్రదాయ రంగులతో ఈ విగ్రహాన్ని రూపొందిం చారు. ఇతర గణపతి మూర్తుల్లా కాకుండా, గణేశ నవరాత్రి ఉత్సవాల అనంతరం ఈ మట్టి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించకుండా ఉన్న చోటే నిమజ్జనం చేస్తున్నారు. ఫైర్‌ ఇంజన్ల ద్వారా నీటిని విగ్రహంపై పిచికారీ చేస్తూ కరిగిన మట్టి తుంగభద్ర నదిలో కలిసిపోయేలా ఏర్పాట్లు చేశారు. నగరంలోని లక్ష్మీనరసింహ స్వామి వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఈ భారీ గణపతి మూర్తిని తయారు చేసేందుకు ప్రత్యేకంగా కోల్‌కతాకు చెందిన 15 మంది కళాకారులు నెల రోజులుగా శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. పీఓపీ, రసాయనాలతో కూడిన విగ్రహాల వల్ల జలకాలుష్యం అయి, నీటిలోని జీవరాశి నశించి పోతుందని, పర్యావరణ హిత గణపతులను పూజించాలనే నినాదంతో ఈ విగ్రహాన్ని నెలకొల్పినట్లు నిర్వాహకుడు కల్యాణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 06 , 2024 | 11:56 PM