సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలు
ABN , Publish Date - Oct 19 , 2024 | 04:02 AM
సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
6 నెలల్లో ఎన్నికల నిర్వహణ మిత్రపక్షాలకు 20 శాతం పదవులు
గతంలో అరాచకాలకు పాల్పడినవారిని శిక్షిస్తాం
ఏమీ జరగడం లేదన్న అపోహలొద్దు: సీఎం
అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాలకు ముగ్గురు సభ్యుల నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఆరు నెలల్లో ఈ సంఘాలకు ఎన్నికలు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మిత్రపక్షాలకు నామినేటెడ్ పదవుల్లో 20 శాతం ఇస్తున్నట్లు చెప్పారు. ‘రాష్ట్రం మొత్తం మీద ఈ శాతం ప్రకారం ఇస్తాం. ఏదైనా నియోజకవర్గంలో వారికి ఎక్కువ ఇస్తే మరో చోట తగ్గుతాయి’ అని తెలిపారు. కింది స్థాయిలో జనసేన నేతలతో సమన్వయంలో కొన్ని సమస్యలు వస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావించారు. మిత్రపక్షాలతో ఇటువంటి సమస్యల సర్దుబాటుకు ఇద్దరు సభ్యుల కమిటీ వేస్తున్నామని, ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు ఉంటారని సీఎం చెప్పారు. ‘మనం కలసి ఎన్నికల్లో పోటీ చేశాం. కలిసే ప్రయాణించాలి. ఎక్కడైనా సమస్యలు వస్తే ముందు మీ స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం చేసుకోండి. కుదరకపోతే ఈ కమిటీ దృష్టికి తీసుకురండి’ అని సూచించారు. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని, కేంద్రం సహకారంతోనే బండి లాక్కొస్తున్నామని, ఈ విషయం కూడా ప్రజలకు చెప్పాలని అన్నారు. ‘ఎన్డీయేలో మనకు గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినా మనకు చేసే సాయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. కూటమిలో ఉన్నంత మాత్రాన అన్నీ చేయలేరు. విభజన చట్టంలో కొన్ని అంశాల కింద మనకు కొంత సాయం రావలసి ఉందని ప్రధానితో చెబితే ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల విలువైన రోడ్లు, రూ.75 వేల కోట్ల విలువైన రైల్వే లైన్లు ఇచ్చారు’ అని అన్నారు. త్వరలో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా పనిచేయాలని, తానూ వ్యక్తిగతంగా ప్రతి రోజూ పర్యవేక్షిస్తానని చెప్పారు. రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు శనివారం అధికారికంగా ప్రకటించాలని పల్లాను ఆదేశించారు. వైసీపీ హయాంలో అతి చేసిన వారిని పార్టీలోకి తీసుకోవద్దని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరారు. ‘కొత్తగా ఎవరూ రావద్దనడం సరికాదు. పార్టీ అన్న తర్వాత కొంత మంది వస్తుంటారు. కానీ తప్పులు చేసిన వారు షెల్టర్ కోసం వస్తే మాత్రం తీసుకోవద్దు’ అని చంద్రబాబు సలహా ఇచ్చారు. పార్టీ లైన్‌ను.. కేడర్‌ను విస్మరించి వ్యవహరించవద్దని గట్టిగా కోరారు. ‘ఇవి పాటించడం ఇష్టం లేకపోతే స్వతంత్రులుగా గెలిచి రావలసింది. పార్టీ తరఫున గెలిచి వచ్చినప్పుడు పార్టీ లైన్‌ను విధిగా పాటించాలి’ అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడినవారిని చట్ట ప్రకారం శిక్షించి తీరతామని స్పష్టం చేశారు. ‘ఏమీ జరగడం లేదని అపోహలు పెట్టుకోవద్దు. అన్ని ఆధారాలూ సేకరించి ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. ఆ పని జరుగుతూనే ఉంది’ అని చెప్పారు.
లేనివాళ్లకు జీతాలు పెంచాలా?
కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ‘వలంటీర్లకు పది వేలు జీతం ఇవ్వలేదని జగన్ అంటున్నాడు. వాళ్లను ఆయనే ఉద్యోగాల నుంచి తీసివేశాడు. రెన్యువల్ చేయలేదు. వలంటీర్లే లేనప్పుడు ఇక ఎవరికి జీతాలు పెంచాలి? ఆయన తాను గెలిచిన తర్వాత ఎన్ని రోజులకు డబ్బులిచ్చాడో అడగండి. ఇద్దరు పిల్లలకు అమ్మ ఒడి ఇస్తానని ఒకటికి తగ్గించాడు. ఒక ఏడాది అసలు ఇవ్వలేదు. మిగిలిన సంవత్సరాల్లో కోత పెట్టాడు. రైతు భరోసా వాగ్దానంలో సగం కోత కోసి ఇచ్చాడు. మద్యపాన నిషేధమని తర్వాత మద్యాన్ని ఏరులై పారించాడు. వీటిపై ప్రతి చోటా నిలదీయండి’ అని సూచించారు.