Share News

Payyavula Keshav: నమ్మకాన్నీ వమ్ము కానీయం

ABN , Publish Date - Jun 12 , 2024 | 07:32 PM

తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.

Payyavula Keshav: నమ్మకాన్నీ వమ్ము కానీయం
Uravakonda MLA Payyavula Keshav

అమరావతి, జూన్ 12: తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వంలో పరిస్థితి ఏవిధంగా ఉంది.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది.. ఇతరత్రా వెసులుబాట్లతోపాటు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఇవన్నీ పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఓ బ్లూ ప్రింట్ ఆఫ్ ప్రొగ్రస్ విడుదల చేస్తామన్నారు. ఏ నమ్మకాన్ని అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉంచారో.. అలాగే ఏ నమ్మకాన్ని అయితే టీడీపీ మీద పెట్టారో..ఆ నమ్మకాన్ని వమ్ము కానీయకుండా శ్రమించి పని చేస్తామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడంతో.. వారి ఆశలు ఆకాంక్షలు ఏమిటో తమకు అర్దమయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా ఉరవకొండ ప్రజలుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం ఆయన కేబినెట్‌లోని మంత్రులు ప్రమాణం చేశారు. వారిలో పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఇక ఈ రోజు సాయంత్రం మంత్రులంతా .. సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం పయ్యావుల కేశవ్‌ మీడియాతో పైవిధంగా స్పందించారు.

Updated Date - Jun 12 , 2024 | 07:32 PM