వినతులు 4396 పరిష్కారం 3327
ABN , Publish Date - Sep 29 , 2024 | 05:46 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మూడున్నర నెలల్లో సీం చంద్రబాబుకు వ్యక్తిగతంగా ప్రజల నుంచి 4,396 వినతులు అందాయి. ఇందులో 75శాతం పరిష్కారమైనట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబుకు అందిన వినతులపై అధికార వర్గాలు ఒక
వినతులు 4396 పరిష్కారం 3327
చంద్రబాబు ఆదేశాలతో సత్వర న్యాయం
మూడున్నర నెలల్లో 75 శాతం పరిష్కారం
అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మూడున్నర నెలల్లో సీం చంద్రబాబుకు వ్యక్తిగతంగా ప్రజల నుంచి 4,396 వినతులు అందాయి. ఇందులో 75శాతం పరిష్కారమైనట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబుకు అందిన వినతులపై అధికార వర్గాలు ఒక నివేదికను తయారు చేశాయి. ఈ నివేదిక ప్రకారం 3,327 వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కారం అయినట్లుగా వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారంపై సీఎంవో పరిశీలన నిర్వహించింది. ఆయా దరఖాస్తుదారులకు ఫోన్ చేసి కనుక్కొన్నారు. మొత్తం 2.5వేల వినతులపై ఈ ఆడిట్ జరిగింది. ఇందులో 1,400 మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 700 మంది అసంతృప్తి వ్యక్తం చేయగా, 400 మంది ఫోన్ తీయలేదు. దీంతో వీటిపై మరోసారి పరిశీలన జరిపారు. మొత్తంగా 150 వినతులకు సంబంధించి పరిష్కారం కాకుండానే అయినట్లుగా చూపించినట్లు తేలింది. వీటి పరిష్కారం కోసం మరోసారి ఆయా శాఖలకు పురమాయించారు. ఇందులో 50వరకూ పరిష్కారమయ్యాయి. రాష్ట్ర సచివాలయానికి సమీపంలో ఉండటంతో గుంటూరు (429), ఎన్టీఆర్ జిల్లా(358)ల నుంచి ఎక్కువ వినతులు వచ్చాయి. 200కు పైగా వినతులు వచ్చిన జిల్లాల్లో తిరుపతి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు ఉన్నాయి. 100లోపు వినతులు అందిన జిల్లాల్లో అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలు ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కారం అయ్యాయని సంతృప్తి వ్యక్తవైున జిల్లాల్లో గుంటూరు టాప్‌లో ఉంది.
3 గంటలు నిలబడిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఆయనకు వినతులు ఇవ్వడానికి వచ్చినవారితో కార్యాలయం కిక్కిరిసిపోయింది. వినతులు తీసుకోవడానికి ఆయన 3గంటల పాటు నిలబడే ఉన్నారు. దివ్యాంగులు, వృద్ధుల నుంచి కార్యాలయం ప్రధాన ద్వారం వద్దే వినతులు తీసుకొన్నారు. కొంతమందిని కార్యాలయం లోపల కలిసి వారితో మాట్లాడి వినతులు స్వీకరించారు. తర్వాత ఆవరణలో క్యూలైన్లలో ఉన్న వారి వద్దకు తానే వెళ్లి ఒకరి తర్వాత మరొకరి నుంచి తీసుకొన్నారు. ఉదయం 11.30కు కార్యాలయం లోపల అడుగుపెట్టిన ఆయన 2.30 తర్వాత వెళ్లిపోయారు. ఇంకా పెద్దసంఖ్యలో సందర్శకులు మిగిలిపోవడంతో వారినుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు తీసుకొన్నారు.
పోలీసు అధికారుల తీరుపై ఫిర్యాదు
కార్యాలయంలోని పార్టీ నేతలతో చంద్రబాబు కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన పోలీసు అధికారుల తీరుపై కొందరు నేతలు ఆయనకు ఫిర్యాదు చేశారు. ‘అనంతపురం జిల్లాలో ఒక ఆలయంలో రథాన్ని వైసీపీకి చెందిన వారు తగులబెట్టారు. విచారణ పూర్తి కాకముందే ఆ ఘటనలో రాజకీయ ప్రమేయం లేదని పోలీసు అధికారులు ప్రకటనలు ఇచ్చారు. ఆ ఘటన రాజకీయ కోణంలోనే జరిగింది. అధికారుల అత్యుత్సాహాన్ని తగ్గించాలి’ అని కోరారు. ఏం జరిగిందో తెలుసుకొంటానని చంద్రబాబు వారితో చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల తీరుతో నియోజకవర్గాల్లో సమస్యలొస్తున్నాయని నాయకులు చెప్పారు. పార్టీపరంగా దానిపై సమాచారం తెప్పిస్తున్నామని, ఆ తర్వాత వారిని పిలిపించి మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నేతలు అశోక్ బాబు, వర్ల రామయ్య, పట్టాభి, రఫీ తదితరులు పాల్గొన్నారు.
భూమిని కబ్జా చేశారు
సీఎంకు వైసీపీ బాధితుల మొర
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి శనివారం అర్జీలు స్వీకరించారు. సాయం కోసం వచ్చిన వారి సాధకబాధకాలను ఓపిగ్గా విన్నారు. తన దృష్టికి వచ్చిన తీసుకొచ్చిన సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా పమిడిమర్రుకు చెందిన గుర్రపుశాల శ్రీనివాసరావు అనే వైసీపీ బాధితుడు అర్జీ ఇస్తూ.. తన తండ్రి వారసత్వంగా తమ అన్నదమ్ములిద్దరికీ రెండెకరాల చొప్పున భూమి ఉందని, గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఆ భూమిని ఆక్రమించి, దొంగ పాసుపుస్తకాలు సృష్టించారని ఫిర్యాదు చేశారు. పొలం గురించి అడుగుతుంటే తమపైనే దాడికి దిగుతున్నారని వాపోయారు.