Share News

కాఫర్‌ డ్యాంల వద్ద.. ఎక్కువ బోర్‌వెల్స్‌ తవ్వొద్దు!

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:34 AM

కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు

కాఫర్‌ డ్యాంల వద్ద.. ఎక్కువ బోర్‌వెల్స్‌ తవ్వొద్దు!

  • ఎగువ డ్యాం వద్ద 3-4 మాత్రమే వేయాలి

  • ఎక్కువ ఫిజియో మీటర్లను పెట్టండి

  • సీపేజీ జలాలు గ్రావిటీ ద్వారా తరలించాలి

  • పంపులు అధికంగా వినియోగించండి

  • అంతర్జాతీయ నిపుణుల సూచనలు

  • పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్ర జలసంఘానికి!

  • పాటించాలని జలవనరుల శాఖకు సలహా

  • 16వ తేదీన ప్రాథమిక నివేదిక వచ్చే చాన్సు

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కాఫర్‌ డ్యాంల పటిష్ఠత తెలుసుకోవడం కోసం వాటికి మూడు మీటర్ల దూరంవరకు భారీలోతులో బోర్‌వెల్స్‌ను వేయవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి అంతర్జాతీయ నిపుణులు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాల సామర్థ్యం, డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కాఫర్‌ డ్యాంలలో సీపేజీ నివారణ మొదలైనవి పరిశీలించి తగు సూచనలు చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ అమెరికాకు చెందిన ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, డేవిడ్‌ బి పాల్‌.. కెనడా నిపుణులు సీన్‌ హించ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీని నియమించిన సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన వీరు.. దెబ్బతిన్న కట్టడాలను ఈ నెల మూడో తేదీ దాకా క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. ఈ నెల నాలుగో తేదీన తమ దేశాలకు వెళ్లారు. ఈ నెల 8వ తేదీన పీపీఏకి తమ ప్రాథమిక పరిశీలనలను పంపారు. ఆ అభిప్రాయాలను కేంద్ర జల సంఘానికి పీపీఏ పంపింది. వాటిని పరిశీలించిన జలసంఘం.. ఈ సూచనలను పాటించాల్సిందిగా రాష్ట్ర జల వనరుల శాఖకు తెలియజేయాలని బుధవారం పీపీఏని ఆదేశించింది. నిపుణులు తమ ప్రాథమిక నివేదికను ఈ నెల 16వ తేదీన పంపే వీలుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 తేదీ నాటికి మొదటి ప్రాథమిక నివేదికను పంపేలా ప్రయత్నిస్తామని నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ సలహాలు ఆధారంగా కాఫర్‌ డ్యాం మరమ్మతు పనులకు, సీపేజీని తగ్గించేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులు సమాయత్తమవుతున్నారు.

నిపుణుల అభిప్రాయాలివీ..

  • ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల భూమి పొరల్లో పటిష్ఠతను పరిశీలించేందుకు చానల్‌ 250 మీటర్లు, 290 మీటర్లు, 470 మీటర్లు, 550 మీటర్ల వద్ద నాలుగు బోర్‌వెల్స్‌ వేసినట్లుగా గుర్తించాం. ఇవిగాక.. చానల్‌ 870 మీటర్లు, 1000 మీటర్లు, 1100 మీటర్ల వద్ద కూడా లోతైన బోర్‌వెల్స్‌ను వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గమనించాం. కాఫర్‌ డ్యాంలకు మూడు మీటర్ల సమీపం వరకు ఎలాంటి గుంతలు తవ్వొద్దు.

  • కాఫర్‌ డ్యాం వద్ద 17 చొప్పున బోర్‌వెల్స్‌ వేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పదేసి చొప్పున వేయడమే మేలు. ఈ బోర్‌వెల్స్‌ నుంచి సేకరించిన మట్టి నమూనాలతోనే పటిష్ఠతను తెలుసుకోవచ్చు. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద 3-4 బోర్‌వెల్స్‌కే పరిమితం కావాలి.

  • ఫిజియో మీటర్లను వీలైనన్ని ఎక్కువ ఏర్పాటు చేయాలి. వైబ్రో స్టోన్‌ కాలమ్స్‌ వద్ద వీటిని అమర్చాలి.

  • కొత్తగా తవ్వాల్సిన పది బోర్‌వెల్స్‌పై ప్రత్యామ్నాయ ప్రణాళికలను జల వనరుల శాఖ అమలు చేయాలి.

  • బోర్‌వెల్స్‌ తీసిన గోతులు ఎలా పూడ్చాలో మెథడాలజీని తెలియజేస్తాం.

  • గ్యాప్‌-1 వద్ద వైబ్రో కంపాక్షన్‌ను మల్టీ చానల్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ సర్ఫేస్‌ వేవ్స్‌ (ఎంఏఎ్‌సడబ్ల్యూ) విధానంలో చేయాలి.

  • జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌, జియోలాజికల్‌ పరీక్షలు పునఃసమీక్షించాలి.

  • ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య నిలిచిపోయిన సీపేజీ జలాలను గ్రావిటీ ద్వారా నదిలోకి పంపేయాలి. ఇందుకోసం పంపులను అధికంగా వినియోగించాలి. కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు జరుపుతూ.. పీపీఏ పర్యవేక్షణలో సీపేజీని తగ్గించే పనులు చేపట్టాలి.

Updated Date - Jul 11 , 2024 | 04:34 AM