Share News

పురాణపండ అక్షర శ్రీకార్యాలు ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తున్నాయి: డిప్యూటీ కలెక్టర్ రామారావు

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:44 PM

వారాహి నవరాత్రుల పవిత్ర వేడుక సంరంభ సమయంలో ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రఖ్యాత ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ అపూర్వ రీతిలో ప్రచురించిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంథం, మూడువందల పేజీల పరమ పవిత్ర స్తోత్ర, వ్యాఖ్యాన పారిజాతం ‘శ్రీ లలిత విష్ణు స్తోత్ర మంత్ర పేటిక’ను విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు వీణా వేడుక మధ్య సంగీతోత్సవానికి వెలుగుగా ఆవిష్కరించారు.

పురాణపండ అక్షర శ్రీకార్యాలు ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తున్నాయి: డిప్యూటీ కలెక్టర్ రామారావు

విజయవాడ, జులై 6: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల దేవాదాయ శాఖల్లో పవిత్రమయంగా, గౌరవప్రదంగా, వినయపూర్వకంగా, స్థిరమైన నిర్ణయాలతో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేసే ప్రతిభావంతుడుగా విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. ఎస్. రామారావు పేరు ప్రభుత్వ శాఖల అధికార్ల నుండీ సామాన్య భక్తునివరకూ చక్కగా వినిపిస్తోందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయనేది రాజకీయ పార్టీలకు, విభిన్న సిద్ధాంతాలకు అతీతంగా కనిపిస్తున్న సత్యం.

EO-Ramarao.jpg

రామారావు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి చెంత అధికారిగా ఏనాడూ ప్రవర్తించలేదు కనుకనే, దుర్గమ్మకు దాసునిగా వ్యవహరించడం వల్లనే ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతాల్ని ఆవిష్కరిస్తున్నాయి.

ప్రధానాంశం గ్రంథ వైభవాల గురించి మహాసరస్వతి అనుగ్రహంలోంచి చూస్తే... గత నలభై రోజుల్లో ఏడు సనాతన గ్రంథాల్ని ఆవిష్కరించడం మాత్రమే కాకుండా ఆర్షభారతీయ ధార్మిక గ్రంథాల్ని సుమారు లక్షకు పైగా ఉచిత వితరణ చెయ్యడం శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా కె. ఎస్. రామారావు ఉండటంవల్లనే సాధ్యమైందని ఆలయ ఉద్యోగ బృందాలు, వేద పండితులు, అర్చక ప్రముఖులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.

Lalitha-Vishnu-KSR.jpg

పాపకార్య విరక్తికి, పదునాలుగులోకాల పరమేశ్వరీతత్వాన్ని అద్భుత గ్రంథాలుగా పరమ ఋషుల ప్రసాదంగా, రమణీయ కమనీయ వ్యాఖ్యానాలతో అందించే ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంథ నిధుల్ని అక్షర అక్షయ కలశాలుగా ఇప్పటికి గత నలభై రోజుల్లో ‘సౌభాగ్య’, ‘బంగారు నీరాజనం’, ‘శంభో మహాదేవ’, ‘ఉగ్రం ... వీరం’, ‘శ్రీమాలిక’, ‘జయ జయోస్తు’, ‘నారసింహో .. ఉగ్రసింహో’ వంటి అపురూప గ్రంథాలుగా అమ్మ సమక్షంలో మహాత్ములైన ధార్మిక ప్రవచనాకేసరి చాగంటి కోటేశ్వర రావు, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీమతి వాణీమోహన్ వంటి ప్రముఖులచే ఆవిష్కరింప చేసి దేవస్థాన చరిత్రలో పవిత్రతలు క్రొత్త పుంతలు తొక్కడానికి రామారావు మేలు బాటలు పరిచారు.

EO-Ramarao-2.jpg

ఈ శుక్రవారం సాయంకాలం వారాహి నవరాత్రుల పవిత్ర వేడుక సంరంభ సమయంలో ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రఖ్యాత ధార్మిక ప్రచురణల సంస్థ ‘జ్ఞానమహాయజ్ఞ కేంద్రం’ అపూర్వ రీతిలో ప్రచురించిన మూడువందల పేజీల పరమ పవిత్ర స్తోత్ర, వ్యాఖ్యాన పారిజాతం ‘శ్రీ లలిత విష్ణు స్తోత్ర మంత్ర పేటిక’ను కె. ఎస్. రామారావు వీణా వేడుక మధ్య సంగీతోత్సవానికి వెలుగుగా ఆవిష్కరించారు.

EO-Ramarao-3.jpg

ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ.. మహా సాధకులకు వేదనాదాల పులకిత స్పర్శ లభించేలా పురాణపండ శ్రీనివాస్ కనకదుర్గమ్మ కారుణ్యంతో ఈ అపారశక్తి గ్రంధాన్ని ‘శ్రీ లలిత విష్ణు సహస్రం’గా రూప మాధుర్యాలతో అందించడం ప్రశంసార్హమని అభినందించారు. తాను ఏ దేవస్థానంకి అధికారిగా వెళ్లినా అక్కడ పురాణపండ శ్రీనివాస్ యజ్ఞమయ నిస్వార్ధ ధార్మిక గ్రంధసేవ ప్రతిభావంతంగా దర్శనమిస్తోందని, పురాణపండ సౌందర్యాల గ్రంథ సేవ తనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తోందని రామారావు పేర్కొన్నారు.

EO-Ramarao-4.jpg

గత కొన్ని సంవత్సరాలుగా ఈ అమోఘ గ్రంధాల ప్రచురణకి శ్రీసేవ చేస్తున్న విఖ్యాత విద్య ఆరోగ్య సంస్థ కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి వంటి ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాదశర్మ, సింహపురి వీణత్రయంగా పేరొందిన శ్రీమతి నెల్లూరుకు చెందిన సంగీత విద్వాంసురాళ్లు శ్రీమతి హేమలక్ష్మి, శ్రీమతి పద్మ, శ్రీమతి నాగలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 12:09 AM