Somireddy : తల్లి, చెల్లిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు
ABN , Publish Date - Oct 25 , 2024 | 03:51 AM
రాజకీయంగా సరెండర్ చేసుకోవడానికి జగన్ సొంత తల్లి, చెల్లినే బ్లాక్మెయిల్ చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
వారిపై కేసు పెట్టడం, తండ్రిని కేసులో ఇరికించడం ఎక్కడా చూడలేదు: సోమిరెడ్డి
అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజకీయంగా సరెండర్ చేసుకోవడానికి జగన్ సొంత తల్లి, చెల్లినే బ్లాక్మెయిల్ చేస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తండ్రిని ఈడీ కేసులో ఇరికించి, ఆస్తి కోసం తల్లి-చెల్లిపై కూడా కేసు పెట్టడం ఎక్కడా చూడలేదన్నారు. అలాంటి జగన్ నోట తల్లీ, చెల్లీ అనే మాటలు వినలేకపోతున్నామని తెలిపారు. గురువారమిక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ కుటుంబం ఆస్తుల జోలికి తాము వెళ్లడం లేదని, జగన్ క్రూర మనస్తత్వం గురించే మాట్లాడుతున్నామన్నారు. ‘సరస్వతి పవర్‌కు ప్రభుత్వ భూమి ఇచ్చిన తర్వాత ఆరేళ్ల పాటు ప్రారంభించలేదు.
రెండేళ్లలో ప్రారంభించకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూకేటాయింపులు రద్దు చేయవచ్చు. అలాగే సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి పవర్‌కు ఇచ్చిన భూమి లీజు 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచి మరో చట్టవిరుద్ధ కార్యక్రమానికి తెరదీశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని మా నాయకుడు, సీఎం చంద్రబాబును కోరుతున్నాం’ అని చెప్పారు. జగన్ అనుభవిస్తున్న ఆస్తి ప్రజలదన్నారు. ఆయన అంగీకరరిస్తే సరస్వతి పవర్‌కు చెందిన 1,500 ఎకరాలను మూడు భాగాలు చేసి ఒక భాగం రైతులకిచ్చి, మిగిలిన రెండు భాగాలు జగన్, షర్మిలకు పంచుతామని చెప్పారు.