Share News

సీఎం గారూ.. దయ చూపరూ!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:41 AM

తెలిసో తెలియకో.. పొరపాటునో.. క్షణికావేశంలోనో.. తప్పు చేసిన తమ వారిపై దయచూపండి చంద్రబాబు గారూ అంటూ రాష్ట్రంలోని పలు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల కుటుంబాల సభ్యులు ముఖ్యమంత్రిని వేడుకొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన కొందరు ఖైదీల విడుదలకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో, సత్ప్రవర్తన కలిగినప్పటికీ తమవారు ఇంకా

సీఎం గారూ.. దయ చూపరూ!

చంద్రబాబుకు ఖైదీల కుటుంబాల వేడుకోలు

విడుదలయ్యే ఖైదీల్లో తమవారు లేరని నాడు సుప్రీం

మార్గదర్శకాల్ని పక్కన బెట్టిన జగన్‌

రెండున్నరేళ్లుగా 160 మంది సత్ప్రవర్తన ఖైదీల నిరీక్షణ

తాజాగా ఏపీ సర్కారుకు జైళ్లశాఖ ప్రతిపాదనలతో ఆశలు

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): తెలిసో తెలియకో.. పొరపాటునో.. క్షణికావేశంలోనో.. తప్పు చేసిన తమ వారిపై దయచూపండి చంద్రబాబు గారూ అంటూ రాష్ట్రంలోని పలు జైళ్లలో మగ్గుతున్న ఖైదీల కుటుంబాల సభ్యులు ముఖ్యమంత్రిని వేడుకొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీకి చెందిన కొందరు ఖైదీల విడుదలకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో, సత్ప్రవర్తన కలిగినప్పటికీ తమవారు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు. అయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు బాధిత ఖైదీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. వాస్తవానికి.. ఖైదీలను ప్రతి ఆర్నెళ్లకోసారి జూన్‌ 30లోపు మొదటి, డిసెంబరు 31లోపు రెండో జాబితా ఎంపిక చేసి విడుదల చేయాలని సుప్రీం కోర్టు 2021లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు పంపింది. కొవిడ్‌ అనంతర పరిణామాలతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, దేశంలోని రాష్ట్రాలు సమ్మతించాయి. అయితే మన రాష్ట్రంలో నియంతలా పాలించిన జగన్‌ రెడ్డి అవేవీ పట్టించుకోలేదు. సుప్రీం కోర్టుతో ఇబ్బందులు వస్తాయని జైళ్ల శాఖ అధికారులు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు. పిట్టకథలు చెప్పడంలో పేరుగాంచిన రాయలసీమ మాజీ మంత్రి తమ బంధువులను విడుదల చేయించుకోవడానికి ప్రయత్నించారు. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల పరిధిలోకి ఆ ఖైదీలు రాబోరని జైళ్ల శాఖ అధికారులు చెప్పడంతో అర్హులైన వారిని సైతం విడుదల చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. అయినప్పటికీ ప్రతి ఆర్నెళ్లకోసారి అర్హుల జాబితా సుప్రీం మార్గదర్శకాల ప్రకారం సిద్ధం చేసి ప్రభుత్వానికి జైళ్ల శాఖ పంపింది. కోర్టుతో ఇబ్బందులు రాకుండా 2022లో ఒకసారి హోంశాఖ జీవో ఇచ్చింది తప్ప ఖైదీలను విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కూడా జూన్‌ 30నాటికి ఏ జైలులో ఏ ఖైదీ అర్హుడో వివరిస్తూ 160మంది జాబితా వారం రోజుల క్రితం చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ జైళ్లశాఖ పంపింది. ఆగస్టు 15, జనవరి 26తో సంబంధం లేకుండా ఎప్పుడైనా విడుదల చేయవచ్చని ప్రతిపాదనల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోయే ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గం సిద్ధం చేసింది. వీరికిఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జైళ్ల శాఖ పంపిన జాబితా ప్రకారం విడుదలకు అర్హులైన ఖైదీలు.. కోస్తాంధ్ర జైళ్లలో 72మంది, గుంటూరు రేంజ్‌ పరిధిలో 35మంది, రాయల సీమ జైళ్లలో 53మంది కలిపి మొత్తం 160మంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా.. ఇటీవలే 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంతో ఏపీలోనూ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని సంబంధీకులు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 03:41 AM