Share News

Tirumala : వ్యాపార కేంద్రంగా తిరుమల శారదామఠం

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:24 AM

తిరుమలలోని శారదామఠంలో ఆక్రమణలను కూల్చపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు

Tirumala : వ్యాపార కేంద్రంగా తిరుమల శారదామఠం

  • ఆక్రమణలను కూల్చకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధం

  • ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి

తిరుమల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శారదామఠంలో ఆక్రమణలను కూల్చపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు. శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏపీ సాధు పరిషత్‌ స్వామిజీలు శుక్రవారం తిరుమలకు చేరుకుని శారదామఠంలోని నిర్మాణాలను పరిశీలించారు. ముందు, వెనుకభాగాలతో పాటు బేస్మెంట్‌ను కూడా తనిఖీ చేశారు. అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు. శారదా పీఠాధిపతినని చెప్పుకుంటూ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారం మఠంలో నిర్మాణాలు చేపట్టారన్నారు. మఠం వెనుకభాగంలోని 80 అడుగుల కాలవను పూడ్చి 20 అడుగులకు కుదించేశారన్నారు.

ఐదు వేల చదరపు అడుగుల వరకు మాత్రమే నిర్మాణాలు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ అదనంగా మరో రెండు వేల చదరపు అడుగులు ఆక్రమించి కట్టడాలు నిర్మించారని టీటీడీ అధికారులే చెప్పారన్నారు. ఇందుకోసం వందలాది చెట్లను కూడా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు అంతస్తులే ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ శారదా మఠంలో ఆరు అంతస్తులు కట్టారని.. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు వీలుగా సెట్‌బ్యాక్‌ కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టారన్నారు. అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు.

టీటీడీ చర్యలు చేపట్టకపోతే హిందూ సమాజంతో కలిసి తాము ముందుకొస్తామని హెచ్చరించారు. శారదామఠంలో ఒక్కరికైనా పిడికెడు అన్నం పెడుతున్నారా, ఏ పూజైనా చేస్తున్నారా అని ప్రశ్నించారు. తిరుమలలో యాగాలు, యజ్ఞాలు చేయమని మఠాలకు స్థలాలిస్తే గదుల ధరలు విపరీతంగా పెంచడంతో పాటు పెళ్లిళ్లు చేయిస్తూ వ్యాపార కేంద్రాలుగా మార్చేశారన్నారు. అధికారులు వచ్చేంత వరకు మౌనదీక్ష చేస్తామని స్వామిజీలు మఠం ముందు బైఠాయించారు.

పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు తప్ప ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులు రాకపోవడంతో సుమారు రెండు గంటల పాటు మఠం ముందే కూర్చున్నారు. తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి మఠంలో జరిగిన అక్రమ కట్టడాలపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే దేశంలో ఉన్న సాధువులందరినీ ఏకం చేసి నిరనస వ్యక్తం చేస్తామని స్వామిజీలు హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు కిరణ్‌రాయల్‌ వారి వద్దకు వచ్చి మద్దతు తెలిపారు.

Updated Date - Jun 29 , 2024 | 04:24 AM