Stock market : మార్కెట్ దారెటు..?
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:56 AM
ఈ ఏడాది సెప్టెంబరు 27న నమోదైన సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే, స్టాక్ మార్కెట్ సూచీలు ఇప్పటికే 10 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 8,400 పాయుంట్లు కోల్పోయి 77,580 వద్దకు, నిఫ్టీ 2,750 పాయింట్లు నష్టపోయి 23,532 వద్దకు జారుకున్నాయి. అంతేకాదు, దాదాపు రూ.50 లక్షల కోట్ల మార్కెట్ సంపద హరించుకుపోయింది. ఇందుకు
ఇప్పటికే 10 శాతం పతనమైన సూచీలు .. మున్ముందు మరింత క్షీణించేనా..?
మళ్లీ పుంజుకునే సమయం వచ్చేసిందా..?
మన స్టాక్ మార్కెట్ పతనం ఎందాకా..? ప్రస్తుతం ఈక్విటీ మదుపరుల మదిని తొలచి వేస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే, రెండు నెలల క్రితం వరకు అలుపెరుగని పరుగులో రోజుకో రికార్డు సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీ.. అనూహ్యంగా తిరోగమన బాట పట్టాయి. ఎంత వేగంగా ఎగబాకాయో.. అంతే త్వరగా జారుకుంటున్నాయి. సూచీలకు పట్టు దొరికే దెప్పుడు...? మళ్లీ ఎగిసేదెప్పుడు..? అని ఇన్వెస్టర్లు నిశితంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
మార్కెట్ మరింత దిద్దుబాటుకు లోనుకావచ్చు. ఎఫ్‌పీఐల అమ్మకాల హోరు ప్రస్తుత స్థాయిలో కొనసాగితే ఈ ఏడాది చివరినాటికి నిఫ్టీ మరో 10 శాతం మేర క్షీణించే ప్రమాదం ఉంది.
- జై బాల, క్యాష్‌దికావో్‌స.కామ్
ముంబై: ఈ ఏడాది సెప్టెంబరు 27న నమోదైన సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే, స్టాక్ మార్కెట్ సూచీలు ఇప్పటికే 10 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 8,400 పాయుంట్లు కోల్పోయి 77,580 వద్దకు, నిఫ్టీ 2,750 పాయింట్లు నష్టపోయి 23,532 వద్దకు జారుకున్నాయి. అంతేకాదు, దాదాపు రూ.50 లక్షల కోట్ల మార్కెట్ సంపద హరించుకుపోయింది. ఇందుకు కారణాలనేకం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, మార్కెట్లో చాలా కంపెనీల షేర్ల ధరలు సహేతుక స్థాయిని మించిపోవడం, నిరాశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలతో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గత 6 వారాలుగా మన మార్కెట్లో పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడుతుండటం వంటి పరిణామాలు సూచీలను కుప్పకూల్చాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపర్చే అంశాలేమీ లేకపోవడంతో సూచీల పతనం ఇప్పట్లో ఆగకపోవచ్చని కొందరు ఈక్విటీ నిపుణులు అభిప్రాయపడగా.. మార్కెట్ ఇప్పటికే 10% దిద్దుబాటుకు లోనైనందున గతంలో లాగే వాల్యూ బైయింగ్‌తో సూచీలు మళ్లీ అప్‌టర్న్ తీసుకునే అవకాశాల్లేకపోలేవన్న అంచనాలూ వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. 2022 సెప్టెంబరు, 2023 మార్చిలోనూ నిఫ్టీ 10ు పతనమై మళ్లీ వెంటనే పుంజుకుంది. ప్రస్తుతం నిఫ్టీ 23,500 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ స్థాయిలో నిలదొక్కుకోగలిగితే గనక సూచీ మళ్లీ ర్యాలీ తీయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 23,500 స్థాయినీ కోల్పోతే, సూచీ క్రమంగా 23,000-22,500 స్థాయిల వరకు జారుకోవచ్చన్న అంచనాలున్నాయి.
మళ్లీ భారత్ పైకి సీఎల్‌ఎస్‌ఏ దృష్టి
అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ సీఎల్‌ఎ్‌సఏ అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. తన దృష్టిని చైనా నుంచి తిరిగి భారత్ పైకి మళ్లించింది. చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని, భారత మార్కెట్లో పెట్టుబడుల కేటాయింపును 20 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో చైనా వాణిజ్యపరమైన సవాళ్లు ఎదుర్కోవచ్చన్న అంచనాల నేపథ్యంలో తన దృష్టిని భారత్ వైపు మళ్లించినట్లు తాజా నివేదికలో పేర్కొంది. గత నెల తొలివారంలో చైనా ఆర్థిక వ్యవస్థకు, స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు భారీ ఉద్దీపన చర్యలు ప్రకటించింది. దాంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారత మార్కెట్ నుంచి చైనాకు తరలించారు. సీఎల్‌ఎ్‌సఏ సైతం భారత మార్కెట్ కేటాయింపులను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించి, చైనా మార్కెట్ కేటాయింపులను 5 శాతానికి పెంచింది. కానీ, ట్రంప్ విజయం అనంతరం సీఎల్‌ఎ్‌సఏ మళ్లీ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.
అక్టోబరు నుంచి ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు మన మార్కెట్ నుంచి రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. మున్ముందు మరిన్ని పెట్టుబడులను తరలించే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనూ సీఎల్‌ఎ్‌సఏ తన వైఖరిని మార్చుకోవడం గమనార్హం. చైనా ఇప్పటికే ప్రతి ద్రవ్యోల్బణం, యువతలో పెరుగుతున్న నిరుద్యోగత, స్థిరాస్తి రంగంలో సంక్షోభం వంటి సమస్యలు ఎదుర్కోంటోందని.. ఇందుకు తోడు ట్రంప్ 2.0 పాలనలో చైనా ఎగుమతులపై ఆంక్షలు పెరిగే అవకాశాలున్నాయని ఈ బ్రోకరేజీ సంస్థ భావిస్తోంది. ఇక భారత్ విషయానికొస్తే, ట్రంప్ వాణిజ్య విధానాలు పెద్దగా ప్రభావం చూపేందుకు అవకాశాల్లేని మార్కెట్లలో భారత్ ఒకటని సీఎల్‌ఎ్‌సఏ భావిస్తోంది. అంతేకాదు, డాలర్ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో ముడి చమురు ధరలు స్థిరంగా కొనసాగినంత వరకు భారత విదేశీ మారక నిల్వలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంటోంది.
స్వల్పకాలంపాటు సూచీలు మరింత క్షీణించే అవకాశాలున్నాయి. నిఫ్టీకి 23,000- 22,500 స్థాయిలో గట్టి మద్దతు కన్పిస్తోంది. ఒకవేళ సూచీ ఏడాది చివరి నాటికి ఈ స్థాయికి జారితే దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు పాల్పడవచ్చు. ప్రస్తుతం తరలిపోతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులూ కొత్త ఏడాదిలో మళ్లీ భారత బాట పట్టవచ్చు.
- సునీల్ సుబ్రమణియమ్, మార్కెట్ నిపుణులు
మార్కెట్ ఇప్పటికే సహేతుక స్థాయికి దిగివచ్చిన నేపథ్యంలో సూచీలు మళ్లీ పుంజుకునేందుకు అవకాశాల్లేకపోలేవు. అయితే, భవిష్యత్ ర్యాలీలో మదుపరులు మెరుగైన వృద్ధి అవకాశాలున్న రంగాలు, కంపెనీల షేర్లను ఎంచుకోవడం మేలు.
- వీకే విజయ్ కుమార్,
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్