Share News

బేగంపేట టు సికింద్రాబాద్

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:49 AM

సోమాజీగూడ పుల్లారెడ్డి బస్ స్టాప్: పగలంతా నేతి వాసన తాగీతాగీ రాత్రిపూట మత్తుగా తూలుతోంది చివరి సికింద్రాబాద్ బస్సు చినుకుల మధ్య నుంచి రివ్వున...

బేగంపేట  టు  సికింద్రాబాద్

సోమాజీగూడ పుల్లారెడ్డి బస్ స్టాప్:

పగలంతా నేతి వాసన తాగీతాగీ

రాత్రిపూట మత్తుగా తూలుతోంది

చివరి సికింద్రాబాద్ బస్సు

చినుకుల మధ్య నుంచి రివ్వున దూసుకొచ్చి

దేహాన్ని వెచ్చగా తాకింది

ఎక్కీఎక్కగానే

పాతికేళ్ల క్రితం

ఆకలితో తిరిగిన రోజులన్నీ

ఖాళీ సీట్ల మీద

చెల్లాచెదురుగా కనిపించాయి

పోలీస్ లైన్ బస్ స్టాప్:

నీరసంగా ఎక్కిన ముసలామె సంచిలో

రేపటి బతుకు తండ్లాట

ఆమె నీరసస్వరంలో ఏదో విశ్వాసం

నా గుండెకింద ధైర్యంగా వినపడింది

రసూల్ పుర బస్‌ స్టాప్‌:

ఈదురుగాలికి ముడుచుకొని

కుంటి కుక్కతో కలిసి కునుకు తీస్తోంది

ఆకలేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్న స్విగ్గి కుర్రాడు

వచ్చిన కలెక్షన్ ఎంతో

పోయిన కమిషన్ ఎంతో

లెక్కలేసుకుంటున్నాడు

ప్యారడైజ్:

నాగరికత దుప్పట్లో దూరి

సాయంత్రం అమ్మగా మిగిలిన మల్లెపూలని

వుండగా చుట్టి తలకింద పెట్టుకుని

నిద్ర నటిస్తోంది

ప్యాట్నీ:

ఎంతకీ రక్తి కట్టని దారుల్లో

హరేక్ మాల్ బండి ఒకటి భంగపడి

టార్పాలిన్ చుట్టుకుని

పక్కకు ఆగిపోయింది

ఆకలి మంటతో బీడీ వెలిగించుకొని

అతడు బెంజ్ కారుకి దారిచ్చి

తొలగిపోయాడు

సికింద్రాబాద్:

బడుగు జీవులను మోసీ మోసీ

అలసిన బస్సు దూరంగా నడుం వాల్చింది

రేపటి కోసం

మెహిదీపట్నం బోర్డును తగిలించుకొని

నిద్రలోకి జారుకుంది

రత్నశ్రీ

98488 48001

Updated Date - Sep 16 , 2024 | 04:49 AM