Share News

కన్యాదానం

ABN , Publish Date - Nov 18 , 2024 | 05:40 AM

ఇపుడీమె సర్వస్వతంత్ర తన రూపసౌష్టవాలను తానే ఎంచుకొని తన రెక్కలకు తానే పరిమళం అద్దుకొని తెల్లని వెన్నెలలో వికసించిన రంగుల కలువ....

కన్యాదానం

ఇపుడీమె సర్వస్వతంత్ర

తన రూపసౌష్టవాలను తానే ఎంచుకొని

తన రెక్కలకు తానే పరిమళం అద్దుకొని

తెల్లని వెన్నెలలో వికసించిన రంగుల కలువ.

గూటిలో ఒదిగినప్పటి గువ్వతనం వదిలి

తన రెక్కలలో తానే బలం నింపుకొని

తన స్వరాన్ని తానే శృతి చేసుకొని

అపుడపుడు అందంగా పలకరించే వసంత కోకిల.

కనక సంపన్న కాకపోయినా

తన ఆశలు, ఆశయాలే

ఆభరణాలుగా ధరించిన

అపరంజి బొమ్మ.

ఇవ్వటం పుచ్చుకోవటం

ఒక వేడుక మాత్రమే!

తన సర్వస్వమూ తనకే సొంతం.

ఇపుడీమె

తన దారిని తానే నిర్మించుకొని

తన జీవితాన్ని తానే నిర్వచించుకొని

ఏనాడో బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన

పరిపూర్ణ మహిళ!

తను కోరుకున్న సంసార నౌక లోనికి అడుగుపెట్టడానికి

నా చేతిని ఊతగా అందించి

ధన్యమౌతాను.

అప్రయత్నంగా, అతిసహజంగా తలెత్తే

అన్ని భయసందేహాలను

కనురెప్పల క్రిందే అదిమిపెట్టి

తన కలల తీరానికి తప్పక చేరాలని

మనసులోనే మరీమరీ కోరుకొని

నెమ్మదిగా చెయ్యి ఊపుతూ

ఈవలి ఒడ్డునే నిలిచిపోతాను.

విన్నకోట రవిశంకర్

rvinnako@yahoo.com

Updated Date - Nov 18 , 2024 | 05:40 AM