Share News

The Kakatiya Dynasty : కాకతీయులపై అపనింద!

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:15 AM

వాస్తవం మనసుకి ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. కానీ మిథ్యలు, అపోహలు త్వరగా ఆకర్షిస్తాయి. వాస్తవం కన్నా అపోహల మీదే ఎక్కువ మక్కువ ఉంటుంది! ఎందుకంటే వదంతులకు ఉన్నంత ప్రచారం వాస్తవానికి ఉండదు. ఇక్కడ వాస్తవం ఏమంటే గిరిజనులకు కాకతీయులకు మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదని, సమ్మక్క సారక్కలు

The Kakatiya Dynasty : కాకతీయులపై అపనింద!

వాస్తవం మనసుకి ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. కానీ మిథ్యలు, అపోహలు త్వరగా ఆకర్షిస్తాయి. వాస్తవం కన్నా అపోహల మీదే ఎక్కువ మక్కువ ఉంటుంది! ఎందుకంటే వదంతులకు ఉన్నంత ప్రచారం వాస్తవానికి ఉండదు. ఇక్కడ వాస్తవం ఏమంటే గిరిజనులకు కాకతీయులకు మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదని, సమ్మక్క సారక్కలు గిరిజన దేవతలు అన్నది. ఇద్దరు ప్రాంతేతరులు లేవదీసిన వదంతికి శాస్త్రీయ ఆధారాలు వెతకకుండా వదంతిని నిజమే అని నమ్మడం వల్ల గిరిజనుల మనోభావాలు దెబ్బతిన్నాయి...! మరోవైపు కాకతీయుల కీర్తికి భంగం కలిగింది. ఈ విషయంలో మనం తెలుగు విశ్వవిద్యాలయం గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్‌ వారు ప్రచురించిన ‘మేడారం జాతర’ పుస్తకాన్ని రెఫరెన్స్‌గా తీసుకుందాం. అందులో స్పష్టంగా ఉంది పూర్వకాలం నుండి మేడారం గద్దెల వద్ద వంశ పారంపర్య పూజారులుగా కొనసాగుతున్న సిద్దబోయిన, కాక వంశస్థులైన గిరిజన పూజారులను యుద్ధం గురించి ప్రశ్నిస్తే చాలు సమ్మక్క సారలమ్మలకు ఎవరితోని యుద్ధం జరగలేదు, వారు మా పుట్టు దేవతలు అని చెప్పడమే కాదు సమ్మక్క తమ పూర్వీకులకు పసిపాపగా వనంలో దొరికిన దేవతగా చెప్తారు! పైగా గిరిజనులలో చందా, డోలి, కొర్రాజు వంశీయుల కథనాలు కూడా సమ్మక్క, సారలమ్మలు పుట్టు దేవతలనే కథనాలను వినిపిస్తారు అంతే తప్ప తమ దేవతలు యుద్ధంలో చనిపోయారనే కథనాన్ని మాత్రం వారు అంగీకరించరు. అలా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లను తమ సంస్కృతీ సంప్రదాయాన్ని హేళనపరుస్తున్న వ్యక్తులుగా భావిస్తారు! అని స్పష్టంగా పేర్కొన్నారు.

మొట్టమొదట 1996లో సీమాంధ్ర నవలాకారుడైన ముదిగొండ శివప్రసాద్‌ తన ‘చంద్రకళ’ అనే నవలలో కాకతీయులకు గిరిజనులకు యుద్ధం జరిగిందని కట్టు కథ అల్లాడు. అది నిజమని నమ్మి అదే సంవత్సరం జాతర నిర్వాహకులైన అధికారుల ప్రోత్సాహంతో కొల్లి నరసయ్య అనే వ్యక్తి ఒక పుస్తకం ప్రచురించగా, 2000 సంవత్సరంలో గుంటూరు జిల్లాకు చెందిన చిన్న వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పుస్తకం ద్వారా అదే కట్టు కథను బహుళ ప్రచారం చేశాడు! (సమ్మక్క సారలమ్మల జాతరను గిరిజన విశ్వాసాలకు విరుద్ధంగా కమర్షియలైజేషన్‌ చేయడంలో ఒక ఆకర్షణీయ కథనంగా ఈ యుద్ధ కథనం ఉపయోగపడి ఉండవచ్చు).


ఇక చరిత్రలోకి వెళితే కోయ రాజ్యం నిజంగానే ఉంది అనుకున్నప్పుడు ఆ రాజ్యానికి ఒక రాజధాని ఉండాలి. అల్లబడిన కథనం ప్రకారం అది మేడారం గ్రామమై ఉండాలి, కానీ యుద్ధం జరిగిందని చెప్పబడుతున్న ఈ ప్రాంతం ఒక దట్టమైన అరణ్య ప్రాంతం. గిరిజన రాజులు ఒకవేళ ఉండి ఉంటే రక్షణ కోసం మేడారంలో గానీ, దాని చుట్టుపక్కల గాని, కట్టుకున్న కోటలు గాని, శత్రువుని అడ్డుకునే రక్షణ పరమైన నిర్మాణాలు కానీ కనిపించవు. మేడారంలో ఒకవేల కోటలాంటి కట్టడం ఒకటి ఉండి ఉంటే దాన్ని శిథిలాలైనా నేటికీ మనకు అక్కడ రేఖా మాత్రంగానైనా కనిపించాలి.. పైగా సమ్మక్క, సారక్క పగిడిద్ద రాజు గోవిందరాజుల పేర్లు మనకు చరిత్రలో ఎక్కడ కనిపించవు. కాకతీయులు ఎవరితో యుద్ధం చేసినా దానిని శాసనబద్ధం చేశారు కానీ కోయ రాజులతో యుద్ధం చేసిన విషయం కలికానికి కూడా ఆగుపడదు.

కొంతమంది పోలవాస రాజును పగిడిద్దరాజుగా ఆయన కొడుకు జగ్గదేవుని జంపన్నగా చూపబోయారు. అయితే చరిత్రలో పోలవాస మేడరాజు మంథని గుండ రాజులు ఇద్దరితో కాకతియ రుద్రదేవునికి జరిగిందని చెప్పబడుతున్న యుద్ధం నేటి కరీంనగర్‌ వద్ద గల నగునూరులో జరిగింది. పైగా ఈ యుద్ధ విజేత కాకతీయ రుద్రదేవుడు, ఆయన మంత్రి గంగాధరుడు. అంతేకానీ ప్రతాపరుద్రునికి ఆ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదు. రుద్రదేవుడు 1158 నాటి వాడైతే ప్రతాపరుద్రుడు 1323 ప్రాంతం నాటివాడు. అంటే వీరిద్దరి మధ్య 200 సంవత్సరాల తేడా ఉంది. ఇక జగిత్యాల ప్రాంతాన్ని ఏలిన పోలవాసరాజు గిరిజనుడు కాదు. అలా అని చెప్పడానికి వారు వేయించిన 1122 నాటి గోవిందాపుర శాసనములోనూ, బానాజీపేట శాసనాల్లోనూ తాము జైన మతస్థులమని పేర్కొన్నారు. పైగా తమ వంశకర్త మాధవ వర్మ అని పేర్కొన్నారు. ఈ మాధవవర్మను క్షత్రియ రాజులు తమ వంశ మూలకర్తగా పేర్కొంటారు. ఈ మాధవవర్మ ఒకప్పుడు తెలంగాణను పరిపాలించిన విష్ణుకుండిన వంశస్థుడు. వీళ్ళు ఏ శాసనాలలోను తాము గిరిజనులమని కానీ, కోయవారమని గాని పేర్కొనలేదు. గిరిజనులవి ప్రాచీన ఆచారాలు. వారి పూజా విధానం విగ్రహారాధనకు వ్యతిరేకం. వాళ్ళు వనదేవతలను పూజిస్తారు.


1984నాటి సమ్మక్క గద్దె ఫోటో చూస్తే నమిలినార చెట్టును సమ్మక్కగా పూజించడం కనిపిస్తుంది. (ప్రస్తుతం ఆ చెట్టు లేదు). ఆ చెట్టును ఆవహించే దేవతను సమ్మక్కను కుంకుమ రూపంలో చిలకల గట్టునుండి తీసుకొని వస్తారు. వీటిని బట్టి వారి ఆదిమాచారాలు గమనించవచ్చు. కానీ ఇక్కడ పోలవాసరాజులు పూర్తిగా విగ్రహారాధకులు... ఇక పశ్చిమ చాళుక్యులకు ఈ పోలవాస రాజులు కాకతీయులు ఇద్దరు సామంతులుగా కొనసాగారు. వీరి రెండు రాజ్యాలు పక్కపక్కనే ఉండటం వల్ల మొదట్లో ఇరు రాజ్యాల మధ్య మిత్రత్వం ఉన్నప్పటికీ వారిద్దరూ ఉమ్మడి ప్రభువైన చాళుక్యుల పట్ల విధేయత విషయంలో ఒకరికొకరు కాలక్రమంలో శత్రువులుగా మారారు. కళ్యాణి చాళుక్యులు బలహీనపడిన సందర్భంగా రుద్రదేవుడు స్వతంత్రుడై కాకతీయ ప్రథమ సార్వభౌమ పాలకుడిగా అవతరిస్తాడు. ఇది సహించని చాళుక్య వంశ వారసుడైన కాలచూరి బిజ్జలుడు తన కుమారుడైన మైళగికి సైన్యాన్ని ఇచ్చి రుద్రదేవుని అణిచివేసే పని అప్పగిస్తాడు... ఈ మైళగి రుద్రదేవునిపై శత్రుత్వం గల నగునూరు ప్రభువైన దొమ్మరాజును పోలవాస ప్రభువైన రెండవ మేడ రాజును, అతడి కొడుకైన జగ్గ దేవునితో పాటు అందరిని చేరదీస్తాడు. కాకతీయ రాజ్యం పైకి దండయాత్రకు మంచి అవకాశంగా భావించిన వీరంతా సంతోషంగా మైళగి పక్షం చేరుతారు. చివరికి వీరంతా కుట్రలో భాగస్వాములై 1157 లేదా 58 ప్రాంతాల మధ్య రుద్రదేవునితో యుద్ధానికి దిగుతారు.

హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం ప్రకారం ఈ యుద్ధంలో రుద్రదేవుడు విజేతగా నిలుస్తాడు. దొమ్మరాజు జగ్గదేవుడు యుద్ధంలో మరణించగా మేడరాజు అదిలాబాద్‌ జిల్లాలోని జన్నారం అడవుల్లోకి పారిపోతాడు... తన కూతుర్ని రుద్ర దేవుడికి ఇచ్చి వివాహం చేసి శాంతి నెలకొల్పుకోమని మేడరాజుకు అతని స్నేహితులు ఎంత చెప్పినా వినకుండా రుద్రదేవుడితో శత్రుత్వం వహించి ఎప్పటికైనా గెలువగలమని అహంకారంతో అడవులకు పారిపోయాడు. ఇదే విషయం హనుమకొండ శాసనంలో ఈ విధంగా ఉంది ‘అనిచ్చాన్‌ కన్యకాం దాతుం యస్మై మేడనృపోధధవ్‌ విభూతించాభిమానంచ కీర్తించకుల సంచితాం’ అని పేర్కొనబడింది. ఇదే విషయాన్ని వక్రీకరించి మేడరాజు కూతురు పేరు సారక్క అని ఆమెను ఇచ్చి పెళ్లి చేయకపోయేసరికి మొదటి ప్రతాపరుద్రుడు మేడరాజుతో యుద్ధం చేశాడని చెప్పడం ఏమీ న్యాయం?


‘మా సమ్మక్క సారక్క జంపన్న పుట్టు దేవతలు వారికి ఎవరితో యుద్ధం జరగలేదని’ మొత్తుకునే వడ్డెలు (జాతరలో సమ్మక్క సారక్క పూజారులు) వారి నమ్మకాలకు విలువివ్వనక్కర్లేదా? జాతరకు వచ్చే అశేష జనవాహిని సమ్మక్క సారలమ్మలు తమ కోరికలు తీర్చే దేవతలుగా తలచి వస్తున్నారు. గాని వారు వీరవనితలు, అప్పుడెప్పుడో మధ్య యుగాల్లో యుద్ధం చేశారని అబ్బురపడుతూ వస్తున్నారా? కాకతీయుల సంక్షేమ పాలన ధర్మనిరతి త్యాగం లాంటి సుగుణాలు చెప్పడానికిది సందర్భంగాదు. పాలకుల మనసు మంచిదైతే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని ప్రజలకు మేలు చేయవచ్చని లోకానికి చాటిన ప్రగతిశీలురు కాకతీయులు. కమర్షియలైజేషన్‌ కోసం సృష్టించిన కట్టుకథను నమ్మి మన చారిత్రక పురుషులను అవమానపరచుకుంటూ మన వేలుతో మనకన్నే పొడుచుకునేలా చేసిన వారి కుట్రలను విజయవంతం చేద్దామా లేక మేడారం దేవతలు కోయ గిరిజనుల వనదేవతలుగా భావించి వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆ దేవతల మహత్యాన్ని కీర్తిస్తే వచ్చే నష్టం ఏమిటి? మా దేవతలకు ఎవరితో యుద్ధం జరగలేదని మొత్తుకునే గిరిజనులను, వారి నమ్మకాన్ని వారి స్థల పురాణాలను గౌరవిస్తే వచ్చే నష్టం ఏమిటి? కాకతీయులకు కోయ గిరిజనుల మధ్య యుద్ధం జరిగిందని శాసన రహిత పిడివాదం చేయకపోతే వచ్చే ముప్పు ఏమిటి? ప్రాతఃస్మరణీయులు తెలంగాణ శాసనాల పరిష్కర్త కీ.శే. పివి పరబ్రహ్మశాస్త్రి గారిని ఈ విషయమై సంప్రదించినప్పుడు కాకతీయులకు గిరిజనులకు మధ్య యుద్ధం జరిగిందనేది కేవలం ఊహాగానమే అని స్పష్టంగా చెప్పారు...

కాకతీయ కళాతోరణం అనేది నాటి సుసంపన్నతకు, సుపరిపాలనకు, ప్రజల అభీష్టానికి ప్రతీక. దాన్ని చెరిపివేయడం అంటే ప్రజల కొన్ని వేలఏళ్ల చరిత్రను కాలరాయడమే. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం ఉండాల్సిందే!

ప్రాంతేతర నవలాకారుడు ఒకరు సృష్టించిన కట్టుకథను నమ్మి మన చారిత్రక పురుషులను అవమానపరచుకోవడం సబబేనా? మేడారం దేవతలు కోయ గిరిజనుల వనదేవతలుగా భావించి, ఆ దేవతల మహత్యాన్ని కీర్తిస్తే వచ్చే నష్టం ఏమిటి? మా దేవతలకు ఎవరితో యుద్ధం జరగలేదని మొత్తుకునే గిరిజనుల నమ్మకాన్ని, వారి స్థల పురాణాలను గౌరవిస్తే వచ్చే నష్టం ఏమిటి? కాకతీయులకు గిరిజనులకు మధ్య యుద్ధం జరిగిందనేది కేవలం ఊహాగానమే అని తెలంగాణ శాసనాల పరిష్కర్త పివి పరబ్రహ్మశాస్త్రి స్పష్టంగా చెప్పారు.

n డా. అంబటి శ్రీనివాస్‌రాజు

‘మన కాకతీయులు’ గ్రంథకర్త

Updated Date - Jul 07 , 2024 | 12:15 AM