Share News

నైపుణ్యాల వృద్ధి–నయా నగరం

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:54 AM

విద్యతోపాటు నైపుణ్యాల శిక్షణ, అభివృద్ధి అంశాన్ని అనేక దేశాలు గుర్తించి ఆ దిశగా చురుగ్గా అడుగులు వేస్తున్నాయి. ఉపాధి వలసలను ఇతోధికంగా ప్రొత్సహిస్తోన్న భారత్‌ కూడా కొన్ని చర్యలకు...

నైపుణ్యాల వృద్ధి–నయా నగరం

విద్యతోపాటు నైపుణ్యాల శిక్షణ, అభివృద్ధి అంశాన్ని అనేక దేశాలు గుర్తించి ఆ దిశగా చురుగ్గా అడుగులు వేస్తున్నాయి. ఉపాధి వలసలను ఇతోధికంగా ప్రొత్సహిస్తోన్న భారత్‌ కూడా కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. అయితే పురోగతి కొరవడింది. తెలుగు రాష్ట్రాలూ నైపుణ్యాల మెరుగుదలకు విశేష ప్రాధాన్యమిస్తున్నాయి. స్కిల్స్‌ యూనివర్సిటీ కొరకు ఒక ప్రత్యేక నగరాన్నే నెలకొల్పనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం, అభినందనీయం. మరి క్షేత్రస్ధాయి పరిస్థితులు, అవకాశాల గురించి ఏమైనా అధ్యయనం జరిగిందా అనేది ఇప్పుడు అసలు ప్రశ్న.

అన్ని రకాల సాంకేతిక ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్న గల్ఫ్‌ దేశాలకు వృత్తి విద్య పట్టభద్రులు ఉపాధి కొరకు ప్రతి రోజు వందల సంఖ్యలో వస్తుంటారు. ఒక కఠోర వాస్తవమేమిటంటే ఇంజనీరింగ్ పట్టభద్రులు పలువురు తమ విద్యతో సంబంధం లేని ఇతర ఉద్యోగాలు చేసుకుంటున్నారు!. సాఫ్ట్‌వేర్‌ను మినహాయిస్తే మిగిలిన రంగాలలో మన యువత నైపుణ్యాలు అంతంత మాత్రమే.


తెలుగు రాష్ట్రాలలో ఉబేర్, రాపిడో ఇత్యాది అద్దె రవాణా బైకులను నడిపే వారిలో అనేకులు ఇంజనీరింగ్ పట్టభద్రులే సుమా! దుబాయిలోని జబల్ అలీ మందిరం వెలుపల ఎండలో చిన్న చితక గిఫ్టు సామాన్లు లేదా సెంటు బాటిళ్ళ విక్రేతలలో కూడ కొందరు వారే ఉండడం ఒక లజ్జాకర పరిస్థితికి అద్దంపట్టడం లేదూ? ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎంతో మంది చాలిచాలనీ వేతనాలతో నెట్టుకొస్తున్నారు. కారణమేమిటి? వారిలో వృత్తి నైపుణ్యాలు, భాషా కౌశలాలు కొరవడడమేనని చెప్పక తప్పదు.

అరబ్‌ దేశాలలో ఫిలిప్పీన్స్, అమెరికాలో మెక్సికో జాతీయులకు ఉన్న సాంకేతిక నైపుణ్య పాటవాలు మన భారతీయుల వద్ద లేకపోవడం స్పష్టంగా కనపడుతుంది. తమ నైపుణ్యత ఆధారంగా అధిక వేతనంపై ఒక ఫిలిప్పీన్స్ జాతీయుడు తరచు ఉద్యోగం మారినట్లుగా ఒక భారతీయుడు మారడంలేదు, మారలేడు.

సాఫ్ట్‌వేర్‌లో పూర్తిగాను, వైద్య రంగంలో పాక్షికంగాను ఉన్నత స్ధానాలలో భారతీయులు రాణిస్తున్నారు, సందేహం లేదు. అయితే క్రింది, మధ్య శ్రేణులలో మాత్రం ఇతర దేశస్థులు, ప్రత్యేకించి ఫిలిప్పీన్స్ వారితో పోటిపడలేకపోతున్నారు. ఈ వాస్తవాన్ని భారత్‌ అధికార వర్గాలు కూడా గుర్తించాయి. పరిశ్రమలు, భారీ నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో నిపుణులను గుర్తించే నీలం రంగు హెల్మట్‌లకు బదులుగా కార్మిక శ్రేణికి చిహ్నమైన పసుపు పచ్చ హెల్మట్లు ఎక్కువగా ఉండడం మన స్ధాయికి తగినట్లుగా లేదు. ఇంజనీర్లు లేదా మేనేజ్‌మెంట్ ప్రతినిధులుగా పని చేస్తున్న అత్యధికులకు ఆంగ్ల భాషలో ఒక నివేదిక రూపొందించడానికి నానా ప్రయాసలు పడవల్సిన పరిస్ధితి!


సముద్రాల ఆవలి సీమలకు జరుగుతున్న వలసలను పక్కన పెడితే, దేశీయంగా కూడ అభివృద్ధికి అనుగుణంగా వృత్తి నిపుణులు లేకపోవడం ఎంతైనా శోచనీయం. అది అభివృద్ధికి విఘాతమవుతోంది. మహా నగరాలలో సైతం విభిన్న రంగాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా అందుబాటులో వృత్తి నిపుణులు లేరు. తెలుగునాట ఉన్నత స్ధాయి నైపుణ్యత ఉన్నవారందరూ విదేశీబాట పడుతుండగా మధ్యతరగతి వృత్తులలో సైతం ఉత్తరాది రాష్ట్రాల యువత ముందుకు వస్తోంది. చివరకు కళాత్మక పనికి పెట్టింది పేరయిన ఒంగోలు తాపీ మేస్త్రీల స్ధానంలో మధ్యప్రదేశ్ తాపీ మేస్త్రీలకు ఆదరణ లభిస్తోంది. అలాగే పొలాలలో వరి నాట్లు వేయడానికి బెంగాలీ కార్మికులు తెలుగునాటకు వస్తున్నారు. ఒక్క పట్టణంలో కూడ నైపుణ్యత కల్గిన ఒక ఎ.సి. టెక్నీషియన్‌ గానీ, మొబైల్ టెక్నీషియన్‌ గానీ లేకపోవడం గమనార్హం.

సరైన అధ్యాపక వ్యవస్ధ లేని విద్యా సంస్ధలు ఏటా వేలాది సంఖ్యలో అరకొర చదువుతో యువతను వీధులలోకి వదులుతున్నాయి. అనుభవపూర్వకంగా నేర్చుకునే అవకాశాలు వారికి ఏ మాత్రం లేవు. అప్రెంటిస్‌షిప్‌ విధానం అంతరించిపోయింది. సాంకేతిక విద్యా రంగంలో ఏళ్ళ తరబడి భారీ సంఖ్యలో ప్రొఫెసర్లు, లెక్చరర్ల ఖాళీలు ఉన్నాయి. ఒకప్పుడు జాతి నిర్మాణంలో ఐటిఐలు, పాలీటెక్నిక్‌లు ముఖ్య భూమిక వహించాయి. వీటిలో చదివి చక్కెర కార్మగారాలలో పని చేసిన అనేక మంది ప్రపంచ అగ్రగామి పెట్రో రసాయనాల సంస్ధలలో విజయవంతంగా పనిచేస్తున్నారు. మరి వారిని తీర్చిదిద్దిన ఆ పాలీటెక్నిక్‌లు ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.


ఈ పరిస్ధితులలో యువతలో తార్కిక శక్తిని, వృత్తిలో సృజనాత్మక దృక్పథాన్ని పెంపొందించడం ముఖ్యమని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించింది. వికసిత్ భారత్‌లో నైపుణ్య సమృద్ధ యువత కీలకమని గత ఐదేళ్లుగా చెబుతున్నది. అయితే అందుకు తగినట్లుగా కార్యాచరణ ఉన్నదా? లేదు. జాతీయ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ పథకం (నాట్స్)ను పునర్వ్యవస్ధీకరించి ఇంజనీరింగ్, డిప్లోమా హోల్డర్లకు మెరుగైన నైపుణ్యతను సంతరింపచేసేందుకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి, నైపుణ్యాభివృద్ధిలో పైలట్ ప్రాజెక్టు క్రింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన నౌకాశ్రయాల దిగ్గజ సంస్ధ దుబాయి పోర్ట్ వరల్డ్ భాగస్వామ్యంతో వారణాసిలో నౌకాయాన, సరుకు రవాణాకు సంబంధించిన శిక్షణా సంస్ధను ఏర్పాటు చేసింది. సముద్ర తీరంలోని విశాఖ, కాకినాడ, చెన్నై, కొచ్చిన్‌లలో కాకుండా పూర్తిగా భూపరివేష్టిత వారణాసిలో అటువంటి సంస్థను ఏర్పాటు చేయడంలో ఔచిత్యమున్నదా? తెలుగు రాష్ట్రాలు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ భాగస్వామ్యంతో పురోగమించడానికి ప్రయత్నించాలి.


ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా స్కిల్స్‌ యూనివర్సిటీ కొరకు ఏకంగా ఒక నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఎంతో ఆనందం కలిగించింది. అదే సమయంలో అయోమయానికీ గురి చేసింది. యువత దశ, దిశ మార్చే ఈ బృహత్తర కార్యక్రమం స్వాగతించదగ్గదే కానీ దాని కొరకు సరైన అధ్యయనం జరిగిందా అనేది ఇప్పుడు మనముందున్న అసలు ప్రశ్న.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Aug 21 , 2024 | 12:55 AM