Election Results: మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు
ABN , Publish Date - Jun 05 , 2024 | 09:40 AM
21 రోజులపాటు వేచిచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే తరువాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు (బుధవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.
అమరావతి: 21 రోజులపాటు వేచిచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అటు కేంద్రంలో, ఇటు ఏపీలోనూ అధికారాన్ని దక్కించుకుంది. ప్రభుత్వాల ఏర్పాటు చేయడమే తరువాయి. కాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి నేడు (బుధవారం) ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన పాల్గొనబోతున్నాయి. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు (బుధవారం) ఢిల్లీ పయనమవనున్నారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఇరువురు నేతలు తొలిసారి హస్తన వెళ్లనున్నారు.
సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే సమావేశం జరగనుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్ సహా ఇతర ఎన్డీఏ పక్ష నేతలు పాల్గొనబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై నేతలు చర్చించనున్నారు. కాగా మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనునున్న చంద్రబాబు.. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు తిరుగుపయనమవనున్నారు. సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
కీలకంగా మారిన చంద్రబాబు, నితీశ్..
ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరిగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల నుంచి చంద్రబాబు, నితీశ్ కుమార్ మద్దతు బీజేపీకి తప్పనిసరైంది. నేటి భేటీలో వీరివురూ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఏపీలోని కూటమికి చెందిన 21లోక్ సభ సీట్లు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. ఇదిలావుండగా ఢిల్లీలో నేడు (బుధవారం) ఇండియా కూటమి కూడా కీలక సమావేశం నిర్వహించనుంది.