Share News

వ్యర్థాలు లేని గ్రామం... ఆమె ధ్యేయం

ABN , Publish Date - Nov 20 , 2024 | 05:36 AM

ఏం చెయ్యగలమనే నిర్లిప్తతతో ఉన్న గ్రామస్తుల్లో పెనుమార్పుకు నాంది పలికారు ఇతిశా సారా.

వ్యర్థాలు లేని గ్రామం...  ఆమె ధ్యేయం

జీవనాధారమైన నది కాలుష్యం చేరి విషతుల్యంగా మారుతున్నా...

ఏం చెయ్యగలమనే నిర్లిప్తతతో ఉన్న గ్రామస్తుల్లో పెనుమార్పుకు నాంది పలికారు ఇతిశా సారా. లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ఐకమత్యంగా పని చేస్తే సాధించలేనిదేదీ లేదని నిరూపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సంగ్తీని వ్యర్థాలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు.

తూర్పు హిమాలయాల్లోని అరుణాచల్‌ప్రదేశ్‌లోని సంగ్తీ గ్రామం ప్రకృతి సౌందర్యానికి నిలయం. లోయలో ఉన్న ఈ గ్రామాన్ని ఆనుకొని సంగ్తీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పేరుతోనే గ్రామాన్ని కూడా పిలుచుకుంటారు. అక్కడ నివసించే మోన్పా తెగ ప్రజలు టిబెటియన్‌ బౌద్ధాన్ని పాటిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు. కానీ ఆధునికత ప్రభావం ఆ గ్రామం మీద కూడా పడింది. ప్లాస్టిక్‌, ఇతర ఘన వ్యర్థాలు నదిలోకి చేరడం, తీరంలో పేరుకుపోవడం ప్రారంభమయింది. చూపరులకు కనువిందు చేసే ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. ప్రతియేటా ఈ గ్రామానికి వచ్చే నల్లమెడ కొంగల రాక కూడా తగ్గిపోయింది. గ్రామస్తుల ఆరోగ్యం మీద కూడా ఈ ప్రభావం పడింది. ఆ సమయంలో... ఆశాజ్యోతిలా ఆ గ్రామంలో అడుగుపెట్టారు ఇతిశా సారా. ఆమె స్వస్థలం అసోంలోని గువహటి. పుణేలో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత ఢిల్లీ అంబేద్కర్‌ యూనివర్సిటీలో ఎండిఈస్‌ (సోషల్‌ డిజైన్‌) కోర్సులో చేరారు. ‘‘తరగతి గది నుంచి బయటకు వెళ్ళి, ప్రజలను నేరుగా కలిసి, వాళ్ళు నిత్యం ఎదుర్కొనే సమస్యలకు ఆచరణాత్మకమైన పరిష్కారాలను గుర్తించడానికి ఆ కోర్సు నాకు అవకాశం కలిగించింది. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనేదాన్ని. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో విద్యుద్దీపాల ఏర్పాటుకోసం పాటుపడుతున్న ‘ఫర్దర్‌ అండ్‌ బియాండ్‌ ఫౌండేషన్‌’ చేపట్టిన ‘ది బట్టి ప్రాజెక్ట్‌’కు నిధుల సేకరణ కోసం ఢిల్లీ వచ్చిన మెర్విన్‌ కౌంటిన్హో నాకు పరిచయం అయ్యారు. అప్పట్లో నేను ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాల నిర్మూలన మీద యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నాను. తమ ప్రాంతంలోని గ్రామాల పరిస్థితుల గురించి మెర్విన్‌ వివరించారు. వారి ప్రాజెక్ట్‌ తరఫున ఢిల్లీలో పని చేయాలని నన్ను కోరారు. నేను సరేనన్నాను’’ అని గుర్తు చేసుకున్నారు ఇతిశా.

ఎక్కడ చూసినా చెత్తే

తమ ప్రాంతాన్ని సందర్శించాలని ఇతిశాను మెర్విన్‌ తరచూ అడిగేవారు. దాదాపు ఏడాది తరువాత ఆమెకు ఆ అవకాశం వచ్చింది. ‘‘నా స్నేహితుడొకరు కొత్తగా ట్రావెల్‌ కంపెనీ ప్రారంభించారు. తమ విద్యార్థులను వేసవి సెలవుల్లో విహార యాత్రలకు తీసుకువెళ్ళడానికి కొన్ని స్కూళ్ళు అతణ్ణి సంప్రతించాయి. దానికి తగిన సిబ్బంది లేకపోవడంతో... ‘‘ఆ పిల్లలతో కలిసి టూర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఎక్కడికైనా వెళ్ళగలవా?’’ అని అడిగారు. ఆ జాబితాలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రాంతాలు కూడా ఉన్నాయి. నేను ‘‘సరే’’ అన్నాను. అలా తొలిసారిగా .... 2018లో సంగ్తీలో అడుగుపెట్టాను’’ అని చెప్పారు ఇతిశా. అక్కడ నది, లోయ, పొలాలు... ఇలా అన్నీ ఆమెకు ఎంతగానో నచ్చాయి. కానీ ఎక్కడ చూసినా చెత్తే. వీధుల్లో కుప్పలు కుప్పలుగా పడి ఉండేది. నదిలో ప్లాస్టిక్‌ కవర్లు, వ్యర్థాలు తేలుతూ ఉండేవి. అక్కడ మెర్విన్‌ నన్ను కలిసినప్పుడు ఆ సంగతే ప్రస్తావించాను. ‘‘అప్పుడప్పుడు పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ మామూలే’’ అన్నారు. ‘‘ఆయన మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. ఈ గ్రామాన్నే నా కార్యక్షేత్రంగా ఎందుకు ఎంచుకోకూడదనిపించింది’’ అని అంటారు ఇతిశా. ఢిల్లీకి తిరిగి వెళ్ళిన ఆమె... ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మళ్ళీ సంగ్తీలో అడుగుపెట్టారు. ‘నార్త్‌ ఈస్ట్‌ వేస్ట్‌ కలెక్టివ్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారు.. స్థానిక యువత సాయంతో ప్రజల్లో అవగాహన కలిగించడానికి సమావేశాలు ఏర్పాటు చేశారు.


పవిత్ర దినాల్లో...

‘‘మేము చేసిన కార్యక్రమాలతో... గ్రామస్తులలో మార్పు మొదలయింది. ‘‘మొదట ప్రజలు తమ ఇళ్ళలోని చెత్తను ఇష్టానుసారం రోడ్ల మీదో, ఇళ్ళ పక్కనో పడెయ్యకుండా... ఒక నిర్దిష్టమైన చోట వేసేలా చేశాం. గ్రామపెద్దలు, అధికారులతో మాట్లాడి... లోయలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించేలా చేశాం. బౌద్ధుల చాంద్రమాన పంచాంగం ప్రకారం... మోన్పా తెగవారికి నెలకి నాలుగు నుంచి అయిదు పవిత్రమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో వాళ్ళు పొలం పనులు చెయ్యరు, వాటిని సెలవులుగా పరిగణిస్తారు. ఆ రోజులను వ్యర్థాల నిర్వహణకోసం కేటాయించేలా ఒప్పించాం. ప్రతినెలా ఎనిమిదో రోజును సామాజికసేవా దినంగా నిర్ణయించాం. ఆ రోజు తమ వీధుల్ని శుభ్రపరిచే పనిలో ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి పాల్గొనాలి. కాలనీలవారీగా బాధ్యులను ఎంపిక చేశాం. వారు పనులు సజావుగా జరిగేలా వాళ్ళు పర్యవేక్షిస్తారు’’ అని వివరించారు ఇతిశా. దానితోపాటు ప్రతిరోజూ నిర్దేశించిన చోట చెత్త వేయడం, వారానికి ఒకసారి తమ ప్రాంతాలను శుభ్రం చేయడం, ఎక్కడైనా చెత్త పేరుకుపోతే దాన్ని వెంటనే తొలగించడం లాంటి పనుల కోసం ఎక్కడికక్కడ కమిటీలు వేశారు. అలాగే విద్యార్థులకు పారిశుధ్యం ప్రాధాన్యాన్ని బోధించి, వారిని కూడా తమ కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు.పోగు చేసిన చెత్త అంతటినీ సంగ్తీ లోయలో, దగ్గర్లోని నామ్‌డ్రోలింగ్‌ గ్రామంలో ఉన్న రెండు ప్రదేశాలకు తీసుకువెళ్తారు. అక్కడ స్వయం సహాయక సంఘాలకు చెందిన దాదాపు వందమంది మహిళలు వాటిని వేరు చేస్తారు. కంపోస్ట్‌ తయారు చెయ్యడానికి వీలైనవాటిని ఒక యార్డులోకి తరలిస్తారు.

అక్కడే స్థిరపడాలని...

ఇప్పుడు సంగ్తీ లోయ మునుపటి ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకుంటోంది. వ్యర్థాల రహిత గ్రామంగా రూపు దిద్దుకుంటోంది. ఇతిశా, ఆమె బృందం చేస్తున్న ప్రచారం కారణంగా పర్యాటకుల సంఖ్య పెరిగింది. దానితోపాటు సంగ్తీలో పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే గ్రామస్తుల సంఖ్య పెరిగింది. దానితో వారికి మంచి ఆదాయం కూడా వస్తోంది. ‘‘పర్యాటక కేంద్రంగా ఇంకా ఎంతో అభివృద్ధి చెందే అర్హత, ఆస్కారం సంగ్తీ లోయకు ఉన్నాయి. అందుకోసం అవసరమైన సౌకర్యాల కల్పనకు గ్రామస్తులు, అధికారుల సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం’’ అంటున్న ఇతిశా గ్రామస్తులకు మరింత దగ్గరగా ఉండడం కోసం, వాళ్ళకు మార్గనిర్దేశం చేయడం కోసం తన నివాసాన్ని సంగ్తీకి మార్చారు. ‘‘ఇప్పుడు ఈ గ్రామస్తులందరూ నాకు ఆత్మీయులు అయిపోయారు. మరెక్కడున్నా ఈ అప్యాయత నాకు దొరకదని తెలుసు. అందుకే ఈ లోయలోనే స్థిరపడాలనుకుంటున్నాను. స్థానికులకు సాధికారత కల్పించడం, భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం నా ఆశయం’’ అని చెబుతున్నారు. ఇతిశా.

చెత్త పోగుపడడం వల్ల నదికీ, గ్రామానికీ,

పర్యావరణానికీ ఎంత నష్టం అనేది గ్రామస్తులకు ఇతిశా బోధపరిచారు. మనం చెయ్యాల్సిన పని ఎవరో వచ్చి చేస్తూ ఉంటే... వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూస్తూ ఉండడం మానాలనీ, ప్రతి ఒక్కరూ పరిసరాల్ని శుభ్రంగా ఉంచే దీక్షలో భాగస్వాములు కావాలనీ చెప్పారు. వ్యర్థాలను సేకరించడం, వాటిని వేరు చేయడం, కంపోస్ట్‌ తయారు చేయడం... ఇలా అనేక అంశాలను ప్రజలకు వివరించారు.

Updated Date - Nov 20 , 2024 | 05:36 AM