మరో.. స్వాతంత్ర్యోద్యమం అవసరం
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:19 AM
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచమంతా నమ్ముతుంటే... ‘అవేకెన్ ఇండియా మూవ్‌మెంట్’ ఉద్యమకారిణి సరస్వతి కవుల మాత్రం ఆ టీకాలు ప్రాణాంతకమైనవని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఎంతో సౌలభ్యమని భావిస్తున్న డిజిటల్
కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రపంచమంతా నమ్ముతుంటే... ‘అవేకెన్ ఇండియా మూవ్‌మెంట్’ ఉద్యమకారిణి సరస్వతి కవుల మాత్రం ఆ టీకాలు ప్రాణాంతకమైనవని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఎంతో సౌలభ్యమని భావిస్తున్న డిజిటల్ కరెన్సీ... మన జీవితాల మీద మనకు హక్కు లేకుండా చేసే ప్రక్రియగా ఆమె అభివర్ణించారు. ‘ఇదంతా ప్రపంచ ప్రఖ్యాత అపర కుబేరుల మార్కెట్ అవసరాల కోసం ప్రపంచ దేశాలన్నిటినీ ఒకే చోటకు తీసుకొచ్చేందుకు మొదలైన కుట్ర. దీనికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం’ అంటున్న సరస్వతి... తమ సంస్థ ఉద్దేశాలు, లక్ష్యాల గురించి ‘నవ్య’తో ఇలా చెప్పుకొచ్చారు.
‘‘కరోనా పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పౌరుల హక్కులను హరిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ మా ‘అవేకెన్ ఇండియా ఉద్యమం’ 2020, అక్టోబరు2 గాంధీజయంతి రోజున ముంబైలో మొదలైంది. తెలంగాణతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ఒడిశా, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో చాలా బలంగా సాగుతోంది. ఇందులో ప్రఖ్యాత వైద్యులు, న్యాయవాదులు, పౌరసంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు చాలామంది భాగమయ్యారు. మొదటగా కొవిడ్‌ను ‘ప్యాండమిక్’ కాదు ‘ప్లాన్‌డమిక్’గా గుర్తించాం. కరోనా కేసులను మ్యాథమెటికల్‌గా ప్రొజెక్టు చేసి మరీ భయాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా నిరసించాం. దీనికి వ్యాక్సిన్ మినహా మరో విరుగుడులేదని నమ్మబలికారు. దీనికి వ్యతిరేకంగా ఊరూవాడా తిరిగి ప్రచారం చేశాం. క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండా, తర్వాత కాలంలో తలెత్తే దుష్ప్రభావాలను గుర్తించకుండా ప్రతి ఒక్కరికీ కరోనా టీకాలు బలవంతంగా వేయించారు. వ్యాక్సిన్ తీసుకోవడమన్నది స్వచ్ఛందమని వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లోనూ ప్రస్తావించినా, ఆచరణలో అందుకు విరుద్ధంగా నడుచుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ మా ‘అవేకెన్ ఇండియా’ ప్రతినిధి డాక్టర్ జాకబ్ పులియెల్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేశారు. ఆ సందర్భంగా... టీకా తీసుకోనివారిపట్ల ప్రభుత్వమే వివక్ష చూపించడాన్ని, వారి ప్రాథమిక హక్కుల మీద దాడిగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, బలవంతంగా టీకాలు వేయడం చట్ట వ్యతిరేకం. ముందుగా వ్యాక్సిన్ తయారీలో వాడిన పదార్థాలు, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడంతోపాటు అది తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా ఆ వ్యక్తి ఇష్టమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఇది ‘అవేకెన్ ఇండియా’కు అతి పెద్ద విజయం.
కరోనా అనంతర మరణాలు...
కరోనా టీకాల అనంతర కాలంలోనే కొవిడ్ కేసులు పెరిగాయి. పైగా ఆ తర్వాతే డెల్టా వేవ్ వచ్చింది. ఏటా మన దేశంలో కనీసం పది లక్షలమంది పొగాకు ఉత్పత్తుల వాడకంవల్ల చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అంగీకరించింది.
మొత్తం మరణాల సంఖ్యలో 9.5 శాతం పొగాకువల్ల జరుగుతుంటే, సిగరెట్ కంపెనీలు మూతపడవు. అదే కరోనా వల్ల 0.02 శాతం మంది చనిపోతే, 130 కోట్లమంది జనాభాకు ప్రాణాంతకమైన టీకాలు వేయడం దారుణం కదా. దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్లాం. పైగా ‘అది మీ మంచి కోసమే’ అంటూ జనాన్ని ఎమోషనల్‌గా బెదిరించారు. వార్తల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్ల భారత్‌లో సుమారు 18 వేలమంది చనిపోయారు. అంతెందుకు... 11-17 ఏళ్ల మధ్య పిల్లలు 130 మంది టీకా తీసుకున్న కొద్ది రోజుల్లోనే మరణించిన ఘటనలు మా దృష్టికొచ్చాయి. అయితే ఈ మరణాలకు... వ్యాక్సిన్‌కు సంబంధం లేదని ఐసీఎమ్మార్ చెబతోంది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయినవారి శరీరానికి పంచనామా చేయాలని మేము కొట్లాడినా లాభం లేకపోయింది. అయినా మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఇదివరకెన్నడూ లేని విధంగా... కరోనా అనంతర కాలంలోనే టీనేజర్లు, యువకులు గుండెపోటుతో చనిపోతున్నారన్న వార్తలు వింటున్నాం. ఇలాంటి విషయాల మీద సమాజంలో అవగాహన కల్పిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. డబ్ల్యూహెచ్‌వో చెప్పిందనో, ప్రభుత్వం ఆదేశించిందనో మన జీవితాలను పణంగా పెట్టడం సరికాదు. వీటన్నిటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.
పోలీసుల పరోక్ష మద్దతు...
వాస్తవాలను ప్రజలముందు ఉంచుతున్న క్రమంలో మేము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా కరోనా కాలంలోనే టీకాలు తీసుకోవడంవల్ల తలెత్తే అనర్థాలను వివరిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక ప్రాంతంలో ప్రచారం చేస్తున్నాం. స్థానిక పోలీసులు మమ్మల్ని అడ్డుకొని, స్టేషన్‌కు తీసుకెళ్లారు. మమ్మల్ని చట్టవ్యతిరేకులని అన్నారు. వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మా పోరాటం చట్టబద్ధమైనదే అని సాక్ష్యాలు చూపిస్తూ... ఈ టీకాల తయారీలో వాడే కొన్ని పదార్థాలవల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి అక్కడి పోలీసులకు వివరిస్తే... వారంతా నిర్ఘాంతపోయారు. ‘అవేకెన్ ఇండియా’ లేవనెత్తిన అంశాలను సమ్మతించారు. మా పోరాటానికి పరోక్ష మద్దతు తెలిపారు. మాస్కు పెట్టుకోవడంవల్ల మరింత ప్రమాదమని కూడా ప్రచారం చేశాం. మాస్కు పెట్టుకోనందుకు మరొకచోట పోలీసులు చలానా రాస్తే, మాస్కు ధరించడం ఐచ్ఛికమని ప్రభుత్వమే వెబ్‌సైట్‌లో పొందిపరిచిన విషయాన్ని గుర్తుచేశాం. దాంతో పోలీసులు వెనక్కి తగ్గారు. కరోనా వ్యాక్సిన్‌వల్ల తలెత్తిన దుష్ప్రభావాలను రికార్డు చేయడంతోపాటు కేసులను రిపోర్టు చేయాలన్నదీ మా ప్రధాన డిమాండ్లలో ఒకటి.
దుష్ప్రభావాలు లేని చికిత్సలున్నా...
ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, అల్లోపతిలోని ఐవర్ మెక్టిన్ లాంటి దుష్ప్రభావాలు లేని వైద్య చికిత్సలను అంగీకరించకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను నిర్బంధంగా అమలుచేశారు. కరోనా నియంత్రణకు అధిక మోతాదులో విటమిన్ సీ, డీ3, మెలటోనిన్‌లను ఇవ్వడంతో పాటు యాంటీ ఫంగల్ చికిత్సతో రోగాన్ని నయం చేయవచ్చని ప్రవీణ్‌కుమార్ సక్సేనా, దిగంబర నాయక్, సుధా చేప్యాల, లలిత్‌కుమార్ దేవరావు లాంటి ప్రముఖ అల్లోపతి వైద్యులు ఐసీఎమ్మార్‌కు వివరణాత్మకంగా నివేదిక ఇచ్చినా లాభం లేకపోయింది. ప్రపంచ దేశాలన్నీ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌ఓ) కను సన్నల్లో నడుచుకుంటున్నాయి. అదొక ప్రైవేటు సంస్థ. దాని ప్రయోజనాలు వేరు. అసలు వ్యాక్సిన్ తయారీ కంపెనీల వెనుక ‘బిల్‌గెట్స్ ఫౌండేషన్’ పాత్ర ప్రముఖంగా ఉందని ‘అవేకెన్ ఇండియా’ గుర్తించింది.
ప్రపంచ కుబేరుల కుట్ర...
కరోనా లాంటి ‘ప్లాన్‌డమిక్’ వెనుక బిల్‌గేట్స్, క్లౌస్ శ్వాబ్, జార్జి సోరెన్సెన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత అపర కుబేరుల స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ప్రపంచాన్నంతటినీ ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి... తద్వారా వనరుల మీద గుత్తాధిపత్యంచేయాలన్నది వారి లక్ష్యం. అందుకోసం వన్ వరల్డ్ గవర్నమెంట్, ఒక కొత్త విశ్వ వ్యవస్థ (న్యూ వరల్డ్ ఆర్డర్) స్థాపించాలన్నది ఈ నయా సామ్రాజ్యవాదుల ఆలోచన. ‘వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ లాంటి సంస్థల ద్వారా దేశదేశాల ఆర్థిక వ్యవస్థలను వారి ఆధీనంలోకి తీసుకోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మిగతా దేశాలను శాసించడం... ఇలాంటివన్నీ ఆ కుట్రలో భాగమే. ఇప్పుడు ‘ఇ-రూపీ’ కూడా అలాంటిదే. డిజిటల్ కరెన్సీ అన్నది ఒక పథకం ప్రకారం రూపొందించింది. దీనిలో మన డబ్బు మీద పూర్తి అధికారం మనకు ఉండదు. అంతేకాదు... మన సొమ్మును మనం దేనికి వాడుకోవాలో కూడా వారే నిర్ణయిస్తారు. మన డబ్బును... నిర్ణీత గడువులో, నిర్దేశిత మొత్తాన్ని ఖర్చుపెట్టకుంటే దాన్ని వెనక్కితీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఫేషియల్ రికగ్నైజ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నిరంతరం పౌరుల మీద నిఘా పెడతారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తే, వారి ఖాతాలను నిలిపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, మనకు సంబంధించిన సమస్త సమాచారం బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటుంది కనుక. మొత్తంగా ఈ-రూపీ (డిజిటల్ కరెన్సీ) వాడకమంటే పరాధీనతలోకి జారుకోవడమే. ‘డిజిటల్ కరెన్సీ వద్దు’ అంటూ ప్రధానికి పోస్టు కార్డు రాయాలని పిలుపునిచ్చాం.
జాగృతం చేయడమే లక్ష్యం...
వ్యాక్సిన్ల దుష్ప్రభావాల మీద ప్రఖ్యాత వైద్యుడు ప్రవీణ్ సక్సెనా గారి ద్వారా 2006 నుంచి నాకు కొంత అవగాహన ఉంది. ప్రముఖ కార్డియాలజిస్టు ప్రశాంతి అట్లూరి ప్రోత్సాహంతో అమెరికా, భారత్‌లలోని కొంతమంది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు, డాక్టర్లు, సామాజికవేత్తలను కలిసి ‘డీకోడ్ వ్యాక్సిన్’ పేరుతో రెండు భాగాలుగా డాక్యుమెంటరీ తీశాను. దీంతో పాటు వ్యాక్సిన్ల మీద అవగాహన కల్పిస్తూ ‘అవేకెన్ ఇండియా’ ద్వారా మేం రూపొందించిన వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచాం. కానీ వాటిని ఆయా సంస్థలు తొలగించాయి. అందుకే వాటిని ‘బిట్‌చ్యూట్’ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాం. కరోనా లాంటి ‘ప్లాన్‌డమిక్’ల ద్వారా ప్రపంచ జనాభాను తగ్గించడం, తద్వారా ప్రకృతి వనరుల మీద పూర్తి ఆధిపత్యాన్ని పొందడం, ప్రపంచాన్ని శాసించడం లాంటి ప్రపంచ కుబేరుల దుర్మార్గ ఆలోచనలను, వారి కుట్రలను తిప్పికొట్టడమే మా ప్రధాన లక్ష్యం. అందుకోసం మరొక స్వాతంత్య్ర ఉద్యమం అవసరమని నమ్ముతున్నాం. ఆ దిశగా జనాన్ని జాగృతం చేస్తున్నాం.’’
హెచ్‌పీవీతో దుష్ప్రభావాలు...
గర్భాశయ ముఖద్వార కేన్సర్ నియంత్రణలో భాగమంటూ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ దీనివల్ల కలిగే దుష్ప్రభావాలను మాత్రం ప్రజల ముందు ఉంచడంలేదు. ఈ టీకా తయారీలో వాడే పదార్థాల వివరాలు తెలియచేయడంలేదు. ‘ఫైజర్’ కంపెనీ ‘గర్దసిల్’ టీకా తీసుకున్న అమెరికన్ బాలికలలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ నరాల మీద దాడిచేయడం, గుండె పోటు, మెదడులో బ్లడ్ క్లాట్స్, అల్సరేటివ్ కొలిటిస్ తదితర జబ్బులకు గురయ్యారని వింటున్నాం. ఇదే హెచ్‌పీవీ టీకా క్లినికల్ ట్రయిల్‌లో తెలంగాణ, గుజరాత్ ప్రాంతాలకు చెందిన ఏడుగురు అమ్మాయిలు 2007లో చనిపోయిన విషయం దాచేస్తే దాగదు కదా. అప్పుడు ఈ టీకాల తయారీని ప్రోత్సహించిన ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’కు అనుబంధమైన ‘పాత్’ స్వచ్ఛంద సంస్థను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బహిష్కరించింది. ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను మన దేశంలోని అమ్మాయిలందరికీ ఇస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. హెపటైటిస్ బీ లాంటి లైంగిక సంక్రమిత వ్యాధుల నిరోధక టీకాలను పసిపిల్లలకు ఇవ్వడంవల్ల తలెత్తే పరిణామాలను ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. టీకాలంటేనే జీవాలను చంపి చేసేది. హింసాత్మకమైంది. కనుక దీన్ని మహాత్మాగాంధీసైతం వ్యతిరేకించారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలు, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించకుండా మనుషులను వినియోగదారులుగా మార్చడంలో భాగమే ఈ వ్యాక్సిన్లు. అందుకే దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి.
సాంత్వన్