పిల్లలు ఎవరితోనూ కలవడం లేదా?
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:29 AM
కొంతమంది పిల్లలు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో అయితే గది నుంచి బయటికి కూడా రారు.
కొంతమంది పిల్లలు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. కొన్ని సందర్భాల్లో అయితే గది నుంచి బయటికి కూడా రారు. దీనికి కారణాలేంటో తెలుసుకుందాం!
అవమానించేలా మాట్లాడడం
కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పుడూ వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడుతుంటారు. విషయాన్ని సూటిగా చెప్పే వీలున్నప్పటికీ పిల్లల మనసు గాయపరిచేలా మాట్లాడతారు. దీనితో పిల్లలు తమ తల్లిదండ్రుల ముందుకు రావడానికి కూడా ఇష్టపడరు. ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వారిముందు పిల్లలను తక్కువచేసి మాట్లాడడం కూడా మంచిది కాదు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గి, బయటి వ్యక్తులతో కలవడానికి ఉత్సాహం చూపించరు.
అతిగా ప్రశ్నించడం
స్కూలు, కాలేజీ, స్నేహితుల గురించి ఎక్కువగా ప్రశ్నలు అడగడం పిల్లలకు నచ్చకపోవచ్చు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు... ఇలా ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఉత్సాహంగా సమాఽధానాలు చెబుతారు. ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటారు. ఇలాంటి పిల్లలతో ఎటువంటి సమస్యా ఉండదు. కానీ ఇంకొందరు పిల్లలు మాత్రం తమకు సంబంధించిన అంశాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఏదైనా అడిగినా కూడా చిరాకు పడతారేగానీ ఏమీ చెప్పరు. అవే ప్రశ్నలు గుచ్చిగుచ్చి అడిగితే తప్పించుకునే ప్రయత్నంగా గదిలోకెళ్లి బయటికి రారు. ఈ సమస్య ఎక్కువగా యుక్తవయసు పిల్లల్లో కనిపిస్తుంటుంది. పిల్లలు తమ మనసులోని భావాలను వారంతటవారే చెప్పేలా తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలిగితే సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.
ఏకాంతం లేకపోవడం
హైస్కూల్ లేదా కాలేజీలకు వెళ్లే పిల్లలు కొంత ఏకాంతాన్ని కోరుకోవడం సహజం. ఎదిగే పిల్లలు తమ గురించి తాము తెలుసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, తమతో తాము సంతోషంగా గడపడానికి, భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి కొంత సమయం ఒంటరిగా ఉండాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు తెలిసో తెలియకో పిల్లల ఏకాంతాన్ని భంగపరుస్తుంటారు. దీనితో పిల్లలు గదిలోకెళ్లి తలుపులు వేసుకుని గంటల సమయం గడిపేస్తుంటారు. యుక్తవయసు పిల్లల వ్యక్తిగత స్వేచ్చను గౌరవిస్తూ వారికి మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
అకారణంగా మందలించడం
కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎదురుపడితే చాలు ‘ఇంట్లో ఏదైనా పని చేయొచ్చు కదా! చదువుకోవచ్చు కదా!’ అంటూ ఊరికే మందిలిస్తూ ఉంటారు. దీనితో పిల్లలు గది నుంచి బయటికి రారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కొంతమేర స్వేచ్ఛను ఇస్తూ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం నేర్పించాలి. ఇది పిల్లల మానసిక వికాసానికి, వారిలో లోకజ్ఞానం పెరగడానికి దోహదం చేస్తుంది.