ఫ్లోరల్ ఫ్రాక్స్
ABN , Publish Date - Jul 10 , 2024 | 12:41 AM
పువ్వులు స్త్రీత్వాన్నీ, సహజసిద్ధ సౌందర్యాన్నీ ప్రతిబింబిస్తాయి. ఆహ్లాదకరమైన అనుభూతిని కూడా అందిస్తాయి. కాబట్టే ఫ్లోరల్ ఫ్రాక్స్ నిరంతర ఆదరణ పొందుతూ ఉంటాయి...
ఫ్యాషన్
పువ్వులు స్త్రీత్వాన్నీ, సహజసిద్ధ సౌందర్యాన్నీ ప్రతిబింబిస్తాయి. ఆహ్లాదకరమైన అనుభూతిని కూడా అందిస్తాయి. కాబట్టే ఫ్లోరల్ ఫ్రాక్స్ నిరంతర ఆదరణ పొందుతూ ఉంటాయి. అన్ని కాలాలకూ సూటయ్యే ఫ్లోరల్ ఫ్రాక్స్ మీద ఓ లుక్కేద్దామా?
1960ల్లోనే గుచి కంపెనీ ఫ్లోరా ప్రింట్ పేరుతో సుప్రసిద్ధ ఫ్లోరల్ ప్యాటర్న్‌ను వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచి పూల దుస్తులు సరికొత్త హంగులను అద్దుకుంటూ మహిళలను అలరించడం మొదలుపెట్టాయి. బుట్టబొమ్మల్లా బొద్దుగా కనిపించడం కోసం, నాజూకుగా మెరిసిపోవడం కోసం భిన్నమైన మెటీరియల్స్‌తో ఈ ఫ్లోరల్ ఫ్రాక్స్ తయారవుతూ ఉంటాయి. శాటిన్, ఆర్గంజా, సింథటిక్, జార్జెట్... ఇలా వెరైటీ మెటీరియల్స్‌తో తయారయ్యే వినూత్నమైన ఫ్లోర్ ఫ్రాక్స్ అన్ని రకాల వయసులవారినీ అలరిస్తూ ఉంటాయి.
అన్ని సందర్భాల్లో...
ఫ్లోరల్ ఫ్రాక్, పార్టీ వేర్‌గా పనికిరాదనుకుంటే పొరపాటు. ఈవినింగ్ గౌన్‌గా, వేడుకల్లో ధరించే పార్టీ గౌన్‌గా, కంఫర్ట్ వేర్‌గా, రెగ్యులర్ వేర్‌గా సందర్భానికి తగిన మెటీరియల్‌తో వేర్వేరు ఫ్రాక్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాటన్‌తో తయారయ్యే ఫ్రాక్స్‌ను రెగ్యులర్ వేర్‌గా, శాటిన్, ఆర్గంజాతో తయారయ్యే వాటిని పార్టీ వేర్‌గా, జార్జెట్, సింథటిక్ ఫ్రాక్స్‌ను ఈవినింగ్ గౌన్స్‌గా వేసుకోవచ్చు.
తళుకులీనేలా...
సెక్విన్లు, మోటి్‌ఫలు, జరీ మెరుపులు, సెమీ ప్రెషియస్ స్టోన్స్... వీటితో తీర్చిదిద్దిన ఫ్లోరల్ ఫ్రాక్స్ భారీగా కనిపిస్తాయి. వీటిని పుట్టిన రోజు వేడుకలు, రిసెప్షన్ల కోసం ఎంచుకోవచ్చు. ఫ్రిల్స్, ఫ్లోయీ డిజైన్లు నాజూకుగా ఉన్నవాళ్లకు చక్కగా సూటవుతాయి. పెద్ద పెద్ద పూలు, లతలు, ముదురు రంగులు కూడా వీళ్లకు చాలా బాగా నప్పుతాయి. కాస్త బొద్దుగా ఉన్నవాళ్లు చిన్నపాటి పూల డిజైన్లను ఎంచుకోవాలి. నడుము పైభాగంలో ఫ్లవర్స్ ఉన్నా, కింది భాగం ప్లెయిన్‌గా ఉండేలా చూసుకోవాలి.
యాక్సెసరీస్
పెన్సిల్ హీల్స్, యాంకిల్ బూట్స్ ఈ రకం ఫ్రాక్స్‌కు చక్కగా నప్పుతాయి. వెల్వెట్‌తో తయారైన బూట్లు ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. మెడలో డైమండ్ చోకర్, చేతికి అదే రకం బ్రేస్‌లెట్, చెవులకు జూకాలు బాగుంటాయి. భారీ స్టడ్స్ కూడా సూటవుతాయి.