Share News

వివాహం విజయవంతమవ్వాలంటే..

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:43 AM

విజయవంతమైన వైవాహిక సంబంధానికి అవసరమైన పాళ్లేమిటి? చాలా మంది జంటలకు ఎదురయ్యే ప్రశ్న ఇది. మానసిక శాస్త్రవేత్తలు వివరిస్తున్న ఈ పాళ్లేమిటో చూద్దాం..

వివాహం విజయవంతమవ్వాలంటే..

విజయవంతమైన వైవాహిక సంబంధానికి అవసరమైన పాళ్లేమిటి? చాలా మంది జంటలకు ఎదురయ్యే ప్రశ్న ఇది. మానసిక శాస్త్రవేత్తలు వివరిస్తున్న ఈ పాళ్లేమిటో చూద్దాం..

ఆరోగ్యకరమైన సరిహద్దులు..

ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగతమైన విషయాలు.. ఆలోచనలు ఉంటాయి. ఆ విషయాలలోకి చొచ్చుకురానంత వరకు ఎటువంటి సమస్యలు రావు. ప్రతి వ్యక్తి తన భాగస్వామికి సంబంధించిన ప్రైవసీని గౌరవించాలి. ఆ ప్రైవసీ హద్దులను దాటకూడదు. దాటితే సమస్యలు ఎదురవుతాయి.

ఆలంబన

ఆడ, మగ అనే తేడా లేకుండా అందరికీ జీవితంలో ఎదగాలనే ఆశ ఉంటుంది. కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను చేరుకోవటానికి సాయపడే వారి కోసం వారు ఎదురుచూస్తూ ఉంటారు. తన భాగస్వామికి ఏం కావాలో తెలుసుకొని- ఆ లక్ష్యాన్ని చేరుకోవటంలో వారికి సాయపడినప్పుడు మంచి అనుబంధం ఏర్పడుతుంది.

అభిప్రాయాల కలయిక..

ఏ ఇద్దరు ఒకలా ఉండరు. అభిప్రాయాలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. కానీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే- ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవాలి. హాబీలను పంచుకోవాలి. ఇలా కొద్ది కాలం ప్రయాణం చేస్తే- ఒకరిపై మరొకరికి భరోసా ఏర్పడుతుంది. ఆనందంగా జీవించగలుగుతారు.


విలువల పందిరి

రెండు కుటుంబాల నుంచి వచ్చిన వారికి వేర్వేరు విలువలు.. జీవన శైలి ఉండే అవకాశముంది. అయితే మౌలిక భావనలు ఒకటే అయినప్పుడు వాటిని గుర్తించి ఆచరిస్తే- అనుబంధం బలపడుతుంది.

మార్పు అవసరం

ఇతరుల అభిప్రాయాలను అర్థం చేసుకోవటం.. వాటిని గౌరవించటం చాలా కష్టమైన విషయం. వివాహ బంధంలో - ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చకపోవచ్చు. కానీ తమ అవసరమైన తమ అభిప్రాయాన్ని మార్చుకొనే పరిణితి ఉండాలి. అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు వాటిని అధిగమించటానికి ప్రయత్నించాలి. మొత్తం వివాహబంధాన్నే వదిలేసి పారిపోకూడదు.

సుఖాలే కాదు కష్టాలు కూడా

వివాహబంధంలో నవ్వులే కాదు.. విషాదాలు ఉంటాయి. సరదాలే కాదు. సమస్యలు ఉంటాయి. సమస్యలు ఎదురయినప్పుడు- వాటిని అధిగమించటానికి ఒకరితో మరొకరు మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడే వివాహబంధం బలోపేతమవుతుంది.

స్నేహితులుగా మారండి..

భార్య, భర్తలనగానే కుటుంబం పట్ల.. సమాజం పట్ల తమకు ఉన్న బాధ్యతలు గుర్తుకు వస్తాయి. ఈ బాధ్యతల ఒత్తిడిలో సమస్యలే ఎక్కువగా కనిపిస్తూ ఉండచ్చు. అందువల్ల భార్యభర్తలు ముందు ఒకరితో మరొకరు అన్నీ పంచుకొనే స్నేహితులుగా మారాలి. ఆ తర్వాతే సహచరులు అవ్వాలి.

ప్రాధమ్యాలు..

ఆధునిక జీవితంలో అందరూ చాలా బిజీగా ఉండారు. అలాంటి బిజీ షెడ్యూల్స్‌లో కూడా భాగస్వామికి తగిన సమయం కేటాయించాలి. పనితో పాటుగా వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వివాహబంధం బలపడుతుంది.

Updated Date - Aug 21 , 2024 | 04:43 AM