Share News

Navya : ఆరోగ్యానికి అద్భుత సూపులు

ABN , Publish Date - Aug 31 , 2024 | 02:52 AM

సూపు అనగానే అది ఇంగ్లీషు వారి విదేశీ వంటకం అనే భ్రమలో చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ ‘సూపం’ పేరుతో రకరకాల సూపుల్ని క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో పేర్కొన్నాడు.

Navya : ఆరోగ్యానికి అద్భుత సూపులు

తాం కండితాం దధివిమర్దిత ముద్గదాలిం

సంసాధితాం లవణగంధ సమాయుతాంచ

తే భుంజతే కుముదహాసకరార్థమూర్థా

యేషాం సదా హృదయచారుగృహం నిషణ్ణ

సూపు అనగానే అది ఇంగ్లీషు వారి విదేశీ వంటకం అనే భ్రమలో చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ ‘సూపం’ పేరుతో రకరకాల సూపుల్ని క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో పేర్కొన్నాడు. క్షేమశర్మ కాలం నాటికి ఈ దేశానికి ఆంగ్లేయులు రాలేదు. సూపులు రెండు రకాలు. చిక్కగా ఉండేవి (థిక్‌ సూప్స్‌), పలుచగా ఉండేవి (క్లియర్‌ సూప్స్‌). నిజానికి మన పప్పుచారు, చారు ఇలాంటి సూపులే. వాటిని అన్నంలో కలుపుకునే విధంగా మనం చేసుకుంటున్నాం. పులుపు, కారాలు తగ్గిస్తే తాగేందుకు వీలుగా ఉంటాయి. కొన్నింటిని వేడివేడిగా తాగితేనే బావుంటాయి. కొన్ని ఫ్రిజ్జులో పెట్టుకుని చల్లగా తాగితే కమ్మగా ఉంటాయి.

‘సూపం’ పలుచగానే ఉంటుంది. అందులో చిక్కబరిచే ద్రవ్యాల్ని కలిపితే చిక్కగా అవుతుంది. సూపులో కలిపే ద్రవ్యాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఫ్రెంచివాళ్లు ‘ప్యూరీస్‌’ పేరుతో కూరగాయల సూపులు చేసుకుంటారు. ఏ కూరగాయనైనా మెత్తగా మిక్సీ పట్టి, ఆ రసంలో కావలసిన పరిమళ ద్రవ్యాల్ని కలిపి కాచినది ‘ప్యూరీ సూపు’. మనం ములక్కాడ చారు, టమోటా చారు వగైరాల్ని ఇలా సూపులా తాగేందుకు అనుకూలంగా చేసుకుంటే ఎక్కువ ఆరోగ్యకరం. ఆరు అంగుళాల సొరకాయ ముక్కని మిక్సీ పట్టి, ఆ రసంతో సూపు కాచుకుంటే పెద్ద గ్లాసుడు సొరకాయ సూపు తయారవుతుంది. పోషకాలతో పాటు చాలినంత ఫైబరు, జీర్ణశక్తిని పెంచే మిరియాలపొడి, ధనియాలు జీలకర్ర, సోంపు ఇలాంటివి ఇందులో ఉంటాయి. ఒక గ్లాసు సూపు తాగితే అది సంపూర్ణ ఆహారమే. క్రీమ్‌ కలిపితే మరింత రుచిగా ఉంటుంది. చిక్కదనం కావాలంటే బార్లీ, సగ్గుబియ్యం, శనగ, మొక్కజొన్న, సోయాబీన్‌ లాంటి ద్రవ్యాల పిండిని కలుపుతారు. కీరా, క్యారెట్‌, గుమ్మడి... ఇలా ఏ రకమైన కూరగాయతోనైనా సూపు చేసుకోవచ్చు.


పెసరపప్పు సూపు...

పెసరపప్పుతో సూపు లేదా సూపం తయారు చేసుకునే విధానాన్ని క్షేమశర్మ ఇలా వివరించాడు:

‘కండితం’ అంటే పొట్టు తీసిన పెసరపప్పుని పెరుగులోగానీ మజ్జిగలోగానీ నానబెట్టి, మెత్తగా రుబ్బి, కావలసినన్ని నీళ్లు, కలిపి అందులో మీకు ఇష్టమైన పరిమళ ద్రవ్యాలు, సైంధవ లవణం చేర్చి కాచినది ‘ముద్గ సూపం’. మూంగ్‌దాల్‌ సూప్‌ అని ఇంగ్లీషులో అంటారు. ‘ముద్గసూపో లఘు గ్రాహీ కఫపిత్తహరో హిమః’... పెసరపప్పుతో ఇలా సూపు కాచుకుని తాగితే విరేచనాల వ్యాధిలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. చలవ చేస్తుంది. ఒంట్లో వేడిని చల్లబరుస్తుంది. దానిమ్మ గింజలు, ఎండు ద్రాక్ష, ఇతర డైన్రట్స్‌ లాంటివి కలుపుకుని తాగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కఫ పైత్యాల్ని తగ్గిస్తుంది. కంటికి మంచిది. పురుషులలో జీవకణాలను పెంచుతుంది.


పెసర, మినప్పప్పు సూపు...

ఇలాగే ‘ముద్గ మాష కుల్మాష సూపం’ అని మరొక సూపుని పేర్కొన్నాడు క్షేమశర్మ...

‘అర్థ వికసితం స్విన్నాః కుల్మాషా ముద్గమాషజా! సైంధవేన స బాహ్లీకాః స్వాన్నస్యా తు గుణావహాః’... ఈ సూపు తయారు చేసుకోవటానికి క్షేమశర్మ, ‘అర్థవికసితం స్విన్నాః’... అంటే సగం ఉడికిన ధాన్యం ఉపయోగిస్తారన్నాడు. ‘కుల్మాషా’ అంటే బార్లీ, సగ్గుబియ్యం లేదా బియ్యాన్ని సగం ఉడికించినది అని. పొట్టు తీసిన పెసరపప్పు, మినప్పప్పు, బార్లీ లేదా సగ్గుబియ్యం... వీటిని సమానంగా తీసుకుని పైపైన ఉడికించండి. గంజి వార్చేసి మెత్తగా గుజ్జులా చేయండి. సూపు చిక్కగా లేదా పలుచగా ఉండేలా చాలినన్ని నీళ్లు కలిపి, పరిమళ ద్రవ్యాలు, ఉప్పు చేర్చి, చక్కగా ఉడికించి వడగట్టుకుంటే కమ్మని సూపు తయారవుతుంది. ఇంతకన్నా ప్రొటీన్‌ రిచ్‌ ఆహారం ఏముంటుంది! స్కూలు నుంచి రాగానే పిల్లలకు ఇస్తే తక్షణం శక్తి కలుగుతుంది. పుష్టిదాయకం. చిక్కిపోయేవాళ్లకి, ఆర్చుకుపోయేవాళ్లకి, తిన్నది వంటపట్టని వారికి ఇది మంచి ఆహారం.

కేవలం మినప్పప్పుతో కూడా ఇలానే సూపు కాచుకోవచ్చు. ‘మాషసూపోథస్నిగ్ధోనిలాపః! ఉష్ణా సంతర్పణోబల్య! సుస్వాదూ రుచికారకః’... మినప్పప్పు సూపు శరీరానికి స్నిగ్ధత్వాన్నిస్తుంది. స్థూలత్వాన్ని కలిగిస్తుంది. పురుషత్వాన్ని పెంచుతుంది. వాత వ్యాధుల్లో చాలా మేలు చేస్తుంది. కీళ్లవాతం నడుము నొప్పి లాంటివి ఉన్నవారికి మినప సూపు మేలు చేస్తుంది. కొద్దిగా వేడినిస్తుంది. సమస్త పోషకాలూ ఇందులో ఉంటాయి. రుచికారకం. జీర్ణశక్తిని పెంచుతుంది.

-గంగరాజు అరుణాదేవి

Updated Date - Aug 31 , 2024 | 02:52 AM