Share News

Netra Kumanan : ఉప్పొంగే కెరటం

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:23 AM

చదువంటే ఇష్టం. నృత్యం అంటే ప్రాణం. సెయిలింగ్‌ కోసం అన్నిటినీ పక్కన పెట్టారు నేత్ర కుమనన్‌. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా సెయిలర్‌గా చరిత్రకెక్కారు. ఇప్పుడు ప్యారిస్‌లో పతకాల పంట పండించడానికి సిద్ధమయ్యారు.

Netra Kumanan : ఉప్పొంగే కెరటం

చదువంటే ఇష్టం. నృత్యం అంటే ప్రాణం. సెయిలింగ్‌ కోసం అన్నిటినీ పక్కన పెట్టారు నేత్ర కుమనన్‌. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా సెయిలర్‌గా చరిత్రకెక్కారు. ఇప్పుడు ప్యారిస్‌లో పతకాల పంట పండించడానికి సిద్ధమయ్యారు.

‘‘ఎన్నో క్రీడలతో, కళలతో నాకు పరిచయం ఉంది. కొన్నిటిలో ప్రావీణ్యం కూడా ఉంది. కానీ అవేవీ సెయిలింగ్‌ స్థాయిలో సవాల్‌ విసరలేదు’’ అంటారు నేత్రా కుమనన్‌. తమిళనాడులోని చెన్నైకి చెందిన ఈ 26 ఏళ్ళ అమ్మాయి ప్యారి్‌స ఒలింపిక్స్‌లో... సెయిలింగ్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆమెకు రెండో ఒలింపిక్స్‌. 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపికై, సెయిలింగ్‌లో భారత్‌ తరఫున పోటీ పడిన తొలి మహిళగా నిలిచారు. ఈసారి కూడా ఆ విభాగంలో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళ ఆమే కావడం విశేషం.

అదే బాగా నచ్చింది...

‘‘మా నాన్న వి.సి.కుమరన్‌ పారిశ్రామికవేత్త. అమ్మ శ్రీజ హెచ్‌ఆర్‌ రంగ నిపుణురాలు. ఏటా వేసవి సెలవుల్లో నన్ను, నా తమ్ముడు నవీన్‌ను ఏదో ఒక సమ్మర్‌ క్యాంపులో చేర్చేవారు. పన్నెండేళ్ళకే అనేక అంశాల్లో నేను ప్రావీణ్యం సాధించాను. 2009లో ‘తమిళనాడు సెయిలింగ్‌ అసోసియేషన్‌’ ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంప్‌లో సెయిలింగ్‌ నాకు పరిచయమయింది’’ అంటున్న నేత్ర... రెండుసార్లు నేషనల్‌ ఛాంపియన్‌గా, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచారు. ‘‘అప్పటి నుంచే సెయిలింగ్‌ను ఒక కెరీర్‌గా తీసుకున్నాను. దాని కోసం ఎన్నో వదులుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచీ నేను మెరిట్‌ స్టూడెంట్‌ను. కానీ సెయిలింగ్‌వల్ల నా చదువుకు చాలాసార్లు బ్రేక్‌ పడింది. నా ఫ్రెండ్స్‌ కన్నా నాలుగేళ్ళు వెనుకబడ్డాను. ఈ మధ్యే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. అయితే.. ఒకటి సాధించాలంటే రెండోది వదులుకోవాలి. ఇక... భరతనాట్యం అంటే నాకు ప్రాణం. పద్మభూషణ్‌ అలర్మేల్‌ వల్లి దగ్గర ఆరేళ్ళకు పైగా శిక్షణ పొందాను. సింగపూర్‌, వియత్నాం, ఇండోనేషియాల్లో జరిగిన గ్లోబల్‌ ఆర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ కాంపిటిషన్స్‌లో బహుమతులు పొందాను. సెయిలింగ్‌ కోసం అది కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది’’ అంటారు నేత్ర.

అదే ప్రధానం

భారత్‌లో సెయిలింగ్‌ ను ఎంచుకొనే మహిళల సంఖ్య చాలా తక్కువ. ఈ కోణంలో చూసినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న నేత్ర ప్రత్యేకత ఏమిటనేది స్పష్టమవుతుంది. ‘‘ఒంటి చేత్తో, ఒక చిన్న డింగీ లాంటి బోటును నడిపే ‘లేజర్‌ రేడియల్‌’ కేటగిరీ’ సెయిలర్‌ని నేను. సముద్రం, గాలి, ఉష్ణోగ్రత, అలలు... ఇలా ప్రకృతిలోని ప్రతదాన్నీ అర్థం చేసుకోవాలి. ఇది మానసిక క్రీడ. ఏదీ మన నియంత్రణలో ఉండదు. మనం ప్రకృతితో పోటీ పడలేం. క్షణాల వ్యవధిలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే గెలుపు, ఓటములను పెద్దగా పట్టించుకోను. మనం ఎంత పోటీ ఇస్తున్నామనేదే ప్రధానం’’ అంటారు నేత్ర. 2021లో శిక్షణ ప్రారంభించిన ఆమె... 2014 నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్నారు. 2014, 2018 ఆసియా క్రీడల్లో వరుసగా ఏడు, అయిదు స్థానాల్లో నిలిచారు. 2015 క్లాస్‌ ఛాంపియన్‌షిప్‌లో, 2021, 2022 ఏషియన్‌ ఛాంపియన్‌షి్‌పలలో రెండు స్వర్ణాలను, ఒక రజతాన్ని గెలిచారు. 2021లో అమెరికాలోని మియామీలో జరిగిన ‘హెంపెల్‌ సెయిలింగ్‌ వరల్డ్‌ కప్‌ సిరీ్‌స’లో కాంస్య పతకం గెలిచి, ఆ ఘనత సాధించిన మొదటి భారతీయురాలిగా నిలిచారు. 2022 ‘యూరోపా కప్‌’లో కాంస్యం సాధించారు.

అప్పుడు ఒత్తిడికి గురయ్యా...

సెయిలింగ్‌ అభ్యాసం ప్రారంభించిన రెండేళ్ళలోనే ఆమె పతకాలు గెలవడం మొదలెట్టారు. 2015, 2016ల్లో వరుసగా నేషనల్‌ టైటిల్స్‌ అందుకున్నారు. ఆ తరువాత మెరుగైన శిక్షణ కోసం ఇజ్రాయిల్‌, ఇటలీ తదితర దేశాలకు వెళ్ళారు. 2017లో ‘యాచ్టింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఆమెను ‘వరల్డ్‌ సెయిలింగ్‌ ఎమర్జింగ్‌ నేషన్స్‌ ప్రోగ్రామ్‌’కు ఎంపిక చేసింది. ‘‘వివిధ దేశాల్లో పెద్దగా ప్రాచుర్యం లేని క్రీడల్లో యువతను, ప్రత్యేకించి మహిళలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది’’ అని చెబుతారామె. 2020లో ‘హెంపెల్‌ వరల్డ్‌ కప్‌ సిరీ్‌స’లో కాంస్య పతకం సాధించాక... స్పెయిన్‌లోని ‘గ్రాన్‌ కనారియా సెయిలింగ్‌ అకాడమీ’లో చేరి... తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. ‘‘ఆమెను చూస్తే ఉప్పొంగే కెరటంలా అనిపిస్తుంది. ఎంత కష్టమైనా లక్ష్యాన్ని సాధించాలనే తపన ఆమెలో కనిపిస్తుంది’’ అంటూ కోచ్‌ల ప్రశంసలు అందుకున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 35వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘‘తీవ్రమైన ఒత్తిడికి గురి కావడమే దానికి కారణం. కానీ మన దగ్గర పెద్దగా ప్రాచుర్యం లేని ఈ క్రీడ మీద దేశం దృష్టిపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది.. ఈసారి మరింత మెరుగ్గా రాణించడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అని చెప్పారు నేత్ర. ఇప్పుడు ఆమెకు మరో అవకాశం రానే వచ్చింది. ఏప్రిల్‌లో జరిగిన క్వాలిఫయర్‌లో సత్తా చాటి... ‘వరల్డ్‌ సెయిలింగ్‌ ఎమర్జింగ్‌ నేషన్స్‌ ప్రోగ్రామ్‌’ కోటాలో ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. ‘‘ఇప్పుడు మరింత సన్నద్ధంగా ఉన్నాను. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనేది నా ఆశయం’’ అంటున్నారు నేత్ర.

స్కేటింగ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, సైక్లింగ్‌, బాస్కెట్‌బాల్‌ లాంటి క్రీడలే కాదు, భరతనాట్యం, పెయింటింగ్‌ లాంటి కళలు, కరాటే, కలరిపయట్టు లాంటి యుద్ధ క్రీడల్లోనూ నేత్రకు ప్రావీణ్యం ఉంది.

Updated Date - Jul 25 , 2024 | 05:23 AM