చల్లనివన్నీ హిమక్రీములు కావు..!
ABN , Publish Date - Oct 05 , 2024 | 01:28 AM
కాలం ఏదైనా.. వయస్సు ఎంతైనా అందరూ ఆనందంగా తినేది ఐస్‌క్రీమ్. అయితే మనం ప్రతి రోజూ తినే ఐస్‌క్రీమ్ నిజంగా పాలతో తయారు చేసినదేనా? ఒక వేళ చేయకపోతే... అసలైన ఐస్‌క్రీమ్‌ను ఎలా కనుగొనాలి?
మన దేశంలో తొలి ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీని 1900 సంవత్సరం ముంబయిలో స్థాపించారు.
కాలం ఏదైనా.. వయస్సు ఎంతైనా అందరూ ఆనందంగా తినేది ఐస్‌క్రీమ్. అయితే మనం ప్రతి రోజూ తినే ఐస్‌క్రీమ్ నిజంగా పాలతో తయారు చేసినదేనా? ఒక వేళ చేయకపోతే... అసలైన ఐస్‌క్రీమ్‌ను ఎలా కనుగొనాలి? అసలైన ఐస్‌క్రీమ్‌లో ఉపయోగించే పదార్థాలేమిటి? గాడిద, ఒంటెలాంటి జంతువుల పాలతో ఐస్‌క్రీమ్‌లు తయారుచేయవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవటానికి ఆహార నిపుణుడు, ఐస్‌బెర్గ్ కంపెనీ ఎండీ సుహాస్. బి శెట్టిని ‘నవ్య’ పలకరించింది.
మనం ఐస్‌క్రీమ్ అనుకొని తినేది నిజంగా పాలతో చేసిన ఐస్‌క్రీమేనా?
మన దేశంలో ఎక్కువ కంపెనీలు అమ్మేది నిజమైన ఐస్‌క్రీమ్ కాదు. ఫుడ్ స్టాండర్ట్స్ ప్రకారం- ఐస్‌క్రీమ్‌ను పాలు, క్రీమ్, పంచదారలతో తయారుచేయాలి. వాటిలో ఎటువంటి వెజిటిబుల్ ఆయిల్స్, వెజిటిబుల్ ఫ్యాట్స్ కలపకూడదు. అయితే పాల కన్నా వెజిటిబుల్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఖరీదు తక్కువ కాబట్టి- ఎక్కువ కంపెనీలు వీటితోనే ఐస్‌క్రీమ్ తయారు చేస్తాయి. అందుకే వీటిని ఐస్‌క్రీమ్ అని కాకుండా ఫ్రోజన్ డిజర్ట్స్ అని పిలుస్తారు. నిజంగా పాలతో తయారు చేసే ఐస్‌క్రీమ్‌తో పోలిస్తే... వీటి ఖరీదు తక్కువ ఉంటుంది.
ఫ్రోజన్ డిజర్ట్స్.. నిజమైన ఐస్‌క్రీమ్‌లలో ఏఏ పదార్థాలు వాడతారు?
ఫ్రోజన్ డిజర్ట్స్‌లో పామాయిల్ లేదా కొబ్బరి నూనె వాడతారు. ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి కృత్రిమ రంగులు, కొన్ని రసాయన పదార్థాలు వాడతారు. ఇవన్నీ ఐస్‌క్రీమ్ ప్యాకెట్స్‌పై ముద్రించి ఉంటాయి. ఈ తరహా ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడవచ్చు. ఇక నిజమైన ఐస్‌క్రీమ్‌లో పాలు, క్రీమ్, పంచదార, పళ్ల ముక్కలు మాత్రమే వాడతారు. సహజసిద్ధమైన రంగులు కూడా వాడతారు.
ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌లు ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నాయి.. వాటిని వేటితో తయారు చేస్తారు...
సేంద్రీయ వ్యవసాయం ద్వారా పెంచిన ఆహారాన్ని తినే ఆవులు లేదా గేదెల పాలతో చేసిన ఐస్‌క్రీమ్‌ను ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ అంటారు. వీటిలో పంచదార బదులుగా కోకోనట్ సుగర్, పామ్ సుగర్, ఆర్గానిక్ బెల్లంతో తయారుచేస్తారు. దీనిలో వాడే రంగులు కూడా సహజమైనవే! ఉదాహరణకు దీనిలో వాడే పసుపు రంగు పసుపు నుంచి.. ఎర్ర రంగు బీట్‌రూట్ నుంచి తయారుచేస్తారు. దీని ఖరీదు మామూలు ఐస్‌క్రీమ్‌ల కన్నా ఎక్కువే ఉంటుంది.
ఐస్‌క్రీమ్‌లకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా?
ఉంటుంది. చాలా బ్రాండ్స్ తయారుచేసే ఐస్‌క్రీమ్‌లు 12 నెలల దాకా తినవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలు వాడితే తక్కువ షెల్ఫ్‌లైఫ్ ఉంటుంది. ఉదాహరణకు ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్స్‌లో మేము గర్ గమ్, గోంద్ గమ్ వంటివి వాడతాం. అందువల్ల వీటిని ఆరునెలలు మాత్రమే నిల్వ చేయగలం.
ఇంట్లో ఐస్ క్రీమ్ తయారుచేసుకోవచ్చా?
చిక్కని పాలు, క్రీమ్, పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ ఉంటే మనమే తయారుచేసుకోవచ్చు. కొందరు కార్న్‌స్ట్రాచ్ (మొక్కజొన్న పొడి) కూడా వాడతారు. దీని వల్ల ఐస్‌క్రీమ్ చిక్కబడుతుంది.
ఆవులు, గేదెలు కాకుండా ఇతర జంతువుల పాలతో కూడా ఐస్‌క్రీమ్ చేసుకోవచ్చా?
ఈ మధ్యకాలంలో- గాడిద, ఒంటె, మేక పాలతో చేసే ఐస్‌క్రీమ్‌లకు చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ జంతువుల పాలలో విటమిన్ ఏ, డీ, ఈ, సీ ఉంటాయి. ఐరన్ ఉంటుంది. మన దేశంలో ఈ జంతువుల పాలతో ఐస్‌క్రీమ్‌లను తొలిసారి మేమే తయారు చేశాం.
-సుహాస్. బి శెట్టి