Dental problem: ఇలా చేస్తే పంటి నొప్పి మాయం
ABN , Publish Date - Nov 21 , 2024 | 06:06 AM
చలికాలంలోనే పంటి సమస్యలు వేధిస్తుంటాయి. పంటి చిగుళ్లు, దవడ లోపలి భాగం వాపుకు గురై నొప్పిని కలిగిస్తాయి. దంత క్షయం, దంతాలు వదులు కావడం, ప్రమాదవశాత్తు దంతాలు విరగడం వల్ల కూడా పంటి నొప్పి వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతో ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం!

లవంగ నూనె: లవంగ నూనెలో యూజినాల్ అనే సహజ మత్తుపదార్థం ఉంటుంది. ఇది నొప్పి, వాపులను తగ్గించడంతోపాటు క్రిమినాశినిగా కూడా పనిచేస్తుంది. కొంచెం దూదిని తీసుకుని దాన్ని లవంగ నూనెలో ముంచి దానితో పంటినొప్పి ఉన్న ప్రాంతంలో అద్దాలి. అయిదు నిమిషాల తరవాత నోటిలో ఊరిన లాలాజలాన్ని ఉమ్మివేయాలి. ఇలా రెండుసార్లు చేసిన తరవాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి. వరసగా రెండు రోజులు ఇలా చేస్తూ ఉంటే పంటి నొప్పి క్రమంగా తగ్గుతుంది.
ఉప్పు నీళ్లు: నోటిలో పెరిగే హానికారక బ్యాక్టీరియాను ఉప్పు నీళ్లు నాశనం చేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో అర చెంచా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని నోటినిండా తీసుకుని నిమిషం అలాగే ఉండాలి. తరవాత ఉమ్మివేయాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే రెండు రోజుల్లో నొప్పి తగ్గుతుంది. చిగుళ్లు గట్టిపడతాయి.
వెల్లుల్లి: వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ దంతక్షయానికి కారణమైన క్రిములను నాశనం చేస్తుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా దంచాలి. ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న పంటి మీద ఉంచి అయిదు నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి. క్రమంగా పంటి నొప్పి తగ్గుతుంది.