Share News

Anant-Radhika Marriage: అనంత్‌- రాధికా‌ల పెళ్లికొచ్చిన ఈ సామన్యురాలు ఎవరో తెలుసా..!?

ABN , Publish Date - Jul 29 , 2024 | 08:54 AM

‘ఎవరీ సామాన్యురాలు..? అపర కుబేరులు, అతిరథమహారథులు, అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధ్యక్షులు హాజరైన ఈ వేడుకకు ఈమెను ఆహ్వానించారంటే.. ఏదో ప్రత్యేకత ఉండాలి?’ అనుకున్నారంతా!.

Anant-Radhika Marriage: అనంత్‌- రాధికా‌ల పెళ్లికొచ్చిన ఈ సామన్యురాలు ఎవరో తెలుసా..!?

‘ఎవరీ సామాన్యురాలు..? అపర కుబేరులు, అతిరథమహారథులు, అంతర్జాతీయ ప్రముఖులు, దేశాధ్యక్షులు హాజరైన ఈ వేడుకకు ఈమెను ఆహ్వానించారంటే.. ఏదో ప్రత్యేకత ఉండాలి?’ అనుకున్నారంతా!.


Shanteri-Nayak.jpg

ముంబయిలో ఇటీవల అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహవేడుకలో జరిగిన సంఘటన ఇది. ఆ సామాన్యురాలు ఎవరో కాదు.. ముంబయిలోని మతుంగలో ఉన్న మైసూర్‌కేఫ్‌ యజమానురాలు శాంతేరి నాయక్‌. అనంత్‌ అంబానీ తండ్రి ముకేష్‌ అంబానీ 1970లలో కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆ కేఫ్‌లో రకరకాల ఆహారపదార్థాలు తినేవారట. పాతకాలం ఉడిపి పలహారశాలగా పేరుగాంచిన ఆ చిన్న కేఫ్‌ అంటే అంబానీ కుటుంబానికి మహాప్రీతి. శుచీ శుభ్రతతో పాటూ రుచికరమైన పదార్థాలను వండిపెట్టేవారు శాంతేరి నాయక్‌.


Santheri-Family.jpg

పెళ్లికి హాజరైన ఆమెను రాధికా మర్చంట్‌కు పరిచయం చేస్తూ ‘‘ఇప్పటికీ మేము ప్రతి ఆదివారం వీరి భోజనాన్ని తింటుంటాము’’ అంటూ అనంత్‌ అంబానీ పేర్కొన్నాడు. అంబానీ కుటుంబం గుర్తుపెట్టుకుని మరీ శాంతేరి నాయక్‌ను పెళ్లికి ఆహ్వానించడం ఆమెపై వారి కుటుంబానికి ఉన్న గౌరవ మర్యాదలను సూచిస్తుంది.

‘‘పెళ్లికి వెళ్లిన మా అమ్మ కాళ్లకు ఆ నవ దంపతులు దణ్ణం పెట్టడం... ప్రేమ, గౌరవాన్ని చూపించడం... ఆ దృశ్యాన్ని చూశాక నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’’ అన్నాడు శాంతేరి నాయక్‌ కొడుకు నరేష్‌ నాయక్‌. దేశంలోనే అపర కుబేరులైన అంబానీ కుటుంబం తమ పిల్లలకు వినయ విధేయతలను నేర్పించడం, పెద్దల పట్ల గౌరవంగా మెలిగేలా తీర్చిదిద్దడం గొప్ప విషయం అంటూ పెళ్లికి వచ్చిన అతిథులు అభినందించారు. మొత్తానికి ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అతిరథ మహారథుల నడుమ... అంబానీల వివాహ వేడుకలో కనిపించిన సామాన్య మహిళ శాంతేరి నాయక్‌ ఒక్కరేనేమో!

Updated Date - Jul 29 , 2024 | 08:54 AM