Diagnostics : చలి కాలం ఊపిరితిత్తులు నిక్షేపం
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:21 AM
ప్రత్యేకించి శీతాకాలంలో అలర్జిక్ బ్రాంఖైటిస్, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్ ఎక్కువ. ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా విజృంభిస్తూ ఉంటాయి.
చలికాలంలో శ్వాసకోస సమస్యలు వేధించడం సహజం. అయితే ఈ సమస్యలు 20 ఏళ్లలోపు పిన్న వయస్కులు, 60ఏళ్లు పైబడిన పెద్దలు, వ్యాధినిరోధక వ్యవస్థ క్షీణించిన వాళ్లు, పిరితిత్తులు బలహీనపడిన వాళ్లలో ఎక్కువ. ఈ సమస్యలను ఎలాంటి పరీక్షలతో కనిపెట్టవచ్చో తెలుసుకుందాం!
ప్రత్యేకించి శీతాకాలంలో అలర్జిక్ బ్రాంఖైటిస్, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్ ఎక్కువ. ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి వీటి వల్ల ముందు నుంచి ఉన్న ఊపిరితిత్తుల సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి శ్వాసకోస సమస్యల ముప్పు ఎక్కువగా ఉండేవాళ్లు, అందుబాటులో ఉన్న టీకాలతో రక్షణ పెంచుకోవాలి. అయితే టీకాలను ఆరు నుంచి 8 వారాల ముందు తీసుకోగలిగినప్పుడే వ్యాధినిరోధకశక్తి చలికాలం సమీపించే నాటికి బలం పుంజుకుంటుంది. మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలున్నవాళ్లలో ముందు నుంచే వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లి ఉంటుంది. కాబట్టి ఈ కోవకు చెందిన వాళ్లు, రుగ్మతలను నియంత్రణలో పెట్టుకోవడం మీద దృష్టి పెట్టాలి. అలాగే విటమిన్ లోపాలు లేకుండా చూసుకోవాలి. ప్రత్యేకించి బి, బి12 విటమిన్ల లోపాలు వ్యాధినిరోధకశక్తి పరంగా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విటమిన్ లోపాలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి.
కొవిడ్ జాగ్రత్తలు కొనసాగించాలి
అవసరంలేని ప్రదేశాలకు వెళ్లకపోవడం మనం కొవిడ్ నుంచి నేర్చుకున్నాం. శ్వాసకోస సమస్యల ముప్పు పొంచి ఉన్నవాళ్లు చలికాలంలో ఇలాంటి కొవిడ్ నియమాలనే పాటించాలి. ముఖానికి మాస్క్ పెట్టుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఇంట్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిన వాళ్లను వాళ్ల గదికే పరిమితం చేయడం, బయటకు వెళ్లొచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం, స్నానం చేయడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవాలి, నిద్ర పోవాలి. సరిపడా నీళ్లు తాగడంతో పాటు జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం కూడా అవసరమే! ఇలాంటి జీవనశైలిని పాటించడం వల్ల అప్పటికే ఉన్న దీర్ఘకాలిక రుగ్మతలు అదుపులో ఉండి, వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల నిర్ధారణ ఇలా...
ఇన్ఫెక్షన్, అలర్జీల మోతాదులు, అవి సోకిన అవయవాల మీదే చికిత్సలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని కనిపెట్టడం కోసం సిబిపి, సిఆర్పి పరీక్షలు చేయవలసి ఉంటుంది. అలాగే విటమిన్ మోతాదులను కూడా పరీక్షించుకోవలసి ఉంటుంది. కొంతమందిలో అలర్జీలు ఉంటాయి. కాబట్టి వాళ్లకు ఈసినోఫిల్స్, ఇమ్యునోగ్లాబ్యులిన్ మోతాదులు పరీక్షించుకోవాలి. వీటితో పాటు అవసరాన్ని బట్టి ఎక్స్రేలు, సిటి స్కాన్ కూడా అవసరమవుతాయి. శ్వాసకోస సమస్యలకు అలర్జీ, ఇన్ఫెక్షన్ అనే రెండు కారణాలుంటాయి. వీటిలో కారణాన్ని బట్టి వైద్యులు తగిన చికిత్సను ఎంచుకుంటూ ఉంటారు. సిబిపి, సిఆర్పి, ఈసినోఫిల్స్, ఇమ్యునోగ్లాబ్యులిన్ పరీక్షల్లో అసలు కారణం తెలిసిపోతుంది. ఈ ఫలితాల ఆధారంగా యాంటీబయాటిక్స్ సూచించాలా లేదంటే అలర్జీ వ్యతిరేక మందులు సూచించాలా అన్నది వైద్యులు నిర్ణయిస్తారు. అలాగే ఊపిరితిత్తులకు బ్యాక్టీరియల్, వైరల్ అనే రెండు రకాల ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి. అదనంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా సోకుతూ ఉంటుంది. వీటిని నిర్థారించడం కోసం కఫ పరీక్ష చేయవలసి ఉంటుంది. ఇన్ఫెక్షన్ రకాన్ని నిర్థారించుకోవడం కోసం, దగ్గడం ద్వారా స్వతహాగా బయటకు తెప్పించిన కఫాన్ని పరీక్షించడం, ఊపిరితిత్తుల నుంచి నీటిని సేకరించి పరీక్షించడం, బ్రాంఖోస్కోపీ ద్వారా ఊపిరితిత్తుల్లోని స్రావాలను సేకరించి పరీక్షించడం ఇలా వేర్వేరు విధానాలను అనుసరిస్తారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా సమర్థమైన చికిత్సల సహాయంతో ఇన్ఫెక్షన్లను తగ్గించే మందులను వైద్యులు సూచిస్తారు.
- డాక్టర్ రాజేష్ వుక్కల
చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్,
రెనోవా హాస్పిటల్స్,
సనత్ నగర్, హైదరాబాద్