Share News

యోగి- సాధువు

ABN , Publish Date - Jul 26 , 2024 | 05:00 AM

పూర్వం ఒక యోగి అకుంఠితమైన తపస్సు చేసి, కొన్ని గొప్ప శక్తులను సంపాదించాడు. అతను స్వతహాగా మంచివాడు. కానీ తన శక్తులంటే అతనికి గర్వం ఉండేది. వాటిని ప్రదర్శించాలనే కొరిక ఉండేది. ఆ గర్వాన్ని తగ్గించాలని దేవుడు అనుకున్నాడు. ఒక రోజు...

యోగి- సాధువు

సద్బోధ

పూర్వం ఒక యోగి అకుంఠితమైన తపస్సు చేసి, కొన్ని గొప్ప శక్తులను సంపాదించాడు. అతను స్వతహాగా మంచివాడు. కానీ తన శక్తులంటే అతనికి గర్వం ఉండేది. వాటిని ప్రదర్శించాలనే కొరిక ఉండేది. ఆ గర్వాన్ని తగ్గించాలని దేవుడు అనుకున్నాడు. ఒక రోజు... సాధువు రూపంలో ఆ యోగి దగ్గరకు వచ్చాడు. ‘‘స్వామీ! మీకు అద్భుతమైన శక్తులు ఉన్నాయని విన్నాను. మిమ్మల్ని దర్శించుకోవాలని వచ్చాను’’ అని అన్నాడు. మాటలు విన్న యోగి ఉప్పొంగిపోయాడు. మునిని సాదరంగా ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చాడు.

ఈలోగా అటువైపు ఒక ఏనుగు వెళుతోంది. సాధువు దాన్ని చూపిస్తూ ‘‘స్వామీ! మీరు కోరుకుంటే ఆ ఏనుగును చంపగలరా?’’ అని అడిగాడు.

.‘‘ఎందుకు చంపలేనూ? ఇదిగో చూడండి’’ అంటూ నేల మీద పిడికెడు మట్టి తీసుకున్నాడు యోగి. దాన్ని మంత్రించి ఏనుగు మీదకు విసిరాడు. ఆ ఏనుగు నొప్పితో విలవిలలాడుతూ నేల మీద పడి మరణించింది.

‘చూశావా!’ అన్నట్టు గర్వంగా తలాడించాడు యోగి.


‘‘మీ శక్తులు అమోఘం స్వామీ! మీరు ఏనుగును చంపేశారు. మరి దాన్ని మళ్ళీ బతికించగలరా?’’ అని అడిగాడు సాధువు.

‘‘తప్పకుండా’’ అంటూ మరికాస్త మట్టి తీసుకొని, మంత్రించి, మరణించిన ఏనుగు మీద చల్లాడు యోగి. ఆ ఏనుగు లేచి నిలబడింది. శరీరానికి అంటుకున్న దుమ్మును విదిలించుకుంటూ అడవిలోకి నడిచింది.

‘‘స్వామీ! మీకు అపారమైన శక్తులు ఉన్నాయి. కానీ నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’’ అన్నాడు సాధువు.

‘‘దానికేం? అడగండి’’ అన్నాడు యోగి.

‘‘మీరు ఏనుగును చంపారు. దాన్ని మళ్ళీ బతికించారు. కానీ అందువల్ల మీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? ఆధ్యాత్మికమైన ఉన్నతి కలిగిందా? మోక్షాన్ని, భగవంతుణ్ణి చేరే మార్గం దొరికిందా?’’ అని ప్రశ్నించాడు సాధువు.


ఆ మాటలకు యోగి దిగ్ర్భాంతి చెందాడు. సాధువు రూపంలో ఉన్న దేవుడు చిరునవ్వు నవ్వుతూ మాయమైపోయాడు. ఇంతసేపూ తన ముందు ఉన్నది సాక్షాత్తూ భగవంతుడేనని యోగికి అర్థమయింది.

ఆ క్షణం నుంచి అతనిలో గర్వం, కోరికలు పూర్తిగా సమసిపోయాయి.

శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ ‘‘సూది బెజ్జానికి అడ్డుగా కంటికి కనిపించని చిన్న నలుసు ఉన్నా సరే... దానిలోంచీ దారం వెళ్ళడం కష్టమవుతుంది. అదే విధంగా సాధకుల్లో ఇసుకరేణువంత కోరిక, గర్వం మిగిలి ఉన్నా... పరమాత్మ తత్త్వాన్ని గ్రహించలేరు. మోక్షపథాన్ని అందుకోలేరు’’ అని స్పష్టం చేశారు.

Updated Date - Jul 26 , 2024 | 05:00 AM