Share News

అమెరికాలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

ABN , Publish Date - Sep 04 , 2024 | 09:01 PM

ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ నుంచి మంచి మెజారీటితో గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము.. తన గెలుపునకు సహకరించిన ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదములు తెలిపారు.

అమెరికాలో పర్యటించి ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

డాలస్, టెక్సస్: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ నుంచి మంచి మెజారీటితో గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన అట్లాంటాకు చెందిన ప్రవాసాంధ్రుడు వెనిగండ్ల రాము.. తన గెలుపునకు సహకరించిన ప్రవాసాంధ్ర మిత్రులకు ధన్యవాదములు తెలిపారు. ఈ మేరకు ఈ ఆదివారం ఆయన డాలస్ నగరంలో పర్యటించారు.


పర్యటనలో భాగంగా ముందుగా ఇర్వింగ్ పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించారు. బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. “ఎంతోకాలంగా ఈ మహత్మాగాంధీ మెమోరియల్ గురించి వింటున్నాను. కానీ ఇప్పటివరకు ఇక్కడికి రావడానికి వీలుపడలేదు’’ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ‘‘2014 లో స్థాపించిన ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ అమెరికాలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెంది.. 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ప్రాంతాలకు, పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా ప్రవాస భారతీయులందరూ ఐకమత్యంతో కలసి పనిచేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించగలరని ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ.

Untitled-11.jpg

ఇది ఒక రోజులో నిర్మాణం కాలేదు. ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఈ మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర దూరదృష్టి, అధికారులను ఒప్పించేందుకు జరిపిన దాదాపు 5 ఏళ్ల అవిరళ కృషితో ఇదంతా సాధ్యం అయింది. ఈ నిర్మాణంలో సహకరించిన బోర్డ్ సభ్యులు – రావు కల్వాల, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, ఎంవీఎల్ ప్రసాద్, బీఎన్ రావు మొదలైన కార్యవర్గ సభ్యులందరికీ నా అభినందనలు’’ అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.


భారతదేశం నుంచి వివిధ పార్టీలకు చెందిన ఎందరో రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ మహాత్మాగాంధీ మెమోరియల్‌ను సందర్శించి గాంధీజీకీ నివాళులు అర్పించడం సంతోషించదగ్గ విషయని హర్షం వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయులందరికీ ఇదొక ప్రధాన వేదిక కావడం ముదావహమని, ప్రపంచమంతా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత వాతావరణంలో మహాత్మాగాంధీ సిద్దాంతాలు, ఆశయాల గురించి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పరస్పర అవగాహన, గౌరవం, చర్చల ద్వారా ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్న శాంతి కాముకుడు గాంధీజీ ప్రపంచ మానవాళికి ఆదర్శమని ఎమ్మెల్యే రాము కొనియాడారు. ప్రవాస భారతీయులుగా అమెరికా స్థిరపడ్డ అందరూ మాతృదేశ అభివృద్ధికి వీలైంత వరకు తోడ్పడాలని కోరుతున్నానని రాము అన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 09:09 PM