Share News

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:21 PM

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్రయాత్ర..
PV Sindhu

పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో సింధు ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. ఈసారి బంగారు పతకంపై గురిపెట్టింది. మాల్దీవులపై మొదటి లీగ్ మ్యాచ్‌లో సునాయసంగా గెలిచిన సింధు.. తన రెండో మ్యాచ్‌లోనూ ఎస్తోనియాకు చెందిన కుబా క్రిస్టిన్‌పై ఈజీగా విజయం సాధించింది. 21-5, 21-10 తేడాతో వరుస రెండు సెట్లను పీవీ సింధు గెలుచుకుంది.


ఒలింపిక్స్‌లో ఇప్పటికే రెండు పతకాలు సాధించిన పీవీ సింధు మూడో పతకంపై గురిపెట్టింది. రౌండ్ 16లో విజయం సాధిస్తే నేరుగా క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుతుంది. వరుసగా మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే తప్పకుండా పతకం గెలిచే అవకాశాలున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప జోడి పూర్తి నిరాశను మిగిల్చింది. గ్రూప్‌-సిలో ఆడిన మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్‌లో పతకాలపై సింధు గురిపెట్టింది.


రాణిస్తున్న తెలుగు తేజాలు..

పారిస్ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు రాణిస్తున్నారు. ఓవైపు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు లీగ్ మ్యాచ్‌లలో వరుసగా రెండు గెలిచి.. నాకౌట్‌కు అర్హత సాధించింది. దీంతో రౌండ్ 16లో గెలిస్తే ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం ఒలింపిక్స్‌ నుంచి వెనుదిరగాల్సి వస్తుంది. మరోవైపు అమలాపురానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, మహారాష్ట్రకు చెందిన చిరాగ్ శెట్టి జోడి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో అదరగొడుతోంది. గ్రూప్-సిలో భాగంగా 3 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. జర్మనీకి చెందిన మార్విన్ సీడెల్ జోడి ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడంతో వరుసగా ఆడిన రెండు మ్యాచుల్లో సాత్విక్ జోడి విజయం సాధించింది. దీంతో సాత్విక్ జోడి క్వార్టర్ ఫైనల్స్‌‌కు చేరడం లాంఛనమే. ఆటగాళ్ల ప్రదర్శనతో సింధు, సాత్విక్ జోడి బ్యాడ్మింటన్‌లో పతకాలు గెలిచే అవకాశం ఉందని క్రీడారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 31 , 2024 | 02:36 PM