Share News

Sunil Chhetri : మెరుపు వీరుడి వీడ్కోలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 05:09 AM

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి (39) తన 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బైచుంగ్‌ భూటియాకు గాయం కావడంతో ఆడే అవకాశం దక్కించుకొన్న ఛెత్రి మళ్లీ వెనుదిరిగి

Sunil Chhetri  : మెరుపు వీరుడి వీడ్కోలు

ఆఖరాట ఆడేసిన ఛెత్రి

భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి (39) తన 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బైచుంగ్‌ భూటియాకు గాయం కావడంతో ఆడే అవకాశం దక్కించుకొన్న ఛెత్రి మళ్లీ వెనుదిరిగి చూడలేదు. ఆకట్టుకొనే విన్యాసాలు చేయకపోయినా.. మెరుపు వేగం, కచ్చితమైన ఫినిషింగ్‌తో గోల్స్‌ చేయడం ఛెత్రి స్టైల్‌. సుదీర్ఘ కెరీర్‌లో 151 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన క్రిస్టియానో రొనాల్డో (128), ఇరాన్‌ ప్లేయర్‌ అలీ దై (108), లియోనెల్‌ మెస్సీ (106) తర్వాత సునీల్‌ (94) నాలుగో స్థానంలో నిలిచాడు.

క్రీడాకారుల కుటుంబం నుంచి..

1984, ఆగస్టు 3న సికింద్రాబాద్‌లో క్రీడాకారుల కుటుంబంలో ఛెత్రి జన్మించాడు. ఆర్మీలో పని చేసిన సునీల్‌ తండ్రి కేబీ ఛెత్రి కూడా ఫుట్‌బాలర్‌ కాగా.. తల్లి సుశీల నేపాల్‌ మహిళల జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. సునీల్‌ బాల్యం మొత్తం డార్జిలింగ్‌లో గడిచింది. చిన్ననాటి నుంచి అనేక టోర్నీల్లో పాల్గొంటూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇంగ్లిష్‌, హిందీ, నేపాలీ, బెంగాలీ, కన్నడ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు, కొంకణీ, మరాఠీ భాషలను అర్థం చేసుకోగలడు. ప్రముఖ ఫుట్‌బాలర్‌ సుబ్రతో భట్టాచార్య కుమార్తె సోనమ్‌ను 2017లో వివాహం చేసుకొన్నాడు.

వేగంగా ఎదిగి..

2004లో భారత అండర్‌-20 జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఛెత్రి.. వేగంగా సీనియర్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2007, 2009, 2012లో భారత్‌ నెహ్రూ కప్‌ నెగ్గడంలో సునీల్‌ది కీలకపాత్ర. అంతేకాకుండా 2011, 2015, 2021, 2023ల్లో శాఫ్‌ చాంపిన్‌షి్‌ప్స అందుకొన్నాడు. 2008 ఏఎ్‌ఫసీ చాలెంజర్స్‌ కప్‌లో ఛెత్రి మ్యాజిక్‌తో నెగ్గిన భారత్‌.. 27 ఏళ్ల తర్వాత ఏఫ్‌సీ ఆసియాక్‌పనకు అర్హత సాధించింది. కానీ, ఫిఫా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించాలనుకొన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈస్ట్‌ బెంగాల్‌, మోహన్‌ బగాన్‌ తదితర క్లబ్‌లతోపాటు ఐఎ్‌సఎల్‌లో ముంబై సిటీ, బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. స్పెయిన్‌ మాజీ ఆటగాడు డేవిడ్‌ విల్లాతో కలసి ఆడాలనే కోరిక ఉందని ఒక సమయంలో సునీల్‌ తెలిపాడు. కాగా, ఇంగ్లండ్‌లోని క్లబ్‌ తరఫున ఆడే అవకాశం దక్కినా.. వర్క్‌ పర్మిట్‌ రాకపోవడంతో వెళ్లలేకపోయాడు. 2011లో అర్జున అవార్డుకు ఎంపికైన సునీల్‌ను 2019లో ప్రభుత్వం ‘పద్మ శ్రీ’తో సత్కరించింది. 2021లో ఖేల్‌రత్న అవార్డు దక్కించుకొన్నాడు.

chhh.jpg

భారత్‌, కువైట్‌ మ్యాచ్‌ డ్రా

కోల్‌కతా: విజయంతో కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రికి గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలనుకొన్న భారత జట్టుకు నిరాశే ఎదురైంది. ఫిఫా వరల్డ్‌కప్‌-2026 క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం గ్రూప్‌-ఎ రెండో రౌండ్‌లో భారత్‌-కువైట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది. దీంతో మూడో రౌండ్‌కు చేరుకోవడం టీమిండియాకు మరింత సంక్లిష్టంగా మారింది. ఈ డ్రాతో 5 పాయింట్లు సాధించిన భారత్‌.. ఈనెల 11న జరిగే చివరి మ్యాచ్‌లో ఖతార్‌తో తలపడనుంది. కాగా ఛెత్రి కువైట్‌తో మ్యాచే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ అని కొద్ది రోజుల ముందే ప్రకటించడంతో.. 68 వేల మంది కెపాసిటీ కలిగిన సాల్ట్‌ లేక్‌ స్టేడియం అభిమానులతో కిటకిటలాడిపోయింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సునీల్‌ అభివాదం చేస్తూ వెళ్తుంటే.. ఫ్యాన్స్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Updated Date - Jun 07 , 2024 | 05:20 AM