Share News

Paris Olympics : ఆరంభ వేడుకలు అభాసుపాలు!

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:11 AM

సంప్రదాయానికి భిన్నంగా..సెన్‌ నదిపై బోట్లమీద అథ్లెట్లు పరేడ్‌ చేయడం ద్వారా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. 205 దేశాల క్రీడాకారులతోపాటు, ప్రత్యక్షంగా తిలకించిన లక్షలాది మందికి,

Paris Olympics : ఆరంభ వేడుకలు అభాసుపాలు!
Paris Olympics

అభ్యంతరకర ప్రదర్శనలు

కొన్ని అపశ్రుతులు

పారిస్‌ క్రీడల ప్రారంభోత్సవంపై వివాదం

పారిస్‌: సంప్రదాయానికి భిన్నంగా..సెన్‌ నదిపై బోట్లమీద అథ్లెట్లు పరేడ్‌ చేయడం ద్వారా ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. 205 దేశాల క్రీడాకారులతోపాటు, ప్రత్యక్షంగా తిలకించిన లక్షలాది మందికి, విశవ్యాప్తంగా పరోక్షంగా వీక్షించిన కోట్లాదిమందికి ప్రారంభ కార్యక్రమం కొత్త అనుభూతి పంచింది. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వివాదం రేపాయి. అంతేకాకుండా..దక్షిణ కొరియా పేరును తప్పుగా పలకడం, ఒలింపిక్స్‌ జెండాను తలకిందులుగా ఎగరువేయడం వంటి వివాదాలూ చుట్టుముట్టాయి. సాంస్కృతిక కార్యక్రమాలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆక్షేపణలు వ్యక్తంజేస్తున్నారు. ఇవి క్రైస్తవులను కించపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తుతున్నారు. శిలువకు ముందు ఏసు క్రీస్తు తన శిష్యులతో కలిసి తీసుకున్న చివరి భోజనాన్ని ‘ద లాస్ట్‌ సప్పర్‌’ పేరిట లియోనార్డో డావిన్సి అద్భుతంగా చిత్రించాడు. అయితే ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘లాస్ట్‌ సప్పర్‌’ పేరిట నిర్వహించిన ప్రదర్శనలో క్రీస్తు స్థానంలో ఓ మహిళ శిరస్సుపై వెండి శిరస్త్రాణం ధరించింది. ఆమె చుట్టూ ట్రాన్స్‌జెండర్లు ఉండడం వివాదానికి కారణమైంది. అంతేకాదు.. క్రీస్తు ధరించే శిరస్త్రాణం ఆ మహిళ ధరించడాన్నీ ఆక్షేపించారు. అలాగే ఫ్రాన్స్‌ మాజీ రాణి మేరీ ఆంటోనెట్‌ శిరచ్ఛేదన ప్రదర్శనపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్రెంచ్‌ సింగర్‌ ఫిలిప్‌ కేటరిన్‌ ఇచ్చిన ప్రదర్శనపైనైతే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గ్రీకు వైన్‌ దేవత ‘డియనోసిస్‌’ పేరిట ఇచ్చిన ప్రదర్శనలో..అతడు వంటినిండా నీలిరంగు వేసుకొని, అక్కడక్కడా పండ్లు ధరించి ఓ పెద్ద పండ్ల పళ్లెంలో దాదాపు నగ్నంగా పడుకొని ఉండడం దుమారం రేపింది. ఇది గ్రీకు దేవతని అవమానించడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ కొందరు నెటిజన్లు కళాకారుల ప్రదర్శన వెనుక ఉద్దేశం మంచిదే అయినా..దానిని ప్రదర్శించిన విధానంలో లోపముందని అభిప్రాయపడ్డారు. మరోవైపు..మానవుల మధ్య జరిగే హింస ఎంత అసంబద్ధమైనదో హాస్యపూర్వకంగా ప్రదర్శించినట్టు నిర్వాహకులు వివరించారు.

kangana.jpg

వాళ్లు హైజాక్‌ చేశారు: కంగన

‘లాస్ట్‌ సప్పర్‌’ పేరిట నిర్వహించిన ప్రదర్శనను బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తప్పుబట్టారు. ‘నీలి రంగు వేసుకొని నగ్నంగా ఉన్న వ్యక్తి ఒకరు జీస్‌సగా చెప్పుకొని క్రైస్తవాన్ని పరిహసించాడు. ఒలింపిక్స్‌ను వామపక్షవాదులు పూర్తిగా హైజాక్‌ చేశారు. ఇది సిగ్గుచేటు’ అని లోక్‌సభ ఎంపీ కంగన ఎక్స్‌లో దుయ్యబట్టారు.

Updated Date - Jul 28 , 2024 | 06:11 AM