Share News

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై నేడే తీర్పు.. రాత్రి 9.30 కోసం భారతావని ఎదురుచూపు

ABN , Publish Date - Aug 10 , 2024 | 03:35 PM

కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌(Vinesh Phogat)‌ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది.

Vinesh Phogat: వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై నేడే తీర్పు.. రాత్రి 9.30 కోసం భారతావని ఎదురుచూపు

ఇంటర్నెట్ డెస్క్: కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌(Vinesh Phogat)‌ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించే స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం కోసం వినేష్ చేసిన అభ్యర్థనపై నిర్ణయాన్ని పారిస్ కాలమానం ప్రకారం శనివారం(ఆగస్టు 10)18:00 (భారత కాలమానంలో రాత్రి 9:30)న ప్రకటించనున్నారు.

ఆమె పిటిషన్‌పై తొలుత విచారణ జరిపి ఇవాళ తీర్పు వెల్లడించనుంది. శుక్రవారం వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 కు నిర్ణయాన్ని బయటపెడుతుంది. భారతావని బంగారు కలలను తాజా తీర్పైనా సాకారం చేస్తుందని దేశ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.


రంగంలోకి హరీష్ సాల్వే..

అయితే కోర్టులో వాదనలు వినిపించడానికి భారత ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే రంగంలోకి దిగి.. వాదనలు వినిపించారు. అంతర్జాతీయ స్థాయి కేసులనూ వాదించి సాధించిన ఘనత ఆయనకు ఉంది. వినేశ్ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంశం కావడం, దీనికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ కేసును వాదించారు.

కోర్టు వివరాలు..

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో జరిగే వివాదాలను పరిష్కరించడానికి 1984లో దీన్ని ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని పారిస్‌లో తాత్కాలికంగా ఈ అడ్‌హక్ కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడే వినేశ్ ఫొగట్ కేసు వాదనలు పూర్తయ్యాయి. అయితే కాంస్యానికి దూరమైన వినేశ్ కనీసం తనకు సిల్వర్ మెడల్‌ అయిన దక్కేలా ఆదేశాలివ్వాలంటూ అప్పీల్ చేశారు. సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, విదూష్‌ పత్ సింఘనియాతో కలిసి ఆమె కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్‌లో తన వాదనలు వినిపించారు.


ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాత్రికి తీర్పు వెలువరించనుంది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేశ్ ఫొగట్‌పై 100 గ్రాముల బరువు ఎక్కువుందనే కారణంతో నిబంధనలు అడ్డొస్తున్నాయని చెబుతూ అనర్హత వేటు వేశారు. ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సిన ఉండగా.. అనర్హత వేటుతో వినేశ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. కోర్టులోనైనా తనకు న్యాయం జరుగుతుందని ఆమెతోపాటు, యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది.

Updated Date - Aug 10 , 2024 | 03:38 PM