Share News

Paralympics : పసిడి పంట

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:30 AM

భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో పతకాల వరద పారిస్తున్నారు. గేమ్స్‌ రెండో రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్‌ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు

Paralympics : పసిడి పంట
Golds for Nitesh

సుహాస్‌, తులసి, యోగేశ్‌కు రజతాలు

మనీషాకు కాంస్యం

నితేశ్‌, సుమిత్‌కు స్వర్ణాలు

పారాలింపిక్స్‌లో పతకాల మోత మోగుతోంది. గత మూడు రోజుల్లో ఏడు మెడల్స్‌తో అదుర్స్‌ అనిపించిన దివ్యాంగ అథ్లెట్లు.. సోమవారం మరింత విజృంభించారు. ఈ ఒక్క రోజే మరో ఏడు పతకాలతో మురిపించారు. స్టార్‌ జావెలిన్‌త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌, షట్లర్‌ నితేశ్‌ స్వర్ణాలతో సత్తా చాటగా.. మరో షట్లర్‌ సుహాస్‌, డిస్కస్‌ త్రోయర్‌ యోగేశ్‌ వరుసగా రెండో పారాగేమ్స్‌లోనూ రజతాలతో ఆకట్టుకున్నారు. అలాగే మహిళా షట్లర్లు తులసిమతి రజతం, ఆర్చరీ జోడీ రాకేశ్‌-శీతల్‌, మనీషా కాంస్యాలతో సత్తా చాటారు.

పారిస్‌: భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో పారాలింపిక్స్‌లో పతకాల వరద పారిస్తున్నారు. గేమ్స్‌ రెండో రోజు నుంచే ఖాతా ఆరంభించిన భారత్‌ ఆ తర్వాత క్రమం తప్పకుండా పతకాల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోంది. తాజాగా సోమవారం దేశానికి మరో ఏడు పతకాలు లభించాయి. ఇందులో షట్లర్లవే నాలుగుండడం విశేషం. తాజాగా భారత్‌ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో 14 పతకాలను ఖాతాలో వేసుకుంది.

షట్లర్ల పతక జోరు: సోమవారం పోటీల్లో భారత షట్లర్లు పతకాల పండగ చేసుకున్నారు. ముందుగా పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 ఫైనల్లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ నితేశ్‌ కుమార్‌ 21-14, 18-21, 23-21తో డానియెల్‌ బెథెల్‌ (గ్రేట్‌ బ్రిటన్‌)పై గెలిచి స్వర్ణం సాధించాడు. బెథెల్‌పై ఆడిన పది మ్యాచ్‌ల్లో నితేశ్‌కిదే తొలి విజయం. తొలి రెండు గేమ్‌ల్లో ఇరువురు ఆధిక్యం చూపగా.. నిర్ణాయక గేమ్‌ ఓ దశలో 19-19తో ఉత్కంఠను పెంచింది. చివరకు 23-21తో నితేశ్‌ మ్యాచ్‌ను ముగించి సంబరాలు చేసుకున్నాడు. ఇక ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 ఫైనల్‌లో సుహాస్‌ యతిరాజ్‌ 9-21, 13-21తో లుకాస్‌ మజుర్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడాడు. దీంతో వరుసగా రెండోసారి రజతంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. టోక్యో గేమ్స్‌ ఫైనల్లోనూ వీరిద్దరే తలపడ్డారు. అలాగే మహిళల సింగిల్స్‌ ఎస్‌యూ5లో స్వర్ణంపై ఆశలు రేపిన తులసిమతి మురుగేశన్‌ ఫైనల్లో 17-21, 10-21తో యాంగ్‌ క్విక్సియా (చైనా) చేతిలో ఓడి రజతం సాధించింది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో మనీష రామదాస్‌ 21-12, 21-8తో క్యాథరిన్‌ (డెన్మార్క్‌)పై సులువుగా నెగ్గింది. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌హెచ్‌ 6 కాంస్య పోరులో శివరాజన్‌-నిత్యశ్రీ 17-21, 12-21తో సుభాన్‌-రీనా (ఇండోనేసియా) చేతిలో నిరాశే ఎదురైంది.


antil.jpg

నయా చరిత్ర

స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్‌ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఎఫ్‌64 విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన అతను వరుసగా రెండోసారి విజేతగా నిలిచాడు. అంతేకాకుండా.. టోక్యో గేమ్స్‌లో తాను నెలకొల్పిన రికార్డు (68. 55 మీ.)ను ఏకంగా రెండుసార్లు సవరించాడు. ఈసారి జావెలిన్‌ను 70.59 మీ. దూరం విసిరి పారా గేమ్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. వాస్తవానికి తన తొలి ప్రయత్నంలోనే 69.11 మీ. దూరంతో టోక్యో రికార్డును సవరించాడు. అలాగే భారత్‌కు చెందిన మరో భారత అథ్లెట్‌ సందీప్‌ చౌదరి 62.80 మీ. దూరంతో నాలుగో స్థానంలో నిలిచాడు.

Yogesh.jpg

యోగేశ్‌ భేష్‌

27 ఏళ్ల డిస్కస్‌ త్రోయర్‌ యోగేశ్‌ కతునియా కెరీర్‌లో రెండో రజతం సాధించాడు. పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌ 56 ఈవెంట్‌లో అతను డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. క్లాడినీ బటిస్టా (46.86 మీ.- బ్రెజిల్‌)కు స్వర్ణం, జౌనిస్‌ (41.32 మీ.-గ్రీ్‌స)కు కాంస్యం దక్కాయి. టోక్యో గేమ్స్‌లోనూ యోగేశ్‌ సిల్వర్‌ మెడల్‌తో రాణించాడు.

Updated Date - Sep 03 , 2024 | 05:30 AM