Share News

KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

ABN , Publish Date - May 09 , 2024 | 05:58 AM

‘హైదరాబాద్‌ను మేం పవర్‌ ఐలాండ్‌గా మార్చాం. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చేశాం. నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరు నుంచి పది గంటల పాటు విద్యుత్తు

KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ప్రతిష్ఠకు మసక.. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి

మేం నగరాన్ని పవర్‌ ఐలాండ్‌గా మార్చాం.. ఇప్పుడు రియల్‌ వ్యాపారం, ఐటీ రంగం కుదేలైంది

చదరపు అడుగుకు రూ.75 సీఎంకు కప్పం.. అందుకే 5 నెలలుగా హెచ్‌ఎండీఏ అనుమతులు బంద్‌

ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతా.. నేను అరెస్టులు, జైళ్లకు భయపడే రకం కాదు

మోదీ చెప్పిన అచ్చేదిన్‌ పోయి సచ్చే దినం వచ్చింది.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా దుండిగల్‌, నర్సాపూర్‌, పటాన్‌చెరులో రోడ్‌షోలు

హైదరాబాద్‌ సిటీ/దుండిగల్‌/నర్సాపూర్‌/పటాన్‌చెరు, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్‌ను మేం పవర్‌ ఐలాండ్‌గా మార్చాం. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా చేశాం. నిన్న కొద్దిపాటి వాన పడితే ఆరు నుంచి పది గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితి ఉంటే తెలంగాణ ప్రతిష్ఠ పోతుంది. పరిశ్రమలు వెళ్లిపోతాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్ల అంతర్జాతీయంగా హైదరాబాద్‌ ఇమేజ్‌ తగ్గుతోంది’ అని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆరోపించారు. మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా బుధవారం హైరాబాద్‌ శివారు దుండిగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు చౌరస్తా వద్ద, మెదక్‌ అభ్యర్థి వెంకట్రామ్‌ రెడ్డి గెలుపు కాంక్షిస్తూ మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, పటాన్‌చెరులలో నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన మాట్లాడారు. నాలుగైదు నెలల్లోనే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా తాగునీటి సరఫరా చేశామని, ఇప్పుడు నీటి సరఫరా ఎందుకు తగ్గిందని, నీటి ట్యాంకర్లు ఎందుకు తిరుగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఏనాడూ హైదరాబాద్‌, హెచ్‌ఎండీఏ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పడిపోయాయని, రియ ల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగిపోయిందని, ఐటీ రంగం కుదేలైందని ఆరోపించారు.

ఇందంతా సీఎం రేవంత్‌రెడ్డి చలవే అని అన్నారు. చదరపు గజానికి రూ.75 రూపాయలు సీఎంకు కప్పం కడితేనే హెచ్‌ఎండీఏ అనుమతులు జారీ చేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే ఐదునెలలుగా అనుమతులు నిలిపివేశారని ఆరోపించారు. నిర్మాణ రంగ సంస్థల నుంచి చదరపు అడుగుకు ఇంత అని ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేసి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి కప్పం కడుతున్నారని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తనను తిట్టుడు తప్ప మరో పని సీఎంకు చేతకావడం లేదని విమర్శించారు. తన చెడ్డీ సైతం గుంజుకుంటా అని అన్నారని, అది ఏం చేసుకుంటారో తనకు అర్థం కావడం లేదన్నారు. వరినాట్లు పడకముందే రైతు బంధు ఇవ్వాల్సి ఉండగా, కోతలయ్యాక కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. ఏ ఒక్కటీ అమలు చేయడంలేదని విమర్శిం చారు. తెలంగాణ కోసం పేగులు తెగే దాక కొట్లాడే పార్టీ బీఆర్‌ఎస్‌ అని, 12 మంది తమ అభ్యర్థులను గెలిపిస్తే పార్లమెంట్‌లో రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడుతారని, నిధులు తీసుకొస్తారని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతానని, జైళ్లు, కేసులు తనకు కొత్త కాదని, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఆగం చేస్తే సహించబోనని కేసీఆర్‌ అన్నారు.


విశ్వగురువు చేసిందేంటి?

విశ్వగురువు అని చెప్పుకునే ప్రధాని మోదీ అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ఠ దిగజార్చుతున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 84కు పడిపోయిందని, దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గాయని, దిగుమతులు పెరిగాయని, ఎగుమతులు తగ్గాయన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎమ్మె ల్సీ కవితను అరెస్ట్‌ చేస్తే అమెరికా నిరసన వ్యక్తం చేసిందని, ఇది దేశ ప్రతిష్ఠకు మంచిది కాదన్నారు. బీజేపీ వాళ్లు ఊదితే కొట్టుకుపోయే పాకిస్తాన్‌ పేరు చెప్పి రాజకీయ పబ్బ గడుపుకుంటున్నారని ఆరోపించారు. పదేళ్లలో 150 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. మోదీ చెప్పిన అచ్చేదిన్‌ ఏమో కాని మనం సచ్చేదినాలు వచ్చాయన్నారు. ఐటీఐఆర్‌ను మోదీ రద్దు చేశారని, 400 మెగావాట్ల సీలేరు విద్యుదుత్పత్తి ప్లాంట్‌ను ఆంధ్రకు అప్పగించారని, తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని, ఇంత అన్యాయం చేస్తున్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలో ఆలోచించాలని కేసీఆర్‌ కోరారు.

Updated Date - May 09 , 2024 | 05:58 AM