Share News

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు

ABN , Publish Date - Aug 05 , 2024 | 06:57 PM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుకి బిగ్ షాక్ తగిలింది. డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు
KCR

భూపాలపల్లి: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావుకి బిగ్ షాక్ తగిలింది. డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై రాజలింగంమూర్తి అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు. డిజైన్లు మార్చడం, నాణ్యత లోపాల కారణంగానే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందంటూ పిటిషన్‌లో రాజలింగం మూర్తి ఆరోపించారు.


కాగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ అంతర్‌ రాష్ట్ర వంతెన కుంగిన విషయం తెలిసిందే. బ్యారేజీ బీ-బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. రాత్రివేళ వంతెన కుంగిపోయిన విషయాన్ని మహరాష్ట్ర వెళ్లే ప్రయాణికులు గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే జరిగిందంటూ విపక్షాలు అప్పట్లో మండిపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం మారడం.. బ్యారేజీని పరిశీలించడం అన్ని జరిగాయి. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టును సందర్శించారు.

Updated Date - Aug 05 , 2024 | 07:21 PM