former CM KCR : తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటరు!
ABN , Publish Date - May 04 , 2024 | 05:35 AM
రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని... పనిచేసేవారెవరైనా దేవుళ్ల మీద ఒట్లు పెడతారా? అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కరెంటు కోతలు లేవని..
రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై
రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏమిటి?
పనిచేసేటోళ్లు ఎవరైనా ఒట్లు పెడతారా?
1,32,000 మందికి మేం దళితబంధు
నిధులు జమచేస్తే ఈ సర్కారు లాక్కుంది
సింగరేణి సంస్థను ఊడగొడతారు జాగ్రత్త
నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో వణుకు
అందుకే కుమ్మక్కై నిలువరించేందుకు కుట్ర
కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే: కేసీఆర్
గోదావరిఖనిలో బీఆర్‌ఎస్ అధినేత రోడ్ షో
పెద్దపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని... పనిచేసేవారెవరైనా దేవుళ్ల మీద ఒట్లు పెడతారా? అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తొండి చేసేటోళ్లే ఒట్లు పెట్టుకుంటారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కరెంటు కోతలు లేవని.. తాము గోదావరిని సజీవధారగా మార్చామని, ఇప్పుడేమో పక్కనే గోదావరిఖనిలో మంచినీళ్లు రెండ్రోజులకోసారి ఇస్తున్నారని.. అవీ మురికినీళ్లేనని విమర్శించారు. ‘‘ఐదు నెలల క్రితం రాష్ట్రం ఎట్లుండె? ఇప్పుడెట్లుంది? దీనికి కారణం ఎవరు? ఎవరి చేతగానితనం?’’ అని ప్రశ్నించారు. అదానీకి మోదీ ఓడ రేవులు, ఎయిర్ పోర్టులను అప్పగిస్తే.. ఆ అదానీతో రేవంత్ తెలంగాణకు రండి అంతా దోచుకుపోండి అంటూ దావో్‌సలో ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక తాము సింగరేణిని బాగుచేసి.. 19 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించామని.. ఇప్పుడా సింగరేణిని ఊడగొడ్తారేమో జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు.
ఒకప్పుడు సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని... దీనిపై సీపీఐ, సీపీఎం నాయకులు ధైర్యం ఉంటే స్పందించాలన్నారు. తాను చేపట్టిన బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీ నాయకుల గుండెలు వణుకుతున్నాయని.. ఆ పార్టీల నేతలు కుమ్మక్కై తనను నిలువరించాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. బస్సుయాత్రలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. తన ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం అనంతరం రాత్రి 9 గంటలకు చౌరస్తాకు చేరుకుని ప్రసంగించారు. తన ప్రచారంపై విధించిన నిషేధాన్ని గుర్తుచేస్తూ.. ‘‘ఏం చేశానని నా గొంతు నొక్కారు?’’ అని ప్రశ్నించారు. మోదీ... రాజకీయాల్లో మతం గురించి మాట్లాడితే తప్పులేదా? నెత్తిన దేవుడి బొమ్మలు పెట్టుకుని ముస్లింలు, హిందువులు అని ఆయన మాట్లాడినా ఈసీకి కనబడదా? అని ప్రశ్నించారు. గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటా.. పండబెట్టి తొక్కుతా అని నన్ను సీఎం అంటే పట్టించుకోరా? అని నిలదీశారు. మోదీతో రేవంత్ ఆప్ హమారా బడే భాయ్ అంటూ గుజరాత్ మోడల్ పెట్టుకుంటానని అన్నారని.. ఆ గుజరాత్‌లో మన్ను కూడా లేదని.. అంతా దరిద్రం, పెట్టుబడిదారుల రాజ్యమేనని పేర్కొన్నారు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతానని, ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు కడతానని, తమిళనాడు, కర్ణాటకకు గోదావరి నీళ్లిస్తానని మోదీ మాట్లాడుతున్నారని, దీనిపై రేవంత్ మాట్లాడటం లేదని, ఆయన మౌనం వెనుక మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో దళితబంధు కింద 1,32.000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తే ఈ ప్రభుత్వం లాక్కుందని ఆరోపిస్తూ.. ఆ లబ్ధిదారులు ఏం పాపం చేశారు? అని ప్రశ్నించారు. ఉచిత బస్సు పథకం పెడితే పెట్టారేమో గానీ.. దాని వల్ల బతుకుదెరువు దెబ్బతిన్న ఆటోవాలాలను ప్రభుత్వం ఆదుకోలేదని, ఫలితంగా వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వంపై బరిగీసి కొట్లాడాలని ప్రజలకు పిలుపునిస్తూ ఇందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, వనరులు కాపాడుకోవాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి
రాంనగర్, మే 3: నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డికి అవకాశం దక్కింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానం కోసం వరంగల్ నుంచి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, మాజీ కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌లు కూడా పోటీ పడ్డారు. అయితే వారిని కాదని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిన రాకేశ్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన రాకేశ్‌రెడ్డి.. బిట్స్ పిలానీలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఉద్యోగం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో 2013లో బీజేపీలో చేరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం బీజేపీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు.