Share News

HYD : అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

ABN , Publish Date - Sep 04 , 2024 | 05:05 AM

హైడ్రా ఆదేశాల మేరకు.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జిల్లా యంత్రాంగం మంగళవారం కూల్చివేసింది.

HYD : అమీన్‌పూర్‌లో కూల్చివేతలు

  • హైడ్రా ఆదేశాలతో రంగంలోకి అధికారులు

  • సర్కారీ భూముల్లో నిర్మాణాల తొలగింపు

  • అడ్డుకునేందుకు మునిసిపల్‌ చైర్మన్‌ యత్నం

  • పోలీసుల జోక్యంతో వెనక్కి తగ్గిన వైనం!

  • ఐలాపూర్‌ తండాలో హద్దురాళ్ల తొలగింపు

  • ఫ్యూజన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ గేటుతోపాటు సెక్యూరిటీ గది, ప్రహరీని కూల్చిన అధికారులు

  • అడ్డుకునేందుకు మునిసిపల్‌ చైర్మన్‌ యత్నం.. అధికారులతో వాగ్వాదం.. పరిస్థితి ఉద్రిక్తం

  • ఐలాపూర్‌ తండాలో హద్దురాళ్ల తొలగింపు

  • హిమాయత్‌ సాగర్‌ పరివాహక ప్రాంతంలో హైడ్రా అధికారుల బృందం రహస్య పర్యటన

పటాన్‌చెరు, మొయినాబాద్‌/శంషాబాద్‌, ఎల్బీనగర్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): హైడ్రా ఆదేశాల మేరకు.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను జిల్లా యంత్రాంగం మంగళవారం కూల్చివేసింది. అయితే, ఇటీవలే బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి కాంగ్రె్‌సలో చేరిన మునిసిపల్‌ చైర్మన్‌.. ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో కూల్చివేతలు కొనసాగాయి. అమీన్‌పూర్‌ పరిధిలోని పలు ఆక్రమణలను ఇప్పటికే హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మూడుసార్లు స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. హైడ్రాకు అందిన ఫిర్యాదులు, నివేదికల మేరకు ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించాలని తహసీల్దార్‌కు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అధికారులు ఐలాపూర్‌ తండాకు చేరుకున్నారు.

ప్రభుత్వ భూమిలో వేసిన లే-అవుట్‌ హద్దురాళ్లను తొలగించారు. అక్కడ నిర్మించిన గదిని నేలమట్టం చేశారు. అది ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేశారు. తర్వాత అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధి బందంకొమ్ము రోడ్డులో ఉన్న సర్వే నంబర్‌ 462లో ఆక్రమణలను తొలగించారు. ఫ్యూజన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సెక్యూరిటీ గదితో పాటు గేట్‌ను, ప్రహరీని తొలగించారు. సర్వే బృందాల సూచలన మేరకు మార్కింగ్‌ చేసి, హద్దులను ఏర్పాటు చేశారు. కాగా.. సర్వే నంబర్‌ 462లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లను తొలగించేటప్పుడు.. మునిసిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తాను కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ.. తనకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా అందులోని కట్టడాలను కూల్చివేయడం తగదని, కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని వాగ్వాదానికి దిగారు. కూల్చివేతలు జరగకుండా ఓ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. ఆయనకు మద్దతుగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వాహనాల్లో అక్కడికి తరలివచ్చారు. మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ నందారం నర్సింహగౌడ్‌, కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు. రాజకీయ కక్షతోనే కూల్చివేతలు చేపడుతున్నారని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కానీ, పోలీసులు వారిని చెదరగొట్టి కూల్చివేతలు కొనసాగేలా చూశారు. దీంతో అక్కడున్న దుకాణాల వారు తమ సామగ్రిని తరలించారు.


  • హిమాయత్‌సాగర్‌ పరిధిలో..

వారం రోజులుగా హిమాయత్‌సాగర్‌ పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు.. మంగళవారం మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌, నాగిరెడ్డి గూడ రెవెన్యూ పరిధిలో రహస్యంగా పర్యటించినట్టు తెలుస్తోంది. కాగా.. ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో ఆక్రమణలు, కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని టీపీసీసీ క్యాంపెయినింగ్‌ కమిటీ చైర్మన్‌, మాజీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను కోరారు. చెరువుల ఆక్రమణలపై ఆయన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

  • చంపాపేటలో చెరువుల పరిశీలన

చంపాపేట, సెప్టెంబర్‌ 3(ఆంధ్రజ్యోతి): హైడ్రా అధికారులు మంగళవారం.. చంపాపేట డివిజన్‌ బైరామల్‌గూడలోని మద్దెలకుంట చెరువు, హస్తినాపురం డివిజన్‌ భూపే్‌షగుప్తానగర్‌ కాలనీ సమీపంలోని చేపలచెరువు(నూర్జాన్‌కుంట)ను పరిశీలించారు. మద్దెలకుంట చెరువును ఆనుకొని ఉన్న పార్కింగ్‌ స్థలం, గోదాములు, రింగ్‌రోడ్‌లోని వాణిజ్య సముదాయాలతో పాటు పలు గృహాలను.. చేపలచెరువులో నిర్మించిన ఇండ్లతోపాటు ఖాళీ స్థలాలనూ పరిశీలించారు. ఆక్రమణలకు గురైన చెరువు స్థలాలపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి ఆక్రమణలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

Updated Date - Sep 04 , 2024 | 05:05 AM