Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
ABN , Publish Date - Oct 09 , 2024 | 02:05 PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో అనేక చోట్ల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఈ రేవంత్ సర్కార్ ఈసీ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిందని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం మధ్య తరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడారన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 09: తెలంగాణలో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. ఆ క్రమంలో ఏర్పాటు చేసిన ‘హైడ్రా’.. ఆయా నిర్మాణాలను కూల్చివేస్తుంది. దీంతో రేవంత్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ అంశంపై స్పందించారు. ఈ అక్రమణలను తొలగించకుంటే.. రానున్న రోజుల్లో ప్రజలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మూసి నది ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారు. మల్లు భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలపై కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు వెంకట రమణారెడ్డి బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల కోట్ల విలువ చేసే అనేక స్థలాలు కబ్జాలకు గురయ్యాయని ఆయన ఆరోపించారు. వీటిలో కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు విదేశీయులకు ఈ ప్రభుత్వం అనుమతులు సైతం ఇచ్చిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో అనేక చోట్ల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటికి ఈ రేవంత్ సర్కార్ ఈసీ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఇదంతా చేస్తుందని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేవలం మధ్య తరగతి ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడారన్నారు.
ఇక భూములు ఆక్రమించిన బడా బాబులతోపాటు 30 కంపెనీల వివరాలు త్వరలో తాను బయట పెడతానని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో వేలాది మంది ఇళ్ళు నిర్మించుకొనేందుకు వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఇవన్నీ అవాస్తవమని మీరు నిరూపిస్తే నేను సూసైడ్ చేసుకొని చనిపోతానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి.. రేవంత్ సర్కార్‌కు సవాల్ విసిరారు.
ఇక రాష్ట్రంలోని మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ జీతాలను నష్టపోయిన హైడ్రా బాధితులకు ఇద్దామని సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి ఎమ్మెల్యే సూచించారు. తన పది నెలల ఎమ్మెల్యే జీతం రూ. 20 లక్షలు ఇవ్వడానికి నేను సిద్దంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అందుకు మిగతా వారంతా రెడీగా ఉన్నారా? సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు.
For Telangana News And Telugu News...