Share News

ABN Special: చచ్చుబడిన కాళ్లతో సమాజంతో పోరాడుతూ... ఓ అనాథ బాలిక కన్నీటి గాథ ఇది

ABN , Publish Date - Oct 26 , 2024 | 02:53 PM

ఈమె పేరు సున్నపు భవానీ. సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహీర్(Kohir) మండలం గురుజువాడ(Gurujuwada) అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయింది.

ABN Special: చచ్చుబడిన కాళ్లతో సమాజంతో పోరాడుతూ... ఓ అనాథ బాలిక కన్నీటి గాథ ఇది

విధి ఆడిన వింత నాటకంలో ఆ బాలిక అనాథగా మిగిలింది. తోడుగా ఉండాల్సిన అమ్మ, నాన్న ఆమెను ఈ లోకంలో ఒంటరి దాన్ని చేసి వెళ్లి పోయారు. ఇది చాలదన్నట్లు తీవ్ర అనారోగ్య సమస్యతో పోరాడుతోంది. సమాజంతో కూడా ఒంటరిగా పోరాటం కొనసాగిస్తోంది. ఇక తన వల్ల కాదని.. తిరిగి తిరిగి అలసిన మనస్సుతో 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి'కి చేరుకుంది.

Hyderabad: చిత్రంలో చూస్తున్న బాలిక గురించే ఇదంతా. ఈమె పేరు సున్నపు భవానీ. సంగారెడ్డి(Sangareddy) జిల్లా కోహీర్(Kohir) మండలం గురుజువాడ(Gurujuwada) అనే మారుమూల గ్రామంలో నివసిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయింది.

ప్రస్తుతం నాన్నమ్మే ఆమె బాగోగులు చూసుకుంటోంది. ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసింది. అయితే చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని ఆమెకు దూరం చేసిన విధి.. మరోసారి ఆమెపై చిన్నచూపు చూసింది. 2023లో పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడింది. దీంతో కాలు, చేయి చచ్చుబడిపోయాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఇంట్లోనే కుప్పకూలిన ఆమెను స్థానికులు గమనించి జహీరాబాద్(Zaheerabad) ప్రైవేటు ఆసుపత్రికి అటు నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ప్రాణాలు దక్కడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల బృందం అంత చిన్న వయస్సులో ఇలాంటి సమస్య రావడం చూసి షాక్‌కి గురయ్యారు. ఒకానొక సమయంలో బాలిక ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమని ఆమె నాన్నమ్మకు తేల్చి చెప్పారు. చివరకు అతి కష్టం మీద ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమె నాన్నమ్మ బాలికకు సపర్యలు చేయలేక నానా అవస్థలు ఎదుర్కుంటోంది. home.jpgఈ చిత్రంలో కనిపిస్తున్నది వారిద్దరు నివసిస్తున్న ఇల్లు..

నిమ్స్‌లో వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి డబ్బులు మంజూరయ్యారు. వాటితోనే డాక్టర్ చికిత్స పూర్తయ్యేది. కానీ, పూట కూడా గడవని ఆ కుటుంబంలో.. భవానికి ట్యాబ్లెట్లు తేవాలంటే రూ.వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గురుజువాడలో తెలిసిన వారి దగ్గర ఆమె నాన్నమ్మ అప్పు చేసి ట్యాబ్లెట్లు తీసుకువచ్చేది. అలా.. నిమ్స్‌లోనే దాదాపు నెలకుపైగా చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయింది.


డబ్బులు లేక చికిత్సకు వెళ్లలేక..

రెండు నెలలపాటు ట్యాబ్లెట్లు వాడిన తరువాత చికిత్స నిమిత్తం నిమ్స్‌కు రావాలని వైద్యులు చెప్పారు. ఆమె నాన్నమ్మకు మళ్లీ అప్పు పుట్టకపోవడంతో భవాని.. 3 నెలలపాటు చికిత్సకు దూరమైంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. తన మనుమరాలి జబ్బును తగ్గించాలని ఆమె శాయశక్తులా కృషి చేసింది. రేపో మాపో తాను వెళ్లిపోతే.. భవానికి దిక్కెవరని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆంధ్రజ్యోతి ముందు గోడు వెల్లబోసుకుంది. అటు జబ్బు పూర్తిగా తగ్గలేక ఇంటికే పరిమితమైన మనుమరాలు ఓ వైపు, ఆర్థిక సమస్యలు మరోవైపు పెద్ద దిక్కులేని ఆ కుటుంబానికి తీరని భారంగా మారాయి.


'సదరం' కోసం ముప్పు తిప్పలు..

పక్షవాతానికి గురైన తన మనుమరాలికి భరోసా ఉండాలనే ఉద్దేశంతో దివ్యాంగులకు ఇచ్చే సదరం సర్టిఫికేట్ కోసం ఆమె నాన్నమ్మ ప్రయత్నాలు ప్రారంభించారు. గత 6 నెలలుగా స్లాట్ బుకింగ్ కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లినా రేపు, మాపు అంటూ అక్కడి సిబ్బంది తిప్పి పంపిస్తున్నారు. మండల కేంద్రానికి రానుపోను ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. మనుమరాలి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు.. నాన్నమ్మ ఎండలో పనికి వెళ్లడం ప్రారంభించింది. అలా రోజూ రూ.150 వస్తోంది. పని చేయగా వచ్చిన డబ్బు తమ ప్రయాణానికి సరిపోతుందని భావించి, ప్రతి నెల సదరం సర్టిఫికేట్ కోసం తిరుగుతూనే ఉంది.0.jpg


అయినా.. మీ సేవలోని సిబ్బంది ఏదో ఒక కారణం చెబుతూ వారిని తిప్పి పంపిస్తున్నారు. సదరం సర్టిఫికేట్ కోసం తిరగడానికి ఇప్పటి వరకు దాదాపు రూ.10 వేలు ఖర్చయినట్లు ఆమె నాన్నమ్మ చెబుతోంది. ఇక తనకు తిరిగే ఓపిక లేదని.. ఇప్పటికే చాలా అప్పులు చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. తన మనుమరాలు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మారాలని, సదరం సర్టిఫికేట్ వచ్చేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తద్వారా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలకు భవాని అర్హత సాధిస్తుందని.. ఆ డబ్బు కొంతలో కొంతైనా ఆమె వైద్య ఖర్చులకు ఆసరాగా నిలుస్తుందని తారాబాయి చెబుతోంది. సదరంతోపాటు భవానికి దివ్యాంగుల పింఛన్ త్వరగా వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. తన మనుమరాలి భవిష్యత్తుకు అండగా నిలబడాలని కోరుతోంది.


నేను దురదృష్టవంతురాలిని

అమ్మనాన్నల ప్రేమను పొందలేకపోతున్నా. నాకంటూ ఎవరూ లేరు. నాన్నమ్మే నా ఆలనాపాలనా చూసుకుంటోంది. ఆమె వయస్సు కూడా అయిపోతోంది. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడం, నేను జబ్బుకు గురి కావడం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడటం నా దురదృష్టమే. 8వ తరగతితో నా చదువు ఆపేశా. ఉన్నత చదువులు చదువుకోవాలని ఉంది. కానీ జబ్బు పూర్తిగా తగ్గకపోవడంతో చదువుకు దూరమయ్యా. సదరం సర్టిఫికేట్ కోసం 6 నెలలకుపైగా తిరుగుతున్నాం. కానీ పని కావట్లేదు. నాకు నడవడం కష్టంగా ఉంది. అయినా మీ సేవ కేంద్రానికి వెళ్తున్నాం. కానీ అక్కడి సిబ్బంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు. డబ్బులు లేక ఒక్కోసారి ట్యాబ్లెట్లు తీసుకోవట్లేదు. ఒక్కోసారి పూటకూడా గడవడం కష్టంగా మారింది. ఇక పౌష్టికాహారం ఎక్కడిది. మా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని సదరం సర్టిఫికేట్ మంజూరు చేసి, దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరతున్నా.

- సున్నపు భవానీ

For Latest News and Telangana News Click here

Updated Date - Oct 27 , 2024 | 09:55 AM