Asaduddin Owaisi: ప్రభుత్వ ఆఫీసులనూ కూల్చేస్తారా?
ABN , Publish Date - Aug 26 , 2024 | 03:30 AM
హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘హైడ్రా’పై మజ్లిస్ చీఫ్ ఒవైసీ ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెరువుల ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్న అధికారులు.. ఆ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సైతం కూల్చివేస్తారా? హుస్సేన్ సాగర్ వద్ద నిర్మించిన ప్రభు త్వ కార్యాలయాలను ఏం చేస్తార’ని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం భవనాన్ని నీటి కుంటలో నిర్మించారని, దాన్నీ కూల్చేస్తారా అని ప్రశ్నించారు.
ఆదివారం ఒవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన నెక్లెస్ రోడ్‌ను తొలగిస్తారా? అని హైడ్రా అధికారుల తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయన్నారు. హిమాయత్ సాగర్ సమీపంలో కేంద్ర సంస్థ సీసీఎంబీ నిర్మించారన్నారు. గోల్కొండలోని చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని.. అక్కడ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడతారన్నారు. ఈ కూల్చివేతల విషయంలో తమ పార్టీ విధానాన్ని అధికారులకు తెలియజేశామని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తామన్నారు. విలువైన వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ 2024 బిల్లును తీసుకొచ్చిందని ఒవైసీ విమర్శించారు.