ఆమె మాట... ఇప్పుడక్కడ రాచబాట!
ABN , First Publish Date - 2020-04-16T05:38:00+05:30 IST
అనేకానేక ఉద్రిక్తతలను తట్టుకొని ఆ పనిని ఆమె సమర్థంగా పూర్తి చేశారు. ఆరు గంటల టాస్క్ అద్వితీయంగా ముగిసింది. అందరి మన్ననలనూ అందుకుంది.
అనేకానేక ఉద్రిక్తతలను తట్టుకొని ఆ పనిని ఆమె సమర్థంగా పూర్తి చేశారు. ఆరు గంటల టాస్క్ అద్వితీయంగా ముగిసింది. అందరి మన్ననలనూ అందుకుంది. అంతేకాదు, చివరకు ఆ ప్రక్రియ యావత్ రాష్ట్రానికీ ఒక నమూనాగా, అధికార యంత్రాంగం పరిభాషలో చెప్పాలంటే ‘స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్’ గా మారింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో అసోమ్ రాష్ట్రంలో ఇదంతా జరిగింది. అలా తాను చేసిన పని, రాష్ట్రానికే నమూనా అయ్యే ఘనత సాధించింది ఒక యువతి. పైపెచ్చు ఆమె మన తెలుగమ్మాయి. ఐఎఎస్ అధికారిణి జల్లి కీర్తి పేరు అలా ఇప్పుడు అసోమ్‌లో మారుమోగుతోంది. ఆ రాష్ట్రంలోని హైలకండి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా (మన దగ్గర జిల్లా కలెక్టర్‌నే అక్కడ అలా పిలుస్తారు) ఆమె పని చేస్తున్నారు. తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన ఆమె ఇప్పుడు కరోనాపై పోరులో అసోమ్‌లో కీలకపాత్రధారిణి.
ఆ సంగతులు, అక్కడ సాధించిన తాజా విజయం తాలూకు విశేషాలను ‘నవ్య’తో ఆమె ప్రత్యేకంగా పంచుకున్నారు.
‘‘కరోనా వైరస్ కరాళ నృత్యం అసోమ్‌లోని మా జిల్లాను ఆలస్యంగా తాకింది. అయితేనేం, తొలి మరణం మా వద్దే నమోదైంది. మరణించిన వ్యక్తి మా జిల్లా వాడే. కానీ, చనిపోయింది పక్క జిల్లాలోని ఆసుపత్రిలో! అక్కడే అసలు సమస్య మొదలైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు చనిపోయినచోటే ఖననం చేయాలని లోకల్ అధికారులు భావించారు.
ఉద్రిక్తతల మధ్యనే...
అయితే సామాజిక వర్గాల రీత్యా అతి సున్నితమైన మా జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. ఒక సామాజిక వర్గానికి చెందినవారిని ఈ కరోనా ముసుసుగులో చంపేస్తున్నారన్న తప్పుడు ప్రచారం ఒకటి జరుగుతోంది. పైపెచ్చు, మృతుడు సౌదీ అరేబియాలోని రేవు పట్నమైన జెడ్డా నగరానికి వెళ్ళివచ్చిన వ్యక్తి. ఆయన బంధువులంతా క్వారంటైన్‌లో ఉన్నారు. అలాంటప్పుడు మృతదేహాన్ని కూడా చూపించకుండా వేరొక జిల్లాలో అంత్యక్రియలు జరపడం ఉద్రిక్తతను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఆ సంగతి గుర్తించి, నా బాధ్యతగా రాష్ట్ర మంత్రిని ఒప్పించి మరీ, మృతదేహాన్ని మా జిల్లాకు తీసుకువచ్చాను. కరోనా బాధితుడు అర్ధరాత్రి రెండు గంటలకు మరణించాడు. అతని భార్య, కొడుకు, కూతురు, అల్లుడు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. కనీసం అతని మృతదేహాన్ని చూపించాలని కోరారు. సున్నిత మానవ భావోద్వేగాలను గుర్తించి, మృతదేహాన్ని అక్కడికి అంబులెన్స్‌లో తీసుకువచ్చాం. కానీ, మృతదేహాన్ని జిల్లాకు ఎలా తెస్తారంటూ మరో వర్గం నుంచి అప్పటికే అక్కడ హల్‌చల్ ఆరంభమైంది. ఈ ఉద్రిక్తతల మధ్యనే... కేవలం కుటుంబ సభ్యులకు మాత్రం మృతదేహాన్ని, అదీ కిటికీలో నుంచి చూపించాం. ఈలోపు అంబులెన్స్ డైవ్రర్ ఇక తనవల్ల కాదంటూ వెళ్ళిపోయాడు. ఈ లోపు మరో డైవ్రర్‌ను తెచ్చాం. కాగా, మృతదేహాన్ని ఖననం చేసేందుకు మున్సిపల్ సిబ్బంది సైతం రాము, పొమ్మన్నారు. ఎలాగైతేనేం వారిని ఒప్పించి తీసుకెళ్ళాం.
అలా ఒప్పించాం!
అక్కడే మరోచిక్కు వచ్చింది. ఖననం జరగాల్సింది - మరో సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండే గ్రామంలో! అయితే, తమ గ్రామంలో ఖననం చేయడానికి వీలు లేదు పొమ్మన్నారు అక్కడి మెజారిటీ సామాజిక వర్గ ప్రజలు. ఇదంతా అర్ధరాత్రి దాటిన తరవాతే జరిగింది. ఎలాగోలా అక్కడి వారిని ఒప్పించి, చనిపోయిన వ్యక్తికి అతని మతాచారం ప్రకారం అన్ని కార్యక్రమాలనూ ఆ రాత్రే జరిపించాం. ఉదయం ఎనిమిది గంటలు అయ్యేసరికి రాష్ట్ర యంత్రాంగానికి సమాచారం ఇచ్చాం. నిజానికి మాతో వచ్చిన మున్సిపల్ సిబ్బంది ఆ మృతదేహం ఖననానికి ముందుకు రాలేదు. అప్పటికప్పుడు వేరే వ్యక్తులతోనే ఆ పని చేయించాం. అయినప్పటికీ మాతో వచ్చిన మున్సిపల్ సిబ్బందిని ఇంట్లోకి రానివ్వమంటూ వారి బంధువులు అడ్డుచెప్పారు. దాంతో వారికి పరీక్షలు జరిపించి, అస్సలు ఏమీ సోకలేదని నిర్ధారించడమే కాదు బంధుమిత్రులను ఒప్పించడం శక్తికి మించిన పనైంది.
అదే స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ అయింది!
కరోనాపై, కరోనా సోకినవారిపై స్థానిక ప్రజల్లో ఉన్న రకరకాల అపోహలను తొలగించడం కోసం నాకుగా నేను చేపట్టిన చర్య ఇది. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ఉన్నత అధికార యంత్రాంగం మమ్మల్ని ప్రశంసించింది. ఇకపై కరోనా మృతుల అంత్యక్రియల విషయంలో అసోమ్ అంతటా ఈ ప్రక్రియను అనుసరించడం మేలు అంటూ, దీన్ని స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్(ఎస్‌ఒపి)గా రూపొందించింది. ఇకపై సదరు విపత్కర పరిస్థితుల్లో ఈ పద్ధతినే అమలు చేయండంటూ ఆదేశించింది. దాదాపు ఆరుగంటల సేపు నాతో సహా మా బృందం అంతా అలుపెరగకుండా పడ్డ కష్టానికి అధికార స్థాయిలో దక్కిన గౌరవం ఇది. మరోవైపు ఈ సమయంలో ఒక్కసారి వెనక్కితిరిగి, సున్నితమైన ఈ జిల్లాకు తొలి మహిళా అధికారిగా నాకు పోస్టింగ్ ఇచ్చినప్పటి సంగతులు గుర్తు చేసుకుంటే, ఎంతో ఆత్మసంతృప్తి అనిపిస్తోంది. నిజానికి అసోమ్‌లో మాది చాలా వెనుకబడిన జిల్లా. సరిగ్గా అర్ధగంట సేపు ప్రయాణిస్తే చాలు, బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకోగలం. మతపరంగా ఉద్రిక్తతలు ఎక్కువ. ప్రతి వారం ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇక్కడికి డిప్యూటీ కమిషనర్‌గా వచ్చిన మొట్టమొదటి ఐఎఎస్, మహిళా అధికారిణిని నేనే. ఈ పోస్టింగ్‌కు మునుపు రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఉండేదాన్ని. ఇక్కడకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు ‘అక్కడికా.. మీరు’ అంటూ అందరూ సానుభూతి చూపారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఒకింత హెచ్చరించారు కూడా! అయితే, జిల్లాలో బాధ్యతలు చేపట్టాక స్థానిక ప్రజల మనసు చూరగొన్నందు వల్లే కరోనా సమయంలో నాకు ఈ క్లిష్టమైన పని సాధ్యమైంది. అంతకు ముందు చాలా సందర్భాల్లో నా పనితీరు ఎలా ఉందో ప్రజలకు తెలుసు. అలాగే, నేను ఏ సామాజిక వర్గం వైపు మొగ్గు చూపకుండా, నిష్పక్షపాతంగా, ధర్మంగా వ్యవహరిస్తానని వారు నమ్మారు. అందుకే, ఇప్పుడు ఇదంతా చేయగలిగాను.
అసోమ్‌లో అదుపులోనే ఉంది!
మొదట్లో నన్ను భయపెట్టి, ఆడవాళ్ళ వల్ల అక్కడ ఏమవుతుందంటూ నిరుత్సాహపరిచి, సానుభూతి చూపినవాళ్ళు సైతం ఇప్పుడు ఆగి, మా వైపు చూస్తున్నారు. తాజా కరోనా సంగతులకే వస్తే, మా జిల్లాలో ప్రస్తుతం 1700 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ముందు నుంచీ మేము అప్రమత్తం కావడంతో చాలా వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. క్వారంటైన్‌లో ఉన్న కుటుంబాల ఇంటి ముందు పింక్ హెచ్చరిక అతికించడంతో, స్థానికంగా ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. ఆరంభంలో 14 రోజులకు పరిమితం చేసిన క్వారంటైన్‌ను తరువాత 28 రోజులకు పెంచి జాగ్రత్తగా ఉంటున్నాం. క్వారంటైన్‌లో ఉన్నవారితో అధికారులంతా రోజూ మాట్లాడుతూ, ధైర్యం నూరిపోస్తున్నారు. అదే సమయంలో డేటా అనలిటిక్స్‌ను బాగా ఉపయోగించుకుంటున్నాం. ఎక్కడ, ఎలా ప్రచారం చేస్తే ప్రజలను చైతన్యం చేయవచ్చో అర్థం చేసుకుని మరీ మా సిబ్బంది కార్యరంగంలోకి దిగుతున్నారు. దాంతో ఇప్పటి వరకు సత్ఫలితాలనే అందుకుంటున్నాం’’ అని వివరించారు జల్లి కీర్తి.
ఇంజనీరో మరేదో అవుతానంటే ఒక చాక్లెట్, ఐఎఎస్ అధికారిణి అవుతానంటే రెండు చాక్లెట్లు ఇస్తానంటూ చిన్నప్పుడు తండ్రి ఇచ్చిన ప్రోత్సాహాన్ని కీర్తి ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ ప్రోత్సాహం, ప్రజా శ్రేయస్సులో తనదైన ముద్ర వేయాలనే ఉత్సాహమే ఆమెకు చుక్కాని. అదే ఆమెను సివిల్స్‌వైపు నడిపించింది. ఇప్పుడు మనసున్న అధికారిణిగానూ పేరు తెస్తోంది. ఈశాన్య భారతంలో ఈ తెలుగింటి ఆడపడుచు గడిస్తున్న కీర్తి స్ఫూర్తిదాయకం.
మద్దిపట్ల మణి
ఆరేళ్ళలో... ఎంతో నేర్చుకున్నా!
ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేరయ్యే రోజుల్లో రకరకాల వర్క్‌షాపుల్లో పాల్గొనేదాన్ని. అలాగే వివిధ ప్రాజెక్టుల్లో పనిచేశాను. అధికారం ఉంటే అన్నీ సులువుగా చేసేయవచ్చు అని అప్పట్లో అనుకునేదాన్ని. అయితే తరతరాలుగా ప్రజల్లో పాతుకుపోయిన కొన్ని విధివిధానాలు, అభిప్రాయాల కారణంగా అన్నీ మనం అనుకున్నట్టుగా సాగవని ఈ ఆరేళ్ళలో నాకు అర్థమైంది. అలాగని నేనేమీ నిరుత్సాహపడలేదు. ఉన్న పరిస్థితులు, పరిమితుల్లోనే అన్నింటినీ చక్కబరచుకుంటూ వెళ్ళాలన్న విషయం గ్రహించా. అలాగే ముందుకు సాగుతున్నా
జల్లి కీర్తి, ఐ.ఏ.ఎస్. అధికారిణి, అసోమ్