నిండు గర్భంతో అసెంబ్లీకి...

ABN , First Publish Date - 2020-03-02T06:49:40+05:30 IST

ర్భిణులను ‘రెస్ట్‌’ పేరిట కాలు కదపనివ్వరు ఇంటిల్లిపాది. అతి జాగ్రత్తలతో వారిని ఇంటికే పరిమితం చేస్తారు. కానీ మహారాష్ట్ర బీడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే నమితా ముందడ ఎనిమిది నెలల గర్భిణి అయినప్పటికీ...

నిండు గర్భంతో అసెంబ్లీకి...

గర్భిణులను ‘రెస్ట్‌’ పేరిట కాలు కదపనివ్వరు ఇంటిల్లిపాది. అతి జాగ్రత్తలతో వారిని ఇంటికే పరిమితం చేస్తారు. కానీ మహారాష్ట్ర బీడ్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే నమితా ముందడ ఎనిమిది నెలల గర్భిణి అయినప్పటికీ, ఆమె తాజాగా బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే నమిత కారు దిగి అసెంబ్లీ ఆవరణలో అడుగుపెట్టగానే అంతా ఆశ్చర్యంగా చూశారు. ‘ఇంటి వద్ద విశ్రాంతి తీసుకోవాల్సిన మీరు ఈ సమయంలోనూ అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటి’ అని విలేకరులు, తోటి ఎమ్మెల్యేలు అడిగితే... ‘అసెంబ్లీ సమావేశాలకు రావడం ఎమ్మెల్యేగా నా బాధ్యత’ అని బదులిచ్చారామె. ‘‘ప్రస్తుతం బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి.


వాటికి హాజరు కావడం నా బాధ్యత. మా నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. వాటిని సభలో ప్రస్తావించాలనే ఆలోచనతో కొంచెం ఇబ్బంది అయినా అసెంబ్లీకి వచ్చాను. గర్భం దాల్చడం అనేది జబ్బు కాదు ఇంటి పట్టునే ఉండిపోడానికి. అది ప్రతి మహిళ జీవితంలో వచ్చే ఒక దశ. అందరు గర్భిణుల మాదిరే నేను కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నా. కానీ డాక్టర్ల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా బాధ్యతలు చూసుకుంటున్నా’’ అన్నారు నమిత. 


అసెంబ్లీ లాబీలో నమితను చూసిన తోటి ఎమ్మెల్యేలు, సిబ్బంది పని పట్ల ఆమెకున్న అంకితభావం, నిబద్ధతను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు. కొందరు మహిళా ఎమ్మెల్యేలు ‘ఆరోగ్యం జాగ్రత్త చూసుకో’ అని సలహా ఇచ్చారు కూడా. విషయం తెలియగానే సోషల్‌ మీడియాలో నమితకు అభినందనలు వెల్తువెత్తుతున్నాయి. ఒకప్పుడు భ్రూణహత్యలకు పేరుగాంచిన బీడ్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నమిత వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించి మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు.

Updated Date - 2020-03-02T06:49:40+05:30 IST