హైదరాబాద్‌లో ఆసుపత్రి పెట్టాలనుందని అమెరికా నుంచి ఎన్టీఆర్‌కు లేఖ రాశా..

ABN , First Publish Date - 2020-02-08T00:44:33+05:30 IST

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇక్కడకు వచ్చి చికిత్స చేయించుకుంటుంటారు. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఈ 30 ఏళ్ల జర్నీలో తాము చాలా సాధించామనీ, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అంటున్నారు.

హైదరాబాద్‌లో ఆసుపత్రి పెట్టాలనుందని అమెరికా నుంచి ఎన్టీఆర్‌కు లేఖ రాశా..

ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు ఉత్తరాలకు రిప్లై ఇవ్వడన్నారు..

పదిహేను రోజుల్లో ఎన్టీఆర్ నుంచి రిప్లై.. నచ్చిన స్థలాన్ని సెలెక్ట్ చేసుకోమన్నారు

పల్లెటూరిలో గడపకపోతే కంప్లీట్ ఇండియన్ కాలేరు

ఆ రోజుల్లోనే కోటి రూపాయల సాయం.. అందుకే ఆసుపత్రికికి ఎల్వీ ప్రసాద్ పేరు..

అందరినీ సమానంగా చూడటం అమెరికా నేర్పింది..

మా దగ్గర రోగి మంత్రయినా, స్వీపర్ అయినా ఒక్కటే.. అందర్నీ ఒకేలా చూస్తాం

మా మీద ఎవరైనా ఎగరాలని చూస్తే మాత్రం సహించం

పేషెంట్లు, వారి కుటుంబాలకు ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తాం

నాకు అడ్డుపడిన ఓ మహిళా అధికారి.. రిటైరయ్యాక ఉద్యోగానికి నా దగ్గరకే వచ్చారు

ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు


ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇక్కడకు వచ్చి చికిత్స చేయించుకుంటుంటారు. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఈ 30 ఏళ్ల జర్నీలో తాము చాలా సాధించామనీ, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చుపెడితే పదేళ్లలో అంధత్వం సమస్యను పరిష్కరించొచ్చని నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. సెలబ్రెటీలు, ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు.. అంటూ వచ్చే వాళ్లకు తమ ఆసుపత్రిలో ప్రత్యేక సౌకర్యాలు ఏమీ ఉండవనీ, అందర్నీ ఒకేలా చూస్తామని ఆయన అన్నారు. తాను వచ్చినప్పుడు రెడ్‌కార్పెట్ వేయలేదని అప్పట్లో ఒక మంత్రిగారు అన్నారన్నారు. తన కుమారుడి కంటి చికిత్స కోసం ఆసుపత్రికి ప్రియాంకాగాంధీ వచ్చారనీ, సామాన్యురాలిగానే వ్యవహరించారన్నారు. ఇంకా తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో విశేషాల గురించి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 29-10-2017న నిర్వహించినటువంటి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారాయన... ఆ పూర్తి వివరాలు ఇవే....

 

ఆర్కే: ఎల్‌.వి. ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి ముప్ఫై సంవత్సరాలయిందా?

నాగేశ్వరరావు: ఈ ఏడాది జూన్‌తో ముప్ఫై ఏళ్లు పూర్తయ్యాయి.

 

ఆర్కే: ఒక చిన్న ఇన్‌స్టిట్యూట్‌గా మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చారు. ఈ జర్నీ సంతృప్తిగా ఉందా? ఇంకా సాధించాల్సింది ఉందనిపిస్తోందా?

నాగేశ్వరరావు: చాలా సాధించాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంధత్వ సమస్య మన దేశంలో చాలా ఎక్కువ. ఇతర బడుగు దేశాల్లో కూడా ఎక్కువే. 100కి 90 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఈ సమస్య ఉంది.

 

ఆర్కే: దానికి పేదరికమే కారణమా?

నాగేశ్వరరావు: పేదరికం కూడా. రెండోది సేవలు అవసరం ఉన్న చోట లభించడం లేదు. ఇప్పుడు మన దేశమే తీసుకోండి. ఎక్కువ సేవలు అవసరమైంది పల్లెటూళ్లలో, గిరిజన ప్రాంతాల్లో. అక్కడేమో సేవలు అంత త్వరగా లభించవు. దానిమూలంగా ఎంత చేసినా ఇంకా చేయాల్సింది ఉంటూనే ఉంటోంది. మేమేం ప్రయత్నం చేశామంటే ప్రతిచోట ఒక మోడల్‌లాగా చూపిస్తే అది మిగతా వాళ్లు తీసుకుని ఇంకా పెంచుతారని అనుకున్నాం. ఇప్పుడది ప్రభుత్వం, మిగతా సంస్థలు కలిసి చేస్తే తప్ప దేశవ్యాప్తంగా అంధత్వ సమస్యను పూర్తిగా నిర్మూలించలేము. మనదేశంలో అంధత్వానికి ప్రధాన కారణం శుక్లాలు(కాటరాక్ట్‌). ఈ మధ్య కొత్త కొత్త సమస్యలు చాలా వస్తున్నాయి. సేవలు అందించగలిగితే శుక్లాల సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు.

 

ఆర్కే: శుక్లాల సమస్య రావడానికి కారణం ఏంటి?

నాగేశ్వరరావు: కచ్చితమైన కారణం ఇది అని చెప్పలేం. జెనటిక్‌ ఫ్యాక్టర్స్‌, పోషకాహార లోపం, చుట్టూ ఉన్న వాతావరణం.. ఇలా అన్నీ కారణమవుతాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో కాటరాక్ట్‌ పదేళ్లు ముందుగా వస్తోంది. ఏటా మన దేశంలో 60 లక్షల కాటరాక్ట్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఏ దేశంలో ఇన్ని జరగవు. చైనా తీసుకుంటే ఇందులో పదిశాతమే చేస్తున్నారు. ప్రభుత్వాలు పూనుకుంటే అంధత్వ సమస్యను నిర్మూలించడం పెద్ద కష్టమేమీ కాదు.

 

ఆర్కే: మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటి?

నాగేశ్వరరావు: పుట్టింది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర చోడవరం. నా చిన్నతనంలోనే మా అమ్మమ్మకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తే చికిత్స కోసం తరచుగా వైజాగ్‌ వెళ్లాల్సి వచ్చేది. మా పెద్దమ్మ ఒకావిడ ‘నీకు ఇబ్బందిగా ఉంది’ అని మా అమ్మకు చెప్పి నన్ను తను తీసుకెళ్లింది. వాళ్లకు పిల్లలు లేరు. బందరు రోడ్డులో ఈడ్పుగల్లు అని ఊరు. అక్కడే పదేళ్ల వయస్సు వచ్చే వరకు ఉన్నాను. ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. నా బాల్యం పల్లెటూరులో గడవడం ఒక బహుమతిగా భావిస్తాను. ఒక మంచి డాక్టర్‌ కావడానికి కారణం కూడా అదే. జీవితంలో ఎప్పుడో ఒకసారి పల్లెటూరులో గడపకపోతే కంప్లీట్‌ ఇండియన్‌ కాలేరని మా పిల్లలకు చెబుతుంటాను. తరువాత మా నాన్నగారు గుంటూరులో ఆప్తమాలజిస్ట్‌గా క్లినిక్‌ పెట్టి సెటిలయ్యారు. పదేళ్ల వయస్సు నుంచి మెడిసిన్‌ చదివే వరకు గుంటూరులోనే ఉన్నాను. అదయ్యాక ఢిల్లీలో పీజీ చేశాను. తరువాత అమెరికాలో పన్నెండేళ్లు ఉన్నాను. అప్పుడు కంప్లీట్‌గా జీవితమే మారిపోయింది. రకరకాల వ్యక్తులతో పరిచయం, గొప్ప వ్యక్తుల ప్రభావం, అక్కడ ఎక్సలెన్సీకి ఇచ్చే గౌరవం ఇవన్నీ నాపైన చాలా ప్రభావం ఉంది. అమెరికా నుంచి తిరిగొచ్చి ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టి సక్సెస్‌ కావడం వెనక నా భార్య ప్రోత్సాహం చాలా ఉంది. మా నాన్నగారు, మామగారు ఇండియాకు తిరిగి రావద్దన్నారు. అయినా కూడా వాళ్ల మాట వినకుండా వచ్చాం. నాకు హైదరాబాద్‌లో ఎవ్వరూ తెలియదు. పరిచయాలు లేవు. ఒకవిధంగా అదే హెల్ప్‌ చేసింది అనుకుంటాను.

 

ఆర్కే: హైదరాబాద్‌లో ఎవరూ తెలియకుండా అడుగుపెట్టారు కదా! ఎల్‌.వి. ప్రసాద్‌ కుటుంబంతో ఎలా పరిచయం ఏర్పడింది?

నాగేశ్వరరావు: 1981 చివరలో మా ఆవిడ, నేనూ అనుకున్నాం హైదరాబాద్‌లో హాస్పిటల్‌ పెట్టాలని! 1986లో హైదరాబాద్‌ వెళ్లిపోవాలని ప్లాన్‌ చేసుకున్నాం. అమెరికాలో ఒక ఫౌండేషన్‌ పెట్టి మిత్రుల దగ్గర, స్నేహితుల దగ్గర సహాయం అడిగి ఆ డబ్బుతో ఎక్విప్‌మెంట్‌ కొందాం. ఇక్కడ తగ్గింపు ధరలో భూమి ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుదాం. బ్యాంక్‌ లోన్‌ తీసుకుని బిల్డింగ్‌ కట్టేద్దాం అని అనుకున్నాం. ఎవ్వరినైనా అడిగే ముందు మనం కమిట్‌ అవ్వాలని నా భార్య ఆలోచన. అందుకే ముందుగా మేం కొంత అమౌంట్‌ కమిట్‌మెంట్‌ చేసి తరువాత ఫ్రెండ్స్‌ని అడిగాం. ఆ డబ్బుతో ఎక్విప్‌మెంట్‌ కొన్నాం. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఉత్తరం రాశాను. ‘ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు ఉత్తరాలకు రిప్లై ఇవ్వడు’ అని అందరూ అన్నారు. కానీ పదిహేను రోజుల్లో ఎన్టీఆర్‌ దగ్గర నుంచి రిప్లై వచ్చింది. ఇండియాకు వచ్చినపుడు వచ్చి కలవమని రాశారు. తరువాత వచ్చినపుడు వెళ్లి కలిశాను. ‘స్థలాలు చూపించండి, ఏదో ఒకటి వాళ్ళకు నచ్చింది సెలక్ట్‌ చేసుకుంటారు’ అని అధికారులకు చెప్పారు. కిస్మత్‌పూర్‌ దగ్గర 8 ఎకరాలు అలాట్‌ చేశారు. అంతా రెడీ అయిపోయింది. ఇక మొదలుపెడదాం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఉషాముళ్లపూడి హాస్పిటల్‌ ఉంది కదా! దాని యజమాని ముళ్లపూడి వెంకటరత్నం ఒకరోజు పిలిచారు. ‘నాగేశ్వర్‌రావుగారూ! మా ఇంటికి ఒక గెస్ట్‌ వచ్చారు. ఆయనతో మీరు మాట్లాడితే బాగుంటుంది’ అన్నారు. ఎవరండీ! అంటే, ‘రమేశ్‌ ప్రసాద్‌’ అన్నారు. ఆయనెవరో నాకు తెలియదు అంటే.. ‘మీరు సినీ దర్శక-నిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ పేరు విన్నారా?’ అని అడిగారు. ‘విన్నాను’ అంటే ‘వాళ్లబ్బాయి తను’ అన్నారు. దేని గురించి మాట్లాడమంటారు అని అడిగా! ‘వాళ్లకు ఒక ట్రస్ట్‌ ఉంది. ఆ డబ్బును మంచి ఆరోగ్యసంస్థకు గానీ, విద్యాసంస్థకు గానీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీలాంటి వాళ్లకు ఇస్తే బాగుంటుంది కదా అన్నాను. మీరొకసారి మాట్లాడండి’ అని చెప్పారు. దాంతో ఫోన్‌లో మాట్లాడి ప్రపోజల్‌ పంపించాను. మూడు నెలల తరువాత ఇండియా వచ్చినపుడు చెన్నై వెళ్లి ఎల్‌.వి.ప్రసాద్‌ గారిని, రమేశ్‌ప్రసాద్‌ గారిని కలిశాను. ‘మీకు సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాం’ అన్నారు. ఆ రోజుల్లో కోటి రూపాయలు సహాయం చేశారు. అంతేకాకుండా మా ల్యాబ్స్‌ది స్థలం ఉంది. ప్రభుత్వం ఒప్పుకుంటే అందులో సగం ఇస్తాం అన్నారు. దాంతో ఒప్పుకున్నాను. అంత పెద్ద కాంట్రిబ్యూషన్‌కు గుర్తింపుగా ఇన్‌స్టిట్యూట్‌కు ఆయన పేరు పెట్టాం. నిజానికి మొదట మేం అనుకున్న పేరు ‘హైదరాబాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌’. అలా మొదలయింది వారితో ప్రయాణం. ఇంతకంటే మంచి దాత మాకు ఇంకొకరు దొరికేవారు కాదేమో అనుకుంటాము. మా మీద ఎలాంటి ఒత్తిడీ పెట్టరు.

 

ఆర్కే: 50 శాతానికి పైగా రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని అంటున్నారు కదా! మరి డబ్బుల పరంగా ఇబ్బంది రావడం లేదా?

నాగేశ్వరరావు: మొదటి నుంచీ ఒకటి పెట్టుకున్నాం. రోజువారీ నిర్వహణ ఖర్చులకు చందాల మీద, గ్రాంట్‌ల మీద ఎప్పుడూ ఆధారపడకూడదు. మాకు పేయింగ్‌ పేషెంట్స్‌ ఉంటారు. వాళ్లతో వచ్చే ఆదాయం నిర్వహణకు సరిపోతుంది. గ్రాంట్ల ద్వారా, దాతలు ఇచ్చే డబ్బుతో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, ఎక్విప్‌మెంట్‌ కొనడం, విస్తరణ..ఇలాంటి పనులన్నీ చేస్తుంటాం. ఈ రోజు మాకు ఎక్కడా అప్పుల్లేవు. ఎప్పుడూ అప్పులు తీసుకోం మేం. బ్యాంకుల వాళ్లు పిలుస్తుంటారు. వాళ్లకు నేను చెబుతుంటాను, నేను తీసుకునేది డొనేషనే అని. మాకు లోన్స్‌లేవు. ఓవర్‌డ్రాఫ్ట్స్ లేవు.

 

ఆర్కే: మీ హాస్పిటల్‌లో అందరినీ ఒకేలా చూస్తారు. ప్రత్యేకంగా చూడటం అంటూ ఉండదు. దానివల్ల ఇబ్బంది రాలేదా?

నాగేశ్వరరావు: మొదట్లో వచ్చింది. చాలా మంది ‘యారగంట్‌’ అన్నారు. నేనైతే అందరినీ మర్యాదగా చూస్తాను. ఎప్పుడూ రెడ్‌ కార్పెట్‌ వేసే ఉంటుంది. సామాన్యుడి నుంచి మంత్రి వరకు రెడ్‌ కార్పెట్‌ పరిచే ఉంటుంది. ‘నేనొచ్చి పర్సనల్‌గా చూడటం సాధ్యం కాదు. అలా చూశానంటే ఇంకేదో మానేస్తున్నానని అర్థం. అది మీకు మంచిది కాదు, మాకూ మంచిది కాదు’ అని చెబుతాను. నాకు ఎవరిపైనా డిస్‌రెస్పెక్ట్‌ లేదు. అందరినీ మర్యాదగా చూస్తాం. మా మీద ఎగరాలని చూస్తే మాత్రం సహించం.

 

ఆర్కే: ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? మీ నాన్న గారి దగ్గరి నుంచా...?

నాగేశ్వరరావు: మా నాన్న ఎవ్వరినీ పట్టించుకునే వారు కాదు. ఆయన ఎప్పుడు చదువు గురించే చెప్పేవారు. డబ్బు ముఖ్యం కాదు అనే వారు. చాలా సింపుల్‌గా ఉండేవారు. మా తాత స్వాతంత్య్ర సమరయోధులు. జైలు కెళ్లారు. ఆయన దగ్గర నుంచి కొంత వచ్చింది. పల్లెటూళ్లలో పెరగడం కూడా కొంత మేలు చేసింది. అందరినీ సమానంగా చూడటం అమెరికా నేర్పింది.


ఆర్కే: ఈ మధ్యకాలంలో ప్రియాంకాగాంధీ వాళ్లబ్బాయి కోసం మీ ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చినట్టున్నారు?

నాగేశ్వరరావు: అవును.


ఆర్కే: ఏ ట్రీట్‌మెంట్‌ కోసం..?

నాగేశ్వరరావు: వాళ్లబ్బాయికి క్రికెట్‌ బాల్‌ తగిలింది. సెకండ్‌ ఒపీనియన్‌ కోసం వచ్చారు. మా పీడియాట్రిక్‌ ఆప్తమాలజిస్ట్‌ రమేశ్‌ చూశారు. అంతా బాగానే ఉంది చెప్పి పంపించారు. ఆవిడ చాలా మర్యాదగా ఉన్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం ఆవిడే మాట్లాడారు.

 

ఆర్కే: ఇప్పటి వరకు మీరు చేసిన ఆపరేషన్లు ఎన్ని?

నాగేశ్వరరావు: 20 లక్షలు చేశాం. 2 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించాం. ఔట్‌ పేషెంట్లే కాకుండా రోజూ మారుమూల గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి మా వాళ్లు పరీక్షలు చేస్తూనే ఉంటారు. ఏడాదికి పదిహేను.. ఇరవై లక్షల మందికి ఇలా స్ర్కీనింగ్‌ జరుగుతుంటుంది. పరీక్షల అనంతరం అవసరమైన ట్రీట్‌మెంట్‌ కూడా ఇస్తుంటాం.

 

ఆర్కే: మీ ఇనిస్టిట్యూట్‌ బయట రోడ్డుపై పేషెంట్లు పడుకొంటున్నారు కదా! దానికి ప్రత్యామ్నాయం ఆలోచించారా?

నాగేశ్వరరావు: ఎప్పటి నుంచో మాకు ఇనిస్టిట్యూట్‌ లోపల ఏర్పాట్లు ఉన్నాయి. పేషెంట్లు, వారి కుటుంబాలకు ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తాం. బయట ఉండేవాళ్లు మా ఆసుపత్రికి వచ్చేవాళ్లు కాదు. మా వాళ్ల దగ్గర మా క్యాప్‌లు తీసుకుని పెట్టుకుంటారు. అలాగైతే వారికి కూడా భోజనం పెడతారని! మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు దగ్గర్లో ఓ వెయ్యి గజాల స్థలమివ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.

 

ఆర్కే: ఐ సర్జరీల్లో మీ టాలెంట్‌కు పరీక్షలాంటిదేమన్నా ఎదుర్కొన్నారా?

నాగేశ్వరరావు: అలాంటిదేమీ లేదండీ! ఎలాంటి కంటి వైద్యానికైనా దేశంలోనే అన్ని వసతులూ ఉన్నాయి. ఇక్కడే కాదు... దేశంలో చాలా చోట్ల ఉచిత నేత్ర వైద్యం అందుబాటులో ఉంది. ఇది మన దేశ గొప్పదనం.

 

ఆర్కే: ప్రభుత్వ ఆసుపత్రుల విషయం వచ్చేసరికి తరచుగా ఓ సమస్య వస్తోంది. నేత్ర వైద్య క్యాంపులు పెడతారు. అవి వికటించి చూపు పోతోందని ఎక్కువగా వార్తలొస్తున్నాయి. అలా ఎందుకు జరుగుతోంది?

నాగేశ్వరరావు: ఏ ఆసుపత్రయినా ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదాలు వస్తుంటాయి. నేనెంత పెద్ద సర్జనైనా అవ్వచ్చు. ఎన్ని సౌకర్యాలైనా ఉండొచ్చు. కానీ... లోపల మనమెలా చేస్తున్నామని ప్రతి దాని గురించీ చూసుకోకపోతే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇంకొకటి... చాలా చోట్ల కొన్ని పద్ధతులు మార్చలేకపోతున్నాం. ఇదివరకు స్కూళ్లు తదితర ప్రాంతాల్లో ఐ క్యాంపులు, ఆపరేషన్లు చేసేవారు. అవన్నీ ఇప్పుడు బంద్‌ చేశారు. కానీ అదే కల్చర్‌ని ఆసుపత్రి లోపలకు తీసుకొస్తున్నారు. ఒకటే రోజు వందా రెండొందల ఆపరేషన్లు చేస్తే క్వాలిటీ తగ్గుతుంది. దేశంలో సంవత్సరానికి కోటి ఆపరేషన్లు చేస్తే మనకు క్యాటరాక్ట్‌ సమస్య ఉండదు. అది చేయడానికి మన దగ్గర పాతిక వేల మంది ఐ- డాక్టర్లున్నారు. వీరందరూ తలా నాలుగు చొప్పున చేస్తే రోజుకు లక్ష ఆపరేషన్లవుతాయి. సమస్య సులువుగా పరిష్కారమైపోతుంది. అలా కాకుండా ఆపరేషన్‌ థియేటర్లు కట్టి... నెలలో పది రోజులు ఖాళీగా పెట్టి, మిగిలిన రోజుల్లో వంద నూట యాభై ఆపరేషన్లు చేస్తేనే ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అక్కడున్న సిస్టమ్‌ను డెవలప్‌ చేసి, సిబ్బందికి శిక్షణనివ్వాలి. అన్నింటి కంటే మన దేశంలో పెద్ద సమస్య క్రమశిక్షణ. అదంటే మనకు పడదు.

 

ఆర్కే: మీది ఓ డిఫరెంట్‌ మోడల్‌. ఇది మన దేశానికి ప్రధానమైన విద్య, వైద్యానికీ వర్తిస్తుంది కదా!

నాగేశ్వరరావు: అవును. ఈ మోడల్‌ని రెండు రంగాల్లోనూ అమలు చేయవచ్చు. నేనెప్పుడూ ప్రైవేటు స్కూల్స్‌ వారిని అడుగుతుంటాను... ‘మాలాగా మీరూ ఎందుకు చేయకూడదు అనీ! బాగా డబ్బున్నవారి పిల్లలను తీసుకొని ఫీజులు కలెక్ట్‌ చేయండి. ప్రతి క్లాసులో కనీసం పది శాతమన్నా పేద విద్యార్థులకు అవకాశం ఇవ్వచ్చు కదా’ అని వారికి చెబుతుంటాను.

 

ఆర్కే: కానీ, వేరే దేశాల్లో ఉన్నంత దాతృత్వం మన దగ్గర లేదు. చాలా మంది చేస్తున్నప్పటికీ ఆ స్థాయిలో లేదు!

నాగేశ్వరరావు: అవునండి... ఇంకా లేదు. పాశ్చాత్య దేశాల్లో బిలియన్స్‌లో సంపాదిస్తారు... బిలియన్స్‌లోనే డొనేట్‌ చేస్తారు. కానీ ఇక్కడ... మనం బిలియన్స్‌లో సంపాదిస్తున్నాం కానీ ఆ స్థాయిలో డొనేట్‌ చేయడం లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త మెరుగవుతోంది.

 

ఆర్కే: మరి మీ లాంటి వాళ్లు దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకుని, విస్తృతంగా డిబేట్‌లు పెట్టొచ్చు కదా!

నాగేశ్వరరావు: మేం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ, అవసరమైనంత వేగంగా సాగడం లేదు.


ఆర్కే: ఒక వ్యక్తిగా ఇంత పెద్ద ఇనిస్టిట్యూషన్‌ని క్రియేట్‌ చేయగలిగారు. పది మంది వ్యక్తులైతే పది ఇనిస్టిట్యూషన్స్‌ వచ్చేస్తాయి కదా!

నాగేశ్వరరావు: నేను ఎప్పుడూ చెప్పేదదే. నాలాంటి వాడు చేయాలనుకుంటే ఎంతైనా చేయవచ్చు. చేయాలి అనుకోవడమే కష్టం. ఒక విధంగా చెప్పాలంటే మా లాంటి మోడల్‌కు ప్రభుత్వం దగ్గరి నుంచి కూడా అంత ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం ఉంటే ఈ ఆలోచన మరింత ముందుకు వెళుతుంది. ఆ రోజుల్లో నేను ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నానని కోర్టులో కేసు కూడా వేశారు. రైట్‌ టూ సైట్‌ సొసైటీ గవర్నమెంట్‌ ఫండింగ్‌ నుంచి నయా పైసా కూడా తీసుకోలేదు. ఇప్పటికీ దానికి కట్టుబడే ఉన్నాం. మేం ఐదేళ్లకు సంవత్సరానికి రూ.16 కోట్లు చొప్పున అడిగాం. ఐదేళ్ల తరువాత ఇంటర్నేషనల్‌ ఫండింగ్‌కు వెళ్లి, పెద్ద గ్రాంటు తీసుకొచ్చి రాష్ట్రంలో నేత్ర వైద్యాన్ని పూర్తి స్థాయిలో మార్చేయాలనేది నా ఉద్దేశం. ప్రతి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం తీసుకురావాలని ఆ ఫండ్‌ను మొదలుపెట్టాం. కానీ ఒక మహిళా అధికారి అడ్డుపడటం వల్ల అది జరగలేదు. గమ్మత్తేమిటంటే.. ఆవిడ రిటైరైన తరువాత ఈ మధ్యనే నా దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చారు. కానీ.. మర్యాదగా మాట్లాడి పంపించేశాను. (నవ్వుతూ)

 

ఆర్కే: మరి ఇలాంటి మోడల్‌ వ్యవస్థ కోసం మీరేమన్నా ప్రయత్నిస్తున్నారా?

నాగేశ్వరరావు: దక్షిణాదిలో మేము, శంకర్‌ నేత్రాలయ, అరవింద్‌ ఐ హాస్పిటల్‌ కలసి ఆ దిశగా పనిచేస్తున్నాం. డాక్టర్‌ అంజిరెడ్డి గారు ఉన్న రోజుల్లో నన్నడిగారు... ‘మీ మోడల్‌లో జనరల్‌ హాస్పిటల్‌ హైదరాబాద్‌లో పెడితే బాగుంటుంది’ అని. అందుకు సహకరిస్తానని చెప్పారు. అందుకు ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ తరువాత ఎందుకో ఆగిపోయింది. చాలా చోట్ల ఛారిటీ హాస్పిటల్స్‌ ఉన్నా స్టాండర్డ్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయలేకపోతున్నారు.

 

ఆర్కే: లైక్‌మైండెడ్‌ వాళ్లంతా కలసి దీన్నొక క్యాంపెయిన్‌గా రన్‌ చేస్తే ఉపయోగం ఉంటుంది. విద్యా రంగం తీసుకొంటే... కాలేజీల్లో పిల్లల సూసైడ్స్‌...ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వాలు సమాధానం చెప్పలేని పరిస్థితి?

నాగేశ్వరరావు: ఇప్పుడు పరిస్థితులు, అవసరాలను బట్టి మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను బేసిక్స్‌ నుంచి మార్చాలి. కానీ దాన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా వందేళ్ల క్రితం నాటి వైద్య విద్యనే కొనసాగిస్తున్నాం. నిజం చెప్పాలంటే ఇతర దేశాలతో పోలిస్తే మన మెడికల్‌ ఎడ్యుకేషన్‌ చాలా పూర్‌. భవిష్యత్తును తలుచుకొంటే భయమేస్తోంది. ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా అంతే! అక్కడ ఎయిమ్స్‌... ఇక్కడ ఎయిమ్స్‌ అని ప్రకటిస్తుంటారు. కానీ వాటికి బిల్డింగ్‌లు కట్టి వదిలేస్తే సరిపోదు కదా! ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి వస్తారు? క్వాలిటీ ఫ్యాకల్టీ అందుబాటులో లేనేలేదు.

 

ఆర్కే: ప్రైవేటు ప్రాక్టీస్‌ చేస్తున్న డాక్టర్లందరూ కనీసం రోజుకు గంటైనా గవర్నమెంట్‌ కాలేజీల్లో టీచింగ్‌ చేయాలని మ్యాండేట్‌ చేయలేరా?

నాగేశ్వరరావు: అవకాశం ఇస్తే చాలా మంది చేస్తారు. మా రోజుల్లో హానరీ ప్రొఫెసర్లుండేవారు. వాళ్లు చాలా బాగా చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటి వాటిని

తీసేశారు.

 

ఆర్కే: ఇంత పెద్ద ఇనిస్టిట్యూషన్‌ నడుపుతూ మీ పిల్లలిద్దర్నీ వైద్య రంగానికి దూరంగా ఎందుకు ఉంచారు?

నాగేశ్వరరావు: మాకు ఒక అబ్బాయి... ఒక అమ్మాయి. పిల్లలకు ఎప్పుడూ ఫలానా చదవాలని వారిపై ఒత్తిడి చేయలేదు. ఏది చదివినా, ఎవర్ని పెళ్లి చేసుకున్నా వాళ్లు ఆనందంగా ఉంటే చాలనుకున్నాం. మంచి మనుషులుగా ఉండాలనుకున్నాం. అదృష్టవశాత్తూ అంతా మంచిగానే ఉన్నారు. అబ్బాయి అమెరికా నుంచి తిరిగి వచ్చి ప్రస్తుతం మా దగ్గరే పనిచేస్తున్నాడు. వాడికి అక్కడ వెంచర్‌ క్యాపిటల్‌, టెక్నాలజీ స్టార్ట్‌అప్స్‌పై మంచి అవగాహన ఉంది. కోడలు అమెరికా అమ్మాయి. ఇంకా ఎక్కడా చేరలేదు. కూతురు- అల్లుడు ఇద్దరూ లాయర్లు. హార్వర్డ్‌ లా స్కూల్లో చదివారు. హ్యూమన్‌ రైట్స్‌, సివిల్‌ రైట్స్‌ మీద పోరాటం చేస్తుంటారు. మా అమ్మాయి న్యూయార్క్‌లో పబ్లిక్‌ డిఫెండర్‌గా ఉండేది. వాళ్లిద్దరూ ఎక్కువ సంపాదించడం తప్పనుకొనేవారు. మా నుంచే ఊడిపడ్డారు (నవ్వుతూ).

 

ఆర్కే: మన దగ్గర అలాంటి కేటగిరీ అడ్వకేట్స్‌కు బెదిరింపులు వస్తాయి. అమెరికాలో కూడా అలాంటివి ఉంటాయా?

నాగేశ్వరరావు: అక్కడా వస్తూనే ఉంటాయి. ఆ విషయంలో మా ఆవిడ చాలా వర్రీ అవుతుంటుంది. మా అమ్మాయి హైదరాబాద్‌లో జైళ్లన్నీ సర్వే చేసింది. ఖైదీల ఇంటర్వ్యూలు తీసుకుంది. ఇక్కడ కూడా వాళ్లు ప్రయత్నించారు. కానీ ప్రోత్సాహం ఇచ్చిన వాళ్లెవరూ కనిపించలేదు. అల్లుడు కూడా అమెరికనే! మల్టీ కల్చర్‌.. మల్లీ ఎథ్నిక్‌ ఫ్యామిలీ మాది.

 

ఆర్కే: ఇక తరువాత ఏం చేద్దామనుకొంటున్నారు?

నాగేశ్వరరావు: చేయాల్సింది చాలా ఉంది. మూడు నాలుగేళ్లలో ఇనిస్టిట్యూషన్‌ను నెక్స్ట్‌ జనరేషన్‌కు ఇచ్చేయాలని ప్రయత్నిస్తున్నా. దాని కోసం ఆరేడుగురిని గుర్తించాం. వారిలో ఒకరికి అప్పచెబుతాం. వాళ్లు మరింత ముందుకు తీసుకువెళతారన్న నమ్మకం ఉంది. ఇప్పుడు రెండు పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తున్నాం. ఒకటేమో ఐ కేర్‌లో ఇనిస్టిట్యూషన్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌. అవి ఒక పన్నెండు సెంటర్లు వస్తున్నాయి. రెండోది మూడు స్టేట్స్‌లో ప్రైమరీ ఐకేర్‌ను విస్తృత పరిచి, అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచానికి ఒక మోడల్‌ అందించాలని ఆశిస్తున్నాం. మన దేశం పేరు ప్రముఖంగా వినిపించేలా పరిశోధనలు చేయాలని ఆలోచిస్తున్నాం. మా ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్‌ తదితరులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

---------------------------------------------------------------

మా హాస్పిటల్‌ ఈ రోజు ఈ స్థాయిలో ఉందీ అంటే దాని వెనక అందరి కృషి ఉంది. రోజూ హాస్పిటల్‌ క్లీన్‌ చేసే వారి దగ్గరి నుంచి సర్జరీలు చేసే డాక్టర్ల వరకు, పరిశోధనలు చేస్తున్న సైంటిస్టుల వరకు అందరి శ్రమతోనే సాధ్యమయింది.

చాలా సంతోషకరమైన విషయం, గర్వపడే విషయం ఏమిటంటే - మారుమూల గ్రామాల్లో పర్మనెంట్‌గా కేంద్రాలు స్థాపించడం! క్యాంపులు కాదు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒరిస్సా...ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 157 కేంద్రాలు స్థాపించాం. పల్లెటూళ్లలో సేవలు అందించడం మాకెంతో సంతృప్తినిస్తోంది.

మా ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చే డాక్టర్లు సేవాభావం ఉన్న వారే వస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాలనే కోరిక కూడా వాళ్లకు ఉంటుంది. అలాంటి వాళ్లు మా ఇన్‌స్టిట్యూట్‌లో చేరాక మళ్లీ బయటకు వెళ్లరు. ఈ ముప్ఫై ఏళ్లలో బయటకు వెళ్లిన పాతిక, ముప్ఫై మంది కంటే ఎక్కువ ఉండరు.

మొన్నీమధ్యే బెజవాడలో చల్లా కోదండరాంగారు కలిశారు. ‘డాక్టర్‌గారూ! మీరు ప్రతిరోజూ మోర్‌ అండ్‌ మోర్‌ వెల్తీ అయిపోతున్నారని’ అన్నారు. నాకు భయమేసింది. నాపైన ఏమైనా రూమర్లు వస్తున్నాయా ఏంటి? అని. ‘దేని గురించి మాట్లాడుతున్నారండీ!’ అంటే, ‘మీరెప్పుడైనా ఆలోచించారా!ప్రతిరోజు పొద్దున లేవగానే కొన్ని వేల మంది మీకు దీవెనలు పంపుతున్నారు. ఆ వెల్త్‌ ఏ డబ్బు కొనగలదు?’ అని అన్నారు. అది నిజంగా ఒక మనస్సుకు హత్తుకునే స్టేట్‌మెంట్‌ అనిపించింది.

 

ఓకే... గుడ్‌ అండీ. మీరు ఈ రంగంలో మీరనుకున్న దానికంటే ఎక్కువగా సాధించాలని, పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఆశిస్తున్నా. థ్యాంక్యూ అండీ!

Updated Date - 2020-02-08T00:44:33+05:30 IST