ఒక ఫోటో జీవితాన్నే మార్చేసింది

ABN , First Publish Date - 2020-02-08T01:37:33+05:30 IST

స్వదేశంలో కోటా పద్ధతి వల్ల మెడికల్‌ పీజీ సీటు రాకపోవడంతో విదేశాలకు వెళ్లి.. తన తండ్రి పిలుపుతో మాతృభూమిలో సేవలు అందించేందుకు వచ్చిన వైద్యుడాయన. కార్పొరేట్‌ వైద్యసేవలను దేశానికి పరిచయం చేస్తూ అపోలో ఆస్పత్రులను స్థాపించారు. విదేశాల్లో గుండె వైద్యానికి అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువకే చికిత్స అందిస్తూ..

ఒక ఫోటో జీవితాన్నే మార్చేసింది

సూపర్‌ డీలక్స్‌ కారు ఫోటో చూసి.. స్వదేశానికి రమ్మని చెప్పకనే చెప్పారు

అందుకే వచ్చా.. అపోలో స్థాపించా

బీడీ, బీరు ఫ్యాక్టరీలకు రుణాలిచ్చి.. అస్పత్రులకు ఇవ్వలేదు

దేశంలో వైద్యరంగ ప్రగతికి రాజీవే కారకుడు

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో డాక్టర్‌ ప్రతాప్‌ సి. రెడ్డి


స్వదేశంలో కోటా పద్ధతి వల్ల మెడికల్‌ పీజీ సీటు రాకపోవడంతో విదేశాలకు వెళ్లి.. తన తండ్రి పిలుపుతో మాతృభూమిలో సేవలు అందించేందుకు వచ్చిన వైద్యుడాయన. కార్పొరేట్‌ వైద్యసేవలను దేశానికి పరిచయం చేస్తూ అపోలో ఆస్పత్రులను స్థాపించారు. విదేశాల్లో గుండె వైద్యానికి అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువకే చికిత్స అందిస్తూ.. 97 విజయాలు సాధించిన ఘనత అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డికే దక్కింది. భారతదేశంలో వైద్య రంగాభివృద్ధికి ఏకైక కారకుడు దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీయే అంటున్న ప్రతాప్‌ సి.రెడ్డితో 12-4-10న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’.. వివరాలు...మీ కుటుంబ నేపథ్యమేంటి?

మాది చిత్తూరు జిల్లా అరగొండ అనే గ్రామం. మాది ఉమ్మడి కుటుంబం. చిత్తూరులో హైస్కూలు చదువు. క్రిస్టియన్‌ కాలేజిలో ఇంటర్‌ చదివాను. ప్రెసిడెన్సీ కాలేజిలో బీఎస్సీ ఆనర్స్‌ చేరాను. మెడికల్‌ ఎంట్రన్స్‌ రాస్తే రాయలసీమలో టాపర్‌ అయ్యాను. అలా స్టాన్లీ మెడికల్‌ కాలేజిలో చేరాను. కాలేజి జీవితం చాలా బాగుండేది. ఏవో ఒక కార్యక్రమాల్లో ఉండేవాణ్ని. తొలి మెడికల్‌ ఎగ్జిబిషన్‌ నేనే మొదలుపెట్టా. కాలేజీ విద్యార్థుల సంఘం పెట్టి నెహ్రూను పిలిచాం. విదేశీ పర్యటనలకు పంపాలని కోరితే ఆయన శ్రీలంక పంపారు.


చిలిపి పనులు ఏం చేసేవారు?

ఆ వయసులో చేయాల్సినవన్నీ చేశాం. చాలా బాగా ఎంజాయ్‌ చేసేవాడిని. మోటార్‌బైకు మీద క్వీన్స్‌ మేరీ కాలేజికి వెళ్లేవాణ్ని. అదంతా యుక్తవయసులో సాధారణమే అయినా.. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు.


పీజీ విశేషాలేంటి?

తర్వాత పీజీలో చేరాలని వెళ్లి, వాళ్లడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పినా, నాకు సీటురాలేదు. కోపంగా వెళ్లి డీన్‌ను అడిగితే, కోటా వల్ల రాలేదని చెప్పారు. దాంతో ముందు లండన్‌, అక్కడి నుంచి అమెరికా వెళ్లాను. హూస్టన్‌ సిటీ ఆస్పత్రిలో చేరాను. మిస్సోరిలో ఆఫర్‌ వచ్చినా.. అక్కడ భారతీయులను చులకనగా చూసేవారు. దాంతో స్ర్పింగ్‌ఫీల్డ్‌ వెళ్లి సొంత ఆస్పత్రి పెట్టి విజయం సాధించాను.


ఇండియా రావాలని ఎందుకు అనిపించింది?

మా అక్కకు, నాన్నగారికి నేనక్కడ సాధించిన విజయాలన్నీ రాసేవాడిని. నాన్నగారికి కారంటే చాలా ఇష్టం. సూపర్‌ డీలక్స్‌ కారు కొన్నాక పిల్లలను దానిమీద కూర్చోబెట్టి ఫొటోతీసి పంపాను. ఆయన చాలా సంతోషిస్తారనుకున్నా. కానీ ఆ ఫొటో నా జీవితాన్నే మార్చేసింది. తర్వాత ఆయన రాసిన జవాబులో, ‘‘నీ విజయాలు చూసి ఇక్కడ నేను, అమ్మ ఇద్దరమే సంతోషపడుతున్నాం. అదే విజయాలు నువ్వు ఇక్కడ మనదేశంలో సాధిస్తే ఇంకెంతోమంది సంతోషిస్తారు’’ అని రమ్మని చెప్పకనే చెప్పారు. నాలుగునెలల్లో వచ్చేశాం. రెండోరోజు కాలేజికి వెళ్తే మా ప్రొఫెసర్‌ సుబ్రహ్మణ్యం తిట్టారు. ఇక్కడ వంద రూపాయలు కూడా రావన్నారు. చిన్న నర్సింగ్‌హోం పెట్టి, రెండేళ్లలో చాలా బిజీ అయిపోయాను. దేశంలోనే తొలిసారిగా గుండెకు సంబంధించిన పరికరాలు నా దగ్గర ఉండేవి. మా గురువుగారు డెంటెన్‌ కూలీ మంచి సర్జన్‌. ఎన్టీ రామారావు గారిని ఆయన వద్దకే పంపాను. ఈయన 9.11 నిముషాలకు ఆపరేషన్‌ చేయాలన్నారు. పీవీని కూడా నేనే పంపాను. ఓరోజు 38 ఏళ్ల మనిషి డబ్బులు లేక చనిపోయారు. పక్కన భార్య, పిల్లలు. ఇలా ఎందుకు జరగాలని బాధ కలిగింది.


రుణాల విషయంలో రాజీవ్‌గాంధీకి లేఖ రాశారు కదా..

మద్రాస్‌లో నాకు భూమి విషయంలో అభ్యంతరాలు పెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ జోక్యం చేసుకున్నారు. అక్కడే ఉన్న అంజయ్య గారిని లోపలకు పిలిచి, హైదరాబాద్‌లో ఆస్పత్రి పెట్టించాలని చెప్పారు. నేను ఎంపిక చేసుకున్న స్థలం చూసి అందరూ తిట్టారు. 1983 సెప్టెంబర్‌లో జ్ఞాని జైల్‌సింగ్‌ ఆస్పత్రిని ప్రారంభించారు. తొలి సంవత్సరం 300 గుండె ఆపరేషన్లు చేసి 93ు విజయాలంటే ఎవరూ నమ్మలేదు. తర్వాతి సంవత్సరం 540 చేసి, 97.4ు విజయాలు సాధించాను. 1984 జనవరిలో రాజీవ్‌కు లేఖ రాశాను. బీడీ ఫ్యాక్టరీకి, బీరు ఫ్యాక్టరీకి రుణాలిస్తూ ఆస్పత్రికి ఎందుకివ్వరని అడిగాను. వైద్యబీమా కూడా రావాలన్నాను. రెండు దశాబ్దాల్లో భారతీయ ఆరోగ్యరంగం ప్రపంచస్థాయికి వెళ్లిందంటే రాజీవ్‌గాంధీయే కారణం.


అపోలో సేవలను గ్రామస్థాయికి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారట కదా?

మా స్వగ్రామం అరగొండలో ఏర్పాటు చేశాం. అది టెలీ మెడిసిన్‌ సర్వీస్‌. మన దేశానికి మూడు అంశాల్లో బంగారు పతకాలొచ్చాయి.


అపోలో సేవలను గ్రామస్థాయికి విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారట కదా? 

మా స్వగ్రామం అరగొండలో ఏర్పాటు చేశాం. అది టెలీ మెడిసిన్‌ సర్వీస్‌. మన దేశానికి మూడు అంశాల్లో బంగారు పతకాలొచ్చాయి. ప్రపంచ మధుమేహ రాజధాని, క్యాన్సర్‌ రాజధాని మాత్రమే కాదు.. గుండె జబ్బుల విషయంలోనూ నెంబర్‌ వన్‌. ఈ మూడు మహమ్మారులనూ దేశం సరిహద్దులు దాటించడమే మా లక్ష్యం. ధూమపానం, స్థూలకాయం, హైబీపీ, రక్తంలో కొవ్వు, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన.. ఈ 7 భూతాలను దూరం చేసుకుంటే.. ఆరోగ్యం బాగుంటుంది.


ప్రజల వైద్యానికి ప్రభుత్వం కృషి చేస్తోందా...?

కార్పొరేట్‌ వైద్యం విస్తరిస్తుంటే.. ప్రభుత్వాస్పత్రులు క్షీణిస్తున్నాయి. అది నిజమే. ప్రజలకు ఎంత నాణ్యమైన చికిత్స అందుతుందో ప్రభుత్వం గమనిస్తుండాలి. ఎంత ఖర్చు చేసినా నాణ్యత లేకుంటే ఏం లాభం? ఎయిమ్స్‌ వంటి వైద్యసంస్థలు రాణిస్తున్నాయి. కానీ.. వారికీ పని ఒత్తిడి అధికం. 2030 నాటికి.. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో ఏటా లక్ష పడకలు ఏర్పాటు చేస్తేనే కానీ.. జనాభాకు సరిపోవు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 50 వేల కోట్లు ఖర్చు చేయాలి. 15 లక్షల మంది వైద్యులు, 25 లక్షలమంది నర్సులు కావలి. ఇవన్నీ సాధ్యమేనా?


రోగికి, వైద్యునికి మధ్య ఉండాల్సిన బంధం ఇప్పుడుందా?

లేదు. అప్పట్లో వైద్యులు రోగుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు. డాక్టర్‌ పూర్తిగా రోగులను పరిశీలించ కుండా.. వారి స్థితిగతులు, ఆరోగ్యపరిస్థితులేమీ విచారించకుండా.. పరీక్షలు చేయించడం సరికాదు. ఆధునిక టెక్నాలజీతో మంచి చికిత్స చేస్తున్నా.. రోగులతో మానసిక బంధాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం.


హోమియో, ఆయుర్వేదాలను అల్లోపతి వైద్యులు గుర్తించరు. మీరు వాటినీ తీసుకొచ్చారు. కారణమేమిటి?

అల్లోపతియే అల్టిమేట్‌ అని చెప్పడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అందుకు నా స్వీయానుభవమే కారణం. మా అన్నగారు 1953లో రుమటాయిడ్‌ హార్ట్‌డిసీజ్‌తో బాధపడేవారు. ఆయనను చూసిన వైద్యులు కొన్ని వారాలకన్నా బతకరన్నారు. మేం కోటిపల్లి దగ్గర ఆయుర్వేద చికిత్స చేయించాం. ఆరు వారాల తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుత మందులు నయం చేయలేని ఎన్నో జబ్బులకు ఆయుర్వేద ఔషధాలు నయం చేయగలవు.


మీకు దైవభక్తి కూడా ఎక్కువ కదా?

బాబాలనూ నమ్ముతాను. కానీ.. వివాదాల్లో ఇరుక్కోకుండా దేవుడే కాపాడుతున్నాడు. సత్యసాయి దగ్గరకు వెళ్తాను. చంద్రస్వామి వద్దకు వెళ్లలేదు. కానీ.. ఆయన పేషెంటుగా నా వద్దకు వచ్చాడు. నిత్యానందకు అమెరికా వీసా ఇప్పించడంలో సాయపడ్డాను.


దేశానికి మీరేం ఇచ్చారు?

అమెరికాలో ఉంటే నేను మల్టీమిలియనీర్‌ అయ్యేవాడినేమో. కానీ.. ఇక్కడుండి ట్రిలియనీర్‌నయ్యాను. దేశంలో వైద్యరంగాన్ని మేలిమలుపు తిప్పగలిగామన్న సంతృప్తి కోటానుకోట్ల ఆస్తిపాస్తులతో సమానం. ఇవాళ వైద్యం కోసం మనవాళ్లు విదేశాలకు వెళ్లట్లేదు. వాళ్లే ఇక్కడికొస్తున్నారు. ఇదే నేను దేశానికిచ్చింది. ఇందిర, రాజీవ్‌ ఎంతో సహకరించారు. నాకు ఎన్నో అవార్డులూ రివార్డులూ వచ్చాయి. వాటన్నింటికంటే.. నా అపోలో ఫ్యామిలీ. 63వేల మంది అపోలో కుటుంబసభ్యులు చూపించే అభిమానం వెలకట్టలేనిది. అదే దేశం ఇచ్చిన పెద్ద బహుమానం.

Updated Date - 2020-02-08T01:37:33+05:30 IST