అవును... ఐఏఎస్‌లు భ్రష్టుపట్టారు

ABN , First Publish Date - 2020-02-08T01:51:41+05:30 IST

ఐఏఎస్‌గా మీకు బాగా సంతృప్తినిచ్చిన హోదా ఏమిటి? వ్యవసాయ శాఖ డైరెక్టర్‌.. టొబాకో బోర్డు చైర్మన్‌. ఫైనాన్స్‌ సెక్రటరీ. ఫైనాన్స్‌ విభాగంలో కాలక్రమేణా సినికల్‌గా తయారవుతారనే అపవాదు ఉంది. కానీ, నా హయాంలో దానిని మార్చేందుకు ప్రయత్నించా. నా దగ్గరకు వచ్చిన ఫైల్‌ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేవాడిని.

అవును... ఐఏఎస్‌లు భ్రష్టుపట్టారు

వ్యక్తిగత నిజాయితీ లేకనే పతనం

ఒక్కరిపైనా దాడికి అనుమతివ్వలేకపోయా

నాకూ లంచాలు ఇవ్వడానికి ఎందరో ప్రయత్నించారు

బాబు ఇజ్రాయెల్‌ సేద్యం.. వైఎస్‌ మేఘమథనం నచ్చలేదు

22-11-10న ఓపెన్‌ హార్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌ రెడ్డి


ఐఏఎస్‌గా మీకు బాగా సంతృప్తినిచ్చిన హోదా ఏమిటి?

వ్యవసాయ శాఖ డైరెక్టర్‌.. టొబాకో బోర్డు చైర్మన్‌. ఫైనాన్స్‌ సెక్రటరీ. ఫైనాన్స్‌ విభాగంలో కాలక్రమేణా సినికల్‌గా తయారవుతారనే అపవాదు ఉంది. కానీ, నా హయాంలో దానిని మార్చేందుకు ప్రయత్నించా. నా దగ్గరకు వచ్చిన ఫైల్‌ను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేవాడిని. ఇది నిజంగా దండగ అన్న భావన వస్తే నో అని చెప్పేవాడిని. దానిపై ఎవరు చెప్పినా బతిమలాడినా, ప్రాధేయపడినా నోనే. ఇక, అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య కూడా నిర్ణయాల్లో నాకు స్వేచ్ఛనిచ్చారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఎన్టీరామారావు నన్ను ఎంపిక చేసి ప్రోత్సహించారు. ఆప్యాయంగా పలకరించేవారు.


రమాకాంతరెడ్డి ఇంటెలిజెంట్‌. అలాగే..యారగంట్‌ అంటారు..

కొంతమంది అధికారులు ‘నో’ కూడా చిరునవ్వుతో చెబుతారు. కానీ, నేను నో చెప్పినా ఎస్‌ చెప్పినా కటువుగానే చెప్పేవాడిని. కానీ నేను యారగంట్‌ అని వినడం ఇదే తొలిసారి.


విధి నిర్వహణలో మీరు మథనపడిన సందర్భాలు...

గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నప్పుడు కుప్పంలో ఇజ్రాయెల్‌ సేద్యం అమలు చేశాం. అప్పట్లో అప్పటి ముఖ్యమంత్రితో వాదించాం. విభేదం కూడా వచ్చింది. వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు మేఘమథనం గురించి ఆయనకు కూడా చెప్పాను. నేను చెప్పింది నచ్చలేదేమో నా అభిప్రాయాన్ని పక్కనపెట్టేశారు. మథనపడ్డాను.


తొందరగా ఆఫీసు నుంచి వెళ్లిపోతారనే అభిప్రాయం ఉంది...

ఐదున్నరలోపులో ఎప్పుడూ వెళ్లలేదు. ఆరున్నరకు వెళ్లేవాడిని. కానీ, గత ఏడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఆ రెండు రోజులూ రెండు రాత్రులూ ఆఫీసులోనే ఉన్నాను. రాత్రిపూట ఆఫీసులో పడుకున్న చీఫ్‌ సెక్రటరీని బహుశా నేనే మొదటివాడిని. 1995-96లో అనుకుంటా. అప్పటి ముఖ్యమంత్రి సంపూర్ణ మద్యనిషేధం పెట్టారు. అప్పట్లో నేను టుబాకో బోర్డు చైర్మన్‌గా ఉండేవాడిని. విదేశాల వచ్చే డెలిగేట్లకు మా ఇంట్లో భోజనాలు కూడా పెట్టేవాళ్లం. యూరప్‌ నుంచి వచ్చిన డెలిగేట్‌లకు కొబ్బరి నీళ్లు, కోకాకోలా ఇస్తే వాళ్లు తాగుతారా? మళ్లీ వస్తారా? అప్పట్లో సంపూర్ణ మద్యనిషేధం ఉన్నా కూడా ట్రేడ్‌ డెలిగేషన్స్‌ వచ్చినప్పుడు మా ఇంట్లో వైన్‌, బీరు, విస్కీ వాళ్లకి అందజేశాం. నిబంధనలు బ్రేక్‌ చేశారని మీరు అనవచ్చు. కానీ దేశ ప్రయోజనాలు, వృత్తిగత ప్రయోజనాల కోసం చేశాం.


మీరు ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య అవునా కాదా?

అబ్బే.. అలాంటిదేమీ లేదు. మీరు ఎవరినైనా అడగచ్చు.


ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామని ఎవరైనా ఆఫర్‌ చేశారా?

వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా.. టుబాకో బోర్డు చైర్మన్‌గా, ఫైనాన్స్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలు వచ్చాయి. చీఫ్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాయి. (ఆర్కే: మీకు చాలా పెద్ద మొత్తాలు ఆఫర్‌ చేశారంటారు) ముఖ్యంగా ఏసీబీ ఫైల్స్‌ సీఎస్‌ ద్వారానే వెళ్లాలి. అప్పుడు చాలామంది వచ్చేవాళ్లు. ‘మీ ఫైల్‌ పంపేశాను, ఇక నా చేతిలో ఏమీ లేద’నేవాడిని.


మీరు ఐఏఎస్‌ కావాలని అనుకున్నప్పుడు ఆ పదవి అంటే అత్యున్నత గౌరవం ఉండేది. ఇప్పుడు చాలా కిందిస్థాయికి దిగజారింది. ఇంత దిగజారుడు మీద మీ అభిప్రాయం.

చాలా తగ్గింది. చాలా. ఇందుకు మేమే బాధ్యులం. ఇతరులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఏ విషయాన్ని అయినా మంత్రికి డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం మనకి ఉండాలి. అంతగా అయితే బదిలీ చేస్తారు. అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేస్తారు. వ్యక్తిగత నిజాయితీ లేకపోవడంతోనే పతనం మొదలవుతోంది.


ఐఏఎస్‌లకు ఒక అసోసియేషన్‌ ఉంది కదా! ఐఏఎస్‌ల్లో విలువలు దిగజారిపోతుండడంపై ఎప్పుడూ చర్చ జరగదా!?

ఎప్పుడూ జరగలేదండి. నాకు తెలిసి యూపీలో మాత్రమే ఇటువంటి చర్చ జరిగింది.

Updated Date - 2020-02-08T01:51:41+05:30 IST