రాజకీయాలంటే ఇంట్రెస్ట్‌... అవకాశం వస్తే మళ్లీ పోటీ చేస్తా

ABN , First Publish Date - 2020-02-08T01:56:26+05:30 IST

మీరు ఎప్పటికీ చదువుతూనే ఉంటారా? ఇప్పటికీ రోజూ 3, 4 గంటలు చదువుతాను. (మీ సంస్థల్లో ఉపాధ్యాయులు కూడా..) ప్రస్తుత పరిస్థితుల్లో సిలబస్‌ తప్ప చదవడం తక్కువ. అందుకే ప్రతి మీటింగ్‌లో నిత్యం చదువుతూండమని చెబుతుంటాను.

రాజకీయాలంటే ఇంట్రెస్ట్‌... అవకాశం వస్తే మళ్లీ పోటీ చేస్తా

కేసీఆర్‌, డీఎస్‌ కుమారులు మా సంస్థల్లోనే చదివారు

కార్పోరేట్‌ విధానం వల్ల బేసిక్‌ కల్చర్‌ పోతోంది

శ్రద్ధ లేకనే ప్రభుత్వ విద్యావ్యవస్థ నీరుగారుతోంది

జర్నలిజం అంటే నాకు బాగా ఇష్టం

19-9-2011న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో విజ్ఞాన్‌ రత్తయ్య


మీరు ఎప్పటికీ చదువుతూనే ఉంటారా?

ఇప్పటికీ రోజూ 3, 4 గంటలు చదువుతాను. (మీ సంస్థల్లో ఉపాధ్యాయులు కూడా..) ప్రస్తుత పరిస్థితుల్లో సిలబస్‌ తప్ప చదవడం తక్కువ. అందుకే ప్రతి మీటింగ్‌లో నిత్యం చదువుతూండమని చెబుతుంటాను.


మరి విద్యార్థుల సంగతి?

ఈ కాలం విద్యార్థులలో చాలామంది న్యూస్‌ పేపర్లు కూడా చదివే పరిస్థితి లేదు. ఇలా సోషల్‌ అప్రోచ్‌ లేకపోతే సమస్యలను పరిష్కరించలేరు. అందుకే యువత ఫిజికల్‌గా ఉత్సాహంగా ఉంటున్నా మానసికంగా చాలా నిరాశగా ఉంటోంది. ఐడియాలజీ ఉండడం లేదు. కారణం ఉపాధ్యాయులే. సిలబస్‌ను మించి వారేమీ చెప్పడం లేదు.


ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మీ ఉద్దేశం?

మొదటిది పిల్లలు టూమచ్‌ ఫోకస్డ్‌గా ఉండటం. తల్లిదండ్రులే వారిని మార్కులు, ర్యాంకుల వెంట పరుగులు తీయిస్తూ అలా తయారు చేస్తున్నారు. రెండోది సామాజిక బాధ్యత తెలియకపోవడం. భాషలు, సోషల్‌ స్టడీస్‌ను పక్కన పెడుతున్నారు. పిల్లలు బాగా పైకి రావాలి. సంపాదించాలి అనుకుంటే.. సోషల్‌ సైన్సెస్‌ తప్పనిసరి.


మీ ప్రస్థానంలో ‘విజ్ఞాన్‌’ ప్రారంభానికి కారణమేమిటి?

ప్రారంభంలో ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రయత్నించాను. కానీ, ఐదువేలు అడిగారు. ఆ కాలేజీ యాజమాన్యం నా బంధువులే. మీరు నాకు ఒక్క ఉద్యోగం ఇవ్వడం కాదు. నేనే ఏదో ఓ రోజు 20 మందికి ఉద్యోగాలిస్తాను అని అప్పుడే చెప్పాను.


జర్నలిజాన్ని ఎందుకు వదిలేశారు?

ఇప్పటికీ నాకు జర్నలిజం అంటే ఎంతో ఇష్టం. సుప్రభాతం పత్రికను పదహారేళ్లు నడిపి రివైజేషన్‌ కోసం ఆపాను గానీ, ఇప్పటికీ ఇష్టమే. అలాగే వీక్లీతో కష్టమనే భావనతో దినపత్రిక లేకపోతే చానెల్‌ పెట్టాలనిపించింది. అదే సమయంలో ఇంజనీరింగ్‌ కాలేజీ పెట్టే అవకాశం వచ్చింది. రెండింటిలో ఆర్థికంగా విద్యారంగమే నయమనిపించింది.


మరి సొంతంగా వ్యవస్థ పెట్టడానికి డబ్బెలా వచ్చింది?

కొంత నా స్నేహితులు, మరికొంత నేను పనిచేసిన క్రిస్టియన్‌ కాలేజీవాళ్లు ఇచ్చారు. తరువాత కోచింగ్‌ సెంటర్‌ పెట్టాను. వర్కవుట్‌కాక ఇబ్బందులు పడ్డాను. (ఎంతకాలం?) రెండేళ్లు... మూడో సంవత్సరం నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.


ఆర్థిక ఇబ్బందులు దాంతో తీరాయంటారు?

మానసిక సంతృప్తి కూడా మిగిలింది. కొన్నేళ్ల కిందట చాలామంది తెలివైన పల్లెటూరి పిల్లలు చదువుకోసం పట్టణానికి వచ్చేవారు. సరైన మార్గదర్శనం లేక సినిమాలు, షికార్లం టూ తిరిగి ఆనక ఫెయిలయ్యే వారు. అలాంటి వారికోసం హాస్టల్‌తోపాటు చదువు చెప్పే రెసిడెన్షియల్‌ విధానం ప్రారంభమైంది. ఇందులో 99శాతం ఫలితాలు వచ్చాక అంతటా ఇదే విధానం మొదలైంది. అందుకే గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులపై శ్రద్ధ ఎక్కువ. మా సంస్థల్లో చదివిన చాలామంది నాకంటే మంచి స్థాయిలో ఉన్నారు. కేటీఆర్‌, డీఎస్‌ కొడుకు ఇక్కడే చదివారు. టెక్నికల్‌గా కూడా అమెరికాలో ఉన్నత స్థానాలకు వెళ్లారు.


బాగా తిడతారు.. బాగా పెడతారంటారు?

కార్పొరేట్‌ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో అసలు సమస్య భోజనం దగ్గరే. బాగా పెట్టడం లేదంటే తిండికోసం వచ్చారా? చదువుకోసమా? అనే ప్రశ్న ఎదురవుతుంది. దీంతో విద్యార్థులు వెళ్లేటప్పుడు సామగ్రి ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడతారు. ఈ సమస్య మాకెప్పుడూ రాలేదు. పేద గ్రామీణుల నుంచి ఫీజులు తక్కువ తీసుకోవడానికి సిద్ధం.


కార్పొరేట్‌ విద్యా సంస్థలకు పాత విద్యార్థులు వెళ్లకపోవడానికి కారణం?

చేరక ముందు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఈస్ట్‌మన్‌ కలర్‌ చూపిస్తారు. భోజనం సగం సగం పెడతారు. బాత్రూమ్‌సహా అన్నీ అధ్వానంగా ఉంటాయి. కొద్ది రోజుల తర్వా త తిట్టడం మొదలవుతుంది. కార్పొరేట్‌ విధానంవల్ల బేసిక్‌ కల్చర్‌ పోతోంది. సమాజంలో గొప్ప స్థానం ఉన్న గురువులను అడ్మిషన్లు తెచ్చేవారుగా మార్చేస్తున్నారు.


కార్పొరేట్‌, ప్రభుత్వ విద్యా విధానాలను బ్యాలెన్స్‌ చేయగలమా?

డబ్బు చెల్లించగలిగిన వారి కోసమైనా ప్రైవేటు సంస్థలు ఉండాలి. అంతకన్నా మంచి సిస్టమ్‌ ప్రభుత్వరంగంలో ఉండాలి. కార్పొరేట్‌ కాలేజీలు పెట్టినవారు కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకున్న వారే. కాబట్టి, అలాంటి ప్రభుత్వ రంగం ఉండొద్దనుకోవడం తప్పు. ప్రభుత్వ విద్యా సంస్థలలో జవాబుదారీతనం ఉంటే అవి ప్రైవేటు వాటికంటే ఎంతో పైస్థాయిలో ఉంటాయి.


ఈ విధానాలన్నింటినీ మళ్లీ ప్రవేశపెట్టాలంటారా?

నేనుగానీ, మరో కార్పొరేట్‌ నిర్వాహకుడు గానీ ఒక్కరం 20 యూనిట్లను చూసుకోగలుతున్నాం. ప్రభుత్వంలో తెలివైన ఐఏఎస్‌ అధికారులు, అంత పెద్ద యంత్రాంగం ఉండి ఎందుకు చేయలేరు? చిత్తశుద్ధి లేకనే. నేను ఎన్టీఆర్‌తో సన్నిహితంగా ఉండేవాడిని. రెసిడెన్షియల్‌ పాఠశాలల గురించి చెప్పాను. ఆ కోవలోనే ఆయన ఆశ్రమ పాఠశాలలు పెట్టారు.


పెద్ద ఎత్తున భూమి తీసుకుని క్యాంపస్‌లు కట్టారు. దీనికి కారణమేమిటి?

కాలేజీలకు విశాలమైన స్థలం, విద్యార్థులకు సౌకర్యంగా ఉండాలనే... ధరలు ఇంతగా పెరుగుతాయని ఊహించలేదు. వాటిని క్యాంపస్‌ల కోసమే వినియోగిస్తా.


రాజకీయాల్లో ఎందుకు ఫెయిల్‌ అయ్యారు?

ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు పోటీ చేయమంటే తిరస్కరించాను. ఆయన పోయాక ఆయన పేరుతో పెట్టిన పార్టీ తరపున పోటీ చేయాలని అడిగితే సెంటిమెంట్‌తో రంగంలో దిగి, విఫలమయ్యాను. చాలా గ్యాప్‌ తర్వాత లోక్‌సత్తా తరపున పోటీచేసి ఓడిపోయాను. (ఇప్పుడు రాజకీయాలను వదిలేస్తున్నారా?) లేదు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్‌. (ఎంపీ అనిపించుకోవాలని ఉందా?) కాదు. నా పాలసీలను రాజకీయ రంగంలో పాటిస్తే కోట్ల మం దికి ప్రయోజనం కలుగుతుందనే ఆలోచన ఉంది. అవకాశం వస్తే పోటీ చేస్తా.


మీ తరువాతి లక్ష్యం ఏమిటి?

విజ్ఞాన్‌ డీమ్డ్‌ యూనివర్సిటీని ఓ ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దటమే.

Updated Date - 2020-02-08T01:56:26+05:30 IST