బిర్యానీ పెడతానన్న కేసీఆర్‌.. ఇంతవరకూ పిలవలేదు

ABN , First Publish Date - 2020-02-08T02:00:33+05:30 IST

మా తాతగారు రామనరసు గారిది రాజమండ్రి. నిజాం ఆయన్ని పిలిచి, నిజాం కాలేజిలో ప్రొఫెసర్‌ని చేశారు. అప్పట్నుంచి ఇక్కడే ఉన్నాం. నేను తెలంగాణవాడినే. గండిపేట పానీ తాగినోళ్లమే.

బిర్యానీ పెడతానన్న కేసీఆర్‌.. ఇంతవరకూ పిలవలేదు

నేనూ తెలంగాణలోనే పుట్టి పెరిగాను.... మన్మోహన్‌తో మొదట్లో గొడవ అయ్యింది

ప్రపంచంలోనే విద్యావంతుడైన ప్రధాని.... ఆయనకు జిరాక్స్‌ మిషన్‌ అని పేరు పెట్టాం

రాష్ట్రం విభజిస్తే కేంద్రంపై ప్రభావం చూపలేం

హైదరాబాద్‌ను యూటీ చేసి... దేశానికి రెండో రాజధాని చేయాలి

15-11-10న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో బిజినెస్‌ స్టాండర్డ్‌ ఎడిటర్‌ సంజయ్‌ బారు


మీ స్వస్థలం ఏంటి?

మా తాతగారు రామనరసు గారిది రాజమండ్రి. నిజాం ఆయన్ని పిలిచి, నిజాం కాలేజిలో ప్రొఫెసర్‌ని చేశారు. అప్పట్నుంచి ఇక్కడే ఉన్నాం. నేను తెలంగాణవాడినే. గండిపేట పానీ తాగినోళ్లమే.


మీరు ముందు టీచర్‌, ఆపై జర్నలిస్టు, తర్వాత పీఎంవోలోకి వెళ్లారు. ఎందుకలా?

అదంతా యాదృచ్ఛికమే. ఓయూలో లెక్చరర్‌గా చేశాను. పదేళ్లు సెంట్రల్‌ వర్సిటీలో చేశాను. కొన్నాళ్లు ‘న్యూస్‌టైం’లో కాలమ్స్‌ రాశాను. ఎకనమిక్‌ టైమ్స్‌ నైనన్‌ అవి చూసి.. జర్నలిజంలోకి రమ్మని పిలిచారు. దాంతో ’90 మేలో చేరాను..


ప్రధానుల కుటుంబంతో మీకింత సాన్నిహిత్యం?

పీవీ 1956లో కరీంనగర్‌లో పోటీ చేసినప్పుడు మా నాన్నగారి రిటర్నింగ్‌ అధికారి. మన్మోహన్‌కు, నాకు మొదట గొడవ అయ్యింది. నేను చేసిన ఓ ఇంటర్వ్యూ.. ప్రచురితం అయ్యేసరికి తప్పులొచ్చాయి. దాంతో ఫోన్‌ చేసి తిట్టారు. తర్వాత సాన్నిహిత్యం వచ్చింది.


మన్మోహన్‌ బలాలు, బలహీనతలు ఏంటి?

బలాలు అందరికీ తెలిసినవే.. ప్రపంచంలోనే అత్యంత విద్యావంతుడైన దేశాధినేత. గట్టిగా చెప్పలేకపోవడం, బలహీనుడనే ఇమేజ్‌ ఆయన బలహీనతలు. మేం ‘జిరాక్స్‌ మిషన్‌’ అని పేరుపెట్టాం. కోపం వస్తే సర్దార్జీ ఎర్రగా అయిపోయేవారు.


రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేదెవరు?

చెప్పలేం. అదంత సులభం కాకపోవచ్చు.


సోనియా చేతిలో మన్మోహన్‌ రిమోటా?

అదేం లేదు. ఆమె పార్టీ అధినేత్రి, ఈయన ప్రభుత్వాధినేత. బాధ్యతల పంపకం ఉంది. కోర్‌ గ్రూప్‌ ఎప్పుడూ సమావేశమవుతుంది. నావరకు చూస్తే.. సోనియాకు ఈయన పెద్ద అంకుల్‌ లాంటి వారు


కేసీఆర్‌తో ఓసారి గొడవ వచ్చింది. అదేంటి?

కేసీఆర్‌ ప్రధానిని కలవడానికి వచ్చారు. ప్రోగ్రాంలో బీసీల తరఫున వినతి అని ఉంది. టీవీ వాళ్లు అడిగితే.. ఆయన తెలంగాణ గురించి కాదని, బీసీల గురించి చెప్పారని అన్నాను. దాంతో ఆయనకు కోపం వచ్చి, నన్ను తీసేయాలని అహ్మద్‌ పటేల్‌కు ఫోన్‌ చేశారు. తర్వాత కేసీఆర్‌ వస్తే.. నేనూ తెలంగాణ వాడినేనని చెప్పాను. అందుకాయన... లేదు, నా బ్రదర్‌వి.. ఇంటికొస్తే బిర్యానీ పెడతానన్నారు. కానీ ఇంతవరకు పిలవలేదు, పెట్టలేదు.


శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ ఏమవుతుందని మీ అభిప్రాయం?

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి.. నగరం అభివృద్ధి జరుగుతుందన్న హామీ ఇస్తే మేలు. ఇది దేశానికి రెండో రాజధాని కావాలి.


మీవి మొదట్లో వామపక్ష భావాలు. ఇప్పుడేమో పెట్టుబడిదారీ విధానానికి మద్దతిస్తున్నారు?

1987లో సోవియట్‌ యూనియన్‌కు వెళ్లాను. అప్పట్లో నేను సీపీఎం సభ్యుడిని. నన్ను రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి.. దేశం బాగు పడదని, తాను అమెరికా వెళ్లిపోవాలనుకున్నానని చెప్పాడు. దీనిపై జ్యోతిబసుతో చర్చించాను. క్రమంగా పార్టీ సంబంధాలు తెగిపోయాయి.


తెలంగాణపై మీ అభిప్రాయం ఏంటి?

మన దేశం సంకీర్ణ రాజకీయాలతో ఉంది. పెద్ద రాషా్ట్రల నుంచి వచ్చే పార్టీల ప్రభావం కేంద్రంపై పెరుగుతోంది. రాషా్ట్రన్ని విడదీస్తే తెలుగువాళ్లకు కేంద్రం మీద ప్రభావం చూపే అవకాశం పోతుంది. బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, బీహార్‌లకు ఉన్న పట్టు.. మనకూ ఇన్నాళ్లూ ఉంది. విభజన వస్తే.. పలుకుబడి తగ్గుతుంది. జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌.. అక్కడి ఎమ్మెల్యేలను అక్కడ ఎవరూ పట్టించుకోరు. అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ విభజిస్తే హిందీయేతర రాషా్ట్రల్లో మన ప్రాభవం కోల్పోతాం. ఇంత ముఖ్యమైన విషయం గురించి ఢిల్లీలో ప్రముఖ యువ నేతలు ఎవరూ ఆలోచించట్లేదు.

Updated Date - 2020-02-08T02:00:33+05:30 IST